మహిళలంటే పెద్ద కులాలవాళ్లేనా?
మహిళలంటే పెద్ద కులాలవాళ్లేనా?... is womans means larger caste womens only
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల ఢిల్లీలో ధర్నా చేశారు. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లు మరోసారి తెరమీదకు వచ్చి దేశమంతా హాట్ టాపిక్‌గా మారింది. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంతమాత్రమే.
ఆకాశంలో సగం....అవనిలో సగం అంటూ ఉమెన్స్ డే వేడుకల్లో ఆడవారిని పొగడ్తలతో ముంచెత్తడానికే రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి, అంతే తప్ప శాసనాలు చేసే చట్టసభల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
పార్టీల్లో మహిళల స్థానం..
దేశంలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ. వీటిల్లో కాంగ్రెస్ పార్టీకి మహిళే నాయకత్వం వహించినా ఏఐసీసీ అధ్యక్షురాలవడం మహిళా సాధికారత కిందకు రాదు. కేవలం కుటుంబ వారసురాలిగా సానియాకు పగ్గాలు దక్కాయి అంతే. ఇక బీజేపీలో పూర్వపు జనసంఘ్ నుంచి ఇప్పటివరకు పురుషుల ఆధిపత్యమే కొనసాగుతుంది. అప్పుడప్పుడు ఉమాభారతి లాంటి వాళ్ళు వచ్చి పోతారు, అలాగే స్మృతి ఇరానీ సహా కొంతమంది మహిళా నాయకులు బీజేపీకి అదనపు బలం. బీజేపీ విధానపరమైన నిర్ణయాల్లో మహిళల పాత్ర తక్కువే.
అలాగే మన దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుచ్చుకొచ్చాయి వాటిలో కొన్ని పార్టీలకు మహిళా నాయకత్వం ఉంది. వారే జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి ఇందులో మాయవతి మాత్రమే అట్టడుగు వర్గాల నుంచి ఎదిగిన నాయకురాలు. మిగతా ఇద్దరు అగ్రకులస్తులే. వీరి ఇద్దరి రాజకీయ నేపథ్యం కూడా భిన్నమే. కాంగ్రెస్ హైకమాండ్‌తో విభేదించి టీఎంసీ పార్టీని ఏర్పాటు చేసింది మమతా. అలాగే ఎంజీఆర్ మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఏఐఏడీఎంకే నాయకత్వాన్ని చేపట్టింది జయలలిత. అయితే మాయావతి ఒక్కరే దళిత కుటుంబంలో పుట్టి, అడుగడుగునా అవరోధాలను ఎదుర్కొంటూ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఎదిగారు. బహుజన్ సమాజ్ పార్టీని ఒక ప్రబలశక్తిగా తీర్చిదిద్దారు.
ఈ చట్టంలోనూ వారికి అవకాశం దక్కదా?
మహిళా రిజర్వేషన్ బిల్లు కొన్ని దశాబ్దాల కిందటిది. ఈ బిల్లును 1996 సెప్టెంబర్ 12న అప్పటి ప్రధాని దేవెగౌడ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఏకంగా చట్టాన్ని చేయడానికి సర్కార్ ప్రయత్నించడం నిస్పందేహంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టమైతే ముందుగా ప్రయోజనం కలిగేది పెద్ద కులాల మహిళలకే. మహిళా కోటాలో సంస్థానాధీశుల వారసులు, కార్పొరేట్ దిగ్గజాల కుటుంబాల్లోని ఆడవారు, భూస్వామ్య కుటుంబాల్లోని మహిళలు...ఇలా వీరే అటు అసెంబ్లీలు, ఇటు లోక్‌సభలోనూ పాగా వేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వర్గాలకు చెందిన మహిళలకు ఏమాత్రం అవకాశాలు దక్కవు. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళా కోటాను అగ్రవర్ణాలకు చెందిన ఆడవారు గద్దలా తన్నుకుపోతారు.
ఇప్పటికి సమాజంలో ఒక అగ్రకులంలోని మహిళతో ఒక బీసీ, ఎస్సీ మహిళ రాజకీయంగా పోటీపడే పరిస్థితులు లేవు. అందుకే ఈ రిజర్వేషన్ బిల్లుతో అట్టడుగు వర్గాల మహిళలకు కలిగే ప్రయోజనం గుండు సున్నా. ఈ నేపథ్యంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లులో సబ్ కోటా పెట్టాలని డిమాండ్ చేశాయి ఉత్తరాది పార్టీలైన రాష్ట్రీయ జనతాదళ్, సమజ్ వాది పార్టీలు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఈ సవరణలు చేయాలని బీసీ నాయకులు పార్టీలైన ఆర్జేడీ, ఎస్పీ పార్టీలు డిమాండ్ చేశాయి. కానీ ఈ సవరణలకు దేవెగౌడ ప్రభుత్వం చొరవ చూపలేదు. ఆ తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం కూడా అట్టడుగు వర్గాల మహిళలకు మేలు కలిగేలా బిల్లులో సవరణలు చేసి పార్లమెంటులో ఆమోదింపచేయడానికి చొరవ చూపలేదు. సవరణలు లేకుండానే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీంతో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది లోక్‌సభలో వీగిపోయింది.
బిల్లు అటకెక్కడానికి కారణం..
ఈ బిల్లు చట్టం కాకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయే అని చెప్పుకోవాలి. ఎందుకంటే యూపీఏ కూటమి తొలి ప్రభుత్వం ఏర్పడగానే బిల్లులో సవరణలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. అట్టడుగు వర్గాల మహిళల రాజకీయ ఎదుగుదలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిలేకపోవడమే దీనికి కారణమన్న విమర్శలు వచ్చాయి. పైగా ఈ బిల్లుకు రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాది పార్టీలు మోకాలు అడ్డుపెట్టాయంటూ కాంగ్రెస్, బీజేపీ సహా మిగతా రాజకీయ పార్టీలు విష ప్రచారం చేశాయి. కానీ మహిళా కోటాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్ కోటా ఎందుకు ఇవ్వకూడదో దేశ ప్రజలకు వివరించి చెప్పలేకపోయాయి. ఆర్జేడీ, సమాజ్‌వాది పార్టీలపై నిందలేసి రెండున్నర దశాబ్దాల పాటు కాలం గడిపేశాయి. చివరకు 2014 నాటికి మహిళా రిజర్వేషన్ బిల్లు కాలపరిమితి తీరిపోయింది. దీంతో బిల్లు అటకెక్కింది.
కానీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో టీఎంసీ, బిజూ జనతాదళ్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో మహిళలకు ఏకంగా 41 శాతం రిజర్వేషన్లను అమలు చేసి 41 శాతం సీట్లు అసెంబ్లీలోనూ, లోక్‌సభలోనూ మహిళలకు కేటాయిస్తుంది మమతా బెనర్జీ ప్రభుత్వం. ఒడిశాలో సైతం మహిళలకు 33 శాతం టికెట్లను కచ్చితంగా కేటాయిస్తోంది నవీన్ పట్నాయక్ ప్రభుత్వం. అందుకే రాజకీయ పార్టీలు ఇప్పటికైనా మహిళల రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో ముందు మీ చేతిలో ఉన్న రాష్ట్రాల్లో అమలుపరిచి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఆ తర్వాత దేశవ్యాప్త అమలుకు పోరాడాలి.
ఎస్. అబ్దుల్ ఖాలిక్
63001 74320