చట్టాల సక్రమ అమలుతోనే మహిళలకు భద్రత!

International Day for the Elimination of Violence against Women significance

Update: 2023-11-24 00:00 GMT

ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు అనగా ‌‌‌‌403 కోట్లు పైబడి (మొత్తం ప్రపంచ జనాభాలో 49.5%) ఉన్న నేటి తరుణంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియా ఖండాల్లో బాలికలు, మహిళలు తీవ్రమైన శారీరక, మానసిక, గృహహింసలకు లోనవుతూ జీవితాలు జీవచ్ఛవంలా గడుపుతూ ఉండటం పట్ల అందరం దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. మహిళలలను దైవ సమానంగా చూసే మనదేశంలో కూడా ప్రతి 16 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.‌ భారతదేశంలో రోజుకు సగటున 77 మానభంగాలు జరుగుతున్నాయి.‌ 2022లో మొత్తం మహిళలకు సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (యన్.సి.డబ్ల్యూ) కు అందిన ఫిర్యాదులు 31,000. వీటిలో ప్రత్యేకించి గృహహింసకు సంబంధించిన కేసులు 6,100. వీటిలో 55% శాతం ఉత్తర ప్రదేశ్ మహిళలవి. 10% శాతం ఢిల్లీ, 5% మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు సమాచారం. ప్రపంచంలో ఎక్కువగా గృహ హింసకు గురవుతున్న మహిళలు అమెరికా దేశంలోని ఓక్లహోమా రాష్ట్రానికి చెందిన వారు. 2023 తాజా సమాచారం ప్రకారం 40.7% గృహహింస బారిన పడినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక మనదేశంలో 2022 లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం 6,900 గ్రృహహింస కేసులు నమోదు అయినట్లు తెలిపారు.‌.మహిళా భద్రతలో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉండగా, భారతదేశం మహిళా రక్షణ సూచిలో 22 స్థానంలో ఉండటం గమనార్హం... జెండర్ ఈక్వాలిటీలో భారత్ 126వ స్థానంలో ఉండటం శోచనీయం.

క్రీడాకారిణులపైనా వేధింపులే..

మనదేశంలో మహిళా క్రీడాకారిణిలపై జరుగుతున్న వేధింపులు ఇటీవల రెజ్లింగ్ క్రీడాకారిణులు న్యూఢిల్లీలో చే‌సిన పోరాటం ద్వారా బహిర్గతం అయింది. అయినా, పాలకులు తగు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. 52% మహిళలు మాత్రమే నేటికీ వారికి నచ్చిన రీతిలో వివాహాలు జరుగుతున్నాయి.‌ అక్రమ రవాణా కేసుల్లో 71% మహిళలు, బాలికలే. వీరిలో ప్రతీ నలుగురిలో ముగ్గురు అఘాయిత్యాలకు గురవుతున్నారు. గర్భంలో ఉన్నప్పుడే భ్రూణ హత్యలు 20% జారుతున్నాయి అంటే ఎంత దారుణ పరిస్థితులు విస్తరించి ఉన్నాయో అర్థం అవుతుంది.‌ ముఖ్యంగా మూడు రకాలుగా సెక్సువల్, ఫిజికల్, సైకలాజికల్ హింసలకు గురవుతున్నట్లు గుర్తించారు.‌ కోవిడ్ కాలంలో మహిళలు, బాలికలపై గృహహింస, అఘాయిత్యాలు ఎక్కువగా జరిగినాయి. వీటిలో భాగస్వామి కుటుంబ సభ్యులే ఎక్కువగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అని తెలియవచ్చింది. ఈ రోజుకి 49 దేశాల్లో మహిళలు గృహహింస నుంచి రక్షించేందుకు చట్టాలే లేవు అంటే ఎంత పురుషాధిక్యత కొనసాగుతుందో మిగిలిన ప్రపంచం ప్రజానీకం అవగాహన చేసుకోవలసి ఉంది. ప్రపంచవ్యాప్తంగా చిన్నతనంలోనే వివాహాలు చేయడం వల్ల ప్రతీ ఏటా 22,000 మంది జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. దక్షిణ ఆసియాలో 2000 మంది మరణిస్తున్నారు. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో 9,600 బాలికలు బలైపోయారు. అంతేకాకుండా, యు.ఎన్. ఎఫ్.పి.ఏ నివేదిక ప్రకారం బ్రెస్ట్ ప్లాటినింగ్, బైండింగ్, బ్రాండింగ్, పెదవి డిస్కులు, మెడ పొడిగింపు, బ్రెస్ట్ ఐరనింగ్, వరకట్నం, బాల్య వివాహాలు, శారీరక దాడులు, ఆహార లోపాలు, సంతాన నియంత్రణ, హింసాత్మక ఆచారాలు, నేరాలు, లింగ వివక్ష, దూషణలు, శారీరక మానసిక హింసలు వంటి బాధలకు బాలికలు, మహిళలు గురై జీవచ్ఛవంలా బ్రతుకులు ఈడుస్తున్నారు అని తెలిపింది.

స్త్రీలకు కనీస రక్షణ కల్పించాలి

ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై హింస నిరోధించే విధంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1979, 1999, 2008 వివిధ తీర్మానాలు చేసి, మహిళలకు కనీస రక్షణ, హక్కులు కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 1981 నుంచి నవంబర్ 25వ తేదీన మహిళా హింసా వ్యతిరేక దినోత్సవం జరుపుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఈ ఆధునీకరణ ప్రపంచంలో అందరూ సమానమే అనే భావన అందరిలోనూ కలగాలి. సాటి మనిషిగా మహిళలను గౌరవించాలి. స్త్రీ లేనిదే మానవ మనుగడ లేదని గ్రహించాలి.‌ ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల అలవాట్లుపై శ్రద్ధ తీసుకోవాలి.‌ వారు చూసే పలు ఇంటర్నెట్ వైబ్సైట్‌లు, చేసే స్నేహాలు పరిశీలన చేయాలి. తప్పులు చేస్తే, స్నేహితుల వలే సరిచేయాలి.‌ నైతిక విలువలు, కుటుంబ సంబంధాలు తెలపాలి.‌ ప్రభుత్వాలు కూడా మహిళలకు పలు చట్టాలు నిర్భయ, దిశ, దిశ యాప్, షీ టీం వంటివి ఏర్పాటు చేసి రక్షణ అందిస్తున్నాయి. బాలికల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాయి. మహిళలు కూడా ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలి. చదువు, ఉద్యోగం, ఉపాధి పొందుట ద్వారానే మహిళలు ఈ నవీన కాలంలో సమాజంలో సగౌరవంగా బ్రతుకగలరనే భావన వచ్చినప్పుడే మహిళల సాధికారత కల సాకారం అవుతుందని ఈ దినోత్సవం సందర్భంగా అందరూ గ్రహించుటయే పరమార్థం. మనదేశంలో ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టం తక్షణమే అమలు చేయాలి. మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేయాలి. బడుగు బలహీన వర్గాల మహిళలు గిరిజన మహిళలు, మైనారిటీ మహిళలపై ఎక్కువగా అఘాయిత్యాలు మానభంగాలు వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఇటీవల కాలంలో మనం అందరం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. మహిళా చట్టాలు సక్రమంగా అమలు చేయడం ద్వారానే, నేరస్తులను కఠినంగా శిక్షించుట ద్వారానే మహిళలకు భద్రత చేకూరుతుంది...

(రేపు అంతర్జాతీయ మహిళా హింసా వ్యతిరేక దినోత్సవం)

ఐ. ప్రసాదరావు

99482 72919

Tags:    

Similar News