స్నాప్-డీ అడిక్షన్ కేంద్రాలు అవసరమేమో!
స్నాప్-డీ అడిక్షన్ కేంద్రాలు అవసరమేమో!.... is Snap-D addition centers required for present generation
డ్రగ్స్‌తో సమానంగా ఈ మధ్యకాలంలో యువతను బానిసలుగా మారుస్తున్న మరో వ్యసనం స్నాప్ చాట్ అని అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం కాదేమో. ఈ మధ్యకాలంలో యువత పోకడలను చూస్తుంటే మత్తు పదార్థం నుండి బయటపడేసే డీ అడిక్షన్ కేంద్రాల వలె స్నాప్ మత్తునుండి, స్నాప్ స్ట్రీక్‌ల పిచ్చి నుండి, super BFF, BFF, Best friend లాంటి బలహీనతల నుండి యువతను బయటకు లాగడానికి స్నాప్-డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయవలసిన ఆగత్యం ఏర్పడుతుందేమో అన్న భయం వెంటాడుతుంది.
స్నాప్ లోకంలో విచిత్రంగా యువతీయువకుల మధ్య స్నేహానికి పర్యాయపదం BFF అయింది, ప్రేమకు రుజువు Super BFF అయింది, అందులో Best friendsగా కొనసాగలేకపోవడం అవమానకరంగా తయారయింది. పసుపు హృదయం, ఎరుపు హృదయం, బంగారు హృదయం, గులాబీ హృదయాల కోసం వాస్తవ ప్రపంచంలో జీవించడం మానేసి స్నాప్‌ల కోసం అర్రులు చాపడం యువతకు అలవాటు అయింది. ఫోన్ ఉండి, అందులో స్నాప్ యాప్ ఉండి, సరిపడా స్ట్రీక్స్ ఉండాలి లేకపోతే జీవితమే లేదు స్టేటస్ పడిపోతుందనేది నేటి యువతరం ప్రధాన గోల్. ఒక్కరోజు స్ట్రీక్ మిస్సయితే ప్రాణం విలవిలలాడుతుంది, మీ వల్లనే మిస్సయిందని ఇంట్లో వాళ్ళతో యుద్దాలే చేసే పరిస్థితి ఏర్పడింది. కేవలం స్నాప్‌చాట్ యాప్ కోసం తల్లిదండ్రులమీద ఒత్తిడిచేసి, అప్పులుచేసి, ఆండ్రాయిడ్ ఫోన్లు కొంటున్న వెర్రి యువత లక్షల్లోనే ఉందంటే, ఈ ఫోన్ కొనిపించకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి వెనకాడడం లేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
జీవితాన్ని స్నాప్‌కు తాకట్టుపెట్టి
Best ఫ్రెండ్ కాలేకపోయానని, BFF స్టేటస్ పోయిందని పరితపిస్తూ అలమటించే అభాగ్యులను చూస్తుంటే జాలిపడాలా, సిగ్గుపడాలా అర్థం కావడం లేదు. తమ ప్రేమను రుజువు చేసుకోవాలంటే, తాము ప్రేమికులమని నమ్మించాలంటే, జీవితంలో నిన్ను మించిన ఫ్రెండ్ లేడని చెప్పాలనుకుంటే BFF, Super BFF, Best friend ఫ్రెండ్ సాధించాలి, దాన్ని నిలుపుకోవాలి, అందుకోసం క్రమం తప్పకుండా స్నాప్‌లు పంపాలి, ఎదుటివాళ్ళ నుంచి ఆశిస్తూ ఎదురు చూడాలి ఇదే పెద్ద పనైపోయింది యువతకు. 24 గంటలు దాటితే మారిపోయే స్టేటస్‌కు భయపడి అదేదో జీవిత ధ్యేయం అన్నట్లు, పరీక్ష కాలమా అన్నట్లు, మరిచిపోకుండా స్నాప్‌లే లోకంగా బతుకుతున్న, పరితపిస్తున్న యువజనాన్ని చూస్తుంటే వీళ్ళు జీవితంలో సాధించబోయేది ఏమైనా ఉంటుందా? అని అనిపిస్తుంటుంది.
స్నాప్‌చాట్‌లో స్నేహితులు బ్లాక్ చేస్తే విలవిలలాడటం, స్ట్రీక్‌లు తప్పిపోవద్దని పరితపించడం, తప్పిపోయాయని బాధపడటం, స్నాప్ చాట్ మీద గంటల తరబడి చర్చలు చేయడం నిత్యకృత్యమైపోయింది. బస్సులో వెళ్తూ, ఆఫీస్‌లో పనిచేస్తూ, గుడిలో, బడిలో, కనిపించే గోడలు, ఇంట్లో కర్టెన్లు, చౌరస్తా, బడ్డీకొట్టు, చాట్ బండి, సీనిమాహాలు, పబ్బులు, హోటల్లు పరిసరాలు ఏవైనా సరే స్నాప్‌లుగా మారిపోవాల్సిందే, స్ట్రీక్‌ల రూపంలో సంఖ్యను పెంచాల్సిందే. చాలా సందర్భాలలో ఆయా స్నాప్‌లకు, వీడియోలకు అసలు అర్థమే ఉండదు అయినా స్నాప్‌ల ఫ్లో ఆగడం ఉండదు. ఆగిపోతేనా ఆమ్మో పరువు పోదా, కిరీటం రాలిపోదా. ఈ భావదారిద్రాన్ని ఏమనాలి జీవితాన్ని స్నాప్‌కు తాకట్టుపెట్టడం అనాలేమో కదా.
అదే లోకంగా వ్యవహరిస్తూ..
ఇద్దరు లేక కొందరు వ్యక్తుల మధ్య భావ వ్యక్తీకరణ కోసం, పరస్పర వ్యక్తిగత సమాచారం, ఇతరత్రా సమాచారాన్ని పంచుకోవడం కోసం ఉద్దేశించి స్నాప్‌లో కొనసాగితే పర్వాలేదు. కానీ దానికి బానిసలుగా మారిపోయి అదే లోకంగా వ్యవహరిస్తే అంతకుమించిన బలహీనత మరేముంటుంది. స్నాప్‌లో సామాజిక అంశాలు పంచుకునే, చర్చించే అవకాశాలు దాదాపు శూన్యం, శాస్త్రీయ సమాచారం దాదాపు ఉండనే ఉండదు. తెరిస్తే మాయమయ్యే సమాచారం వలన మైనర్ పిల్లల మధ్య అర్థవంతమైన సమాచార మార్పిడి కన్నా అనర్థదాయకమైన సమాచార మార్పిడే పరస్పరం పరుగులు పెడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. దాచుకోడానికి, ధైర్యంగా ఇంకొకరితో పంచుకోడానికి వీలులేని సమాచారం ఎంతగొప్పదై ఉంటుందో ఎవరైనా చెప్పొచ్చు.
పిల్లల స్వేచ్ఛను హరించకుండా, అదే సమయంలో పిల్లలు తమ స్వేచ్ఛను అనుచిత రీతిలో ఉపయోగించుకోకుండా సరైన పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉన్నది. పిల్లల స్నాప్‌లలో ఫ్రెండ్స్ ఎవరు, BFF, Super BFF లు ఎవరు, వారి మధ్య ఏ సమాచారం మార్పిడి జరుగుతుంది, అసలు Super BFF, BFF స్థాయిలో స్నాప్ షేరింగ్ పిల్లలకు ఎంతవరకు అవసరం అనే దిశలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలతో చర్చించడం చేయాలి. తమ పోకడ సరేనా అనేదిశలో ఆలోచన చేయాల్సిన బాధ్యత యువతది, లేకపోతే రేపటి దేశ భవిష్యత్తుకు ప్రతిరూపాలైన బావిపౌరుల అమూల్యమైన సమయాన్ని, ఆలోచనా శక్తిని మనమే స్నాప్‌చాట్‌కు ధారాదత్తం చేసినవాళ్ళం అవుతాం.
చందుపట్ల రమణ కుమార్ రెడ్డి
న్యాయవాది
9440449392
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...