ఇప్పటికీ అస్పృశ్యతా భారతమేనా!?

India still has a caste system, Dalits are considered untouchables.

Update: 2023-06-04 00:45 GMT

నేడు కులం నిచ్చెన మెట్ల మీద ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. ఉత్పత్తి శక్తులకు పనివ్వకుండా వారిని వలసపక్షులుగా మార్చివేశారు. రెండు తెలుగు రాష్ట్రాల దళిత బహుజన కార్మికులు ముంబైలోనూ, పూనాలోనూ, బెంగుళూరు లోనూ, మద్రాసులోనూ, కలకత్తాలోనూ, రాళ్లెత్తే కూలీలుగా మారిపోయారు. అనేక దేశాలలో దళిత బహుజన స్త్రీలు ఇళ్లలో పాచీ పనివారుగా జీవిస్తున్నారు. వారికి భద్రత లేదు. సరైన నివాసాలు లేవు. అనేక వ్యాధులకు గురై అక్కడికక్కడే మరణించినా శవ ఖనన కార్యక్రమాలు కూడా చేసే దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి కారణం ఎవరు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాదా?

కావాలనే వారి జీవితంపై దెబ్బ!

నేడు ఊళ్లు సజీవంగా లేవు. ఉత్పత్తి లేని ఊళ్లు చీకటి కొట్టుల్లా ఉన్నాయి. గిరిజనుల్లో అయితే గర్భవతులను హాస్పిటల్‌కు మోసుకెళ్లే మధ్యలోనే చనిపోతున్నారు. వ్యవసాయ కూలీలు మొత్తం మీద ఇరవై రోజుల కంటే ఊరులో ఉండటం లేదు. దాంతో వాళ్ళు కుండా, చట్టి పట్టుకుని, చిన్న పిల్లల్ని చంకలో వేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లి రైల్వే స్టేషన్లు, ప్లాట్ ఫామ్స్ లోనూ, ఫుట్‌పాత్‌ల పైనా, చావిళ్ళలో దుర్భరమైన జీవితం జీవిస్తున్నారు. ఏ పల్లెలోనూ కుటీర పరిశ్రమలు లేవు. వ్యవసాయ ఉత్పత్తులకు తగిన కుటీర పరిశ్రమలను గ్రామ గ్రామంలో రూపొందించుకోవాల్సిన బాధ్యతను మరిచారు. దళిత బహుజనులను దెబ్బతీయడం కోసం వ్యవసాయ పారిశ్రామికతను పెంచుతూ హరిత విప్లవం పేరుతో వ్యవసాయానికి యంత్ర పరికరాలు రూపొందించి ఒకే ఎకరంలో ఎక్కువ ధాన్యం పండించే విధానం తీసుకొచ్చారు. దీనితో భూమి రేట్లు విపరీతంగా పెరిగాయి. లక్షల, కోట్ల రూపాయిల్లోకి భూమి రేట్లు వెళ్లాయి. భూమి అమ్మే విషయంలో దళితులు ముందున్నారు. కొనే విషయంలో లేరు. ఈ యంత్ర పరికరాల వల్ల నాటు, కోత, కుప్పనూర్పిడికి వ్యవసాయ కూలీల అవసరం తగ్గుతూ వచ్చింది. మరి కుటీర పరిశ్రమలు లేక, వ్యవసాయ కూలీ లేక దళితుల జీవనం ఎలా? అని ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. దళితుల జీవితాలపైన కావాలనే దెబ్బతీస్తున్నారనేది మనకు ఇక్కడ స్పష్టమవుతుంది.

దళితులపై భీకర దాడులు

ముఖ్యంగా దళితులకు కల్పించిన హక్కుల మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. బ్రాహ్మణ వాదం ముసుగులో పాలకులు రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ వ్యవస్థ కోరలు నూరుతున్నారు. పాలకుల నోట రైతు అనే శబ్దం బహుదా ఉచ్చరించబడుతుంది తప్పితే దళిత అనే శబ్దాన్ని విస్మరిస్తున్నారు. బీజేపీ పాలనలో, రెండు రాష్ట్రాల అగ్రకుల పాలనలోనూ దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయి. 2011లో దళితులపై 33,719 దాడులు జరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల వెల్లడించాయి. దీని ప్రకారం దళితులపై హింసాత్మక దాడులు విపరీతంగా పెరిగాయి. దళితుల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టే దాడులు జరగడమే కాకుండా కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లోనూ, స్కూళ్ళలోనూ, గ్రామాల్లోనూ అనేక ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. 2011లో 33,719 దాడులు జరిగితే 2022 నాటికి 50,291కి పెరిగాయి. అంటే దాడులు చేసిన వారి మీద ఎస్సీ,ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం లేదు. దళితులు పోలీస్ స్టేషన్ కెళితే వారిని అవమానిస్తున్నారు. వారిపై అత్యాచారాలు చేస్తున్నారు. తెలంగాణలో మరియమ్మ అనే దళిత తల్లిని చంపిన విషయం కూడా మన కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.

కులతత్వాన్ని ప్రోత్సహిస్తూ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైతే ఒక అడుగు ముందుకేసి దళితులకు రాజ్యాంగం కల్పించిన ప్రధానమైన అంబేద్కర్ విదేశీ చదువు స్కీమ్‌ను రద్దు చేసి జగన్ పేరుతో ఆ స్కీమ్‌ను మార్చారు. ప్రపంచవ్యాప్తంగా తెలిసిన అంబేద్కర్ పేరును రద్దు చేసి పక్క రాష్ట్రాల్లో కూడా తెలియని జగన్‌మోహన్ రెడ్డి పేరుతో ఆ స్కీమ్‌ను మార్చడమే కాక ఆ స్కీమ్‌ లబ్దిదారులుగా దళితుల సంఖ్యను తగ్గించి ప్రతిభ పేరుతో ఆ స్కీమ్‌ను అన్ని కులాలకు అని వర్తింపజేసి దళితులకు మొండిచెయ్యి చూపించే విధానలను అనుసరిస్తున్నాడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధుల్ని రద్దుచేసే సాహసం చేయడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడానికి బహిరంగంగా సిద్ధపడటమే. సబ్ ప్లాన్ నిధుల వల్ల దళితులకు ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఏర్పడుతుంది. వారిలోని పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, నిరుద్యోగం, అణచివేత వంటి వాటన్నింటినీ నివారించడానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకునే అవకాశం కలుగుతుంది. దాని మీద గొడ్డలి వేటు వేశారు. తెలంగాణా ప్రభుత్వం కూడా సబ్ ప్లాన్ నిధుల్ని వ్యవసాయ భూముల్ని కొని దళితులకు ఇచ్చే స్కీమ్ ఉపయోగించడం లేదు. నిర్మాణాత్మకమైన దళిత అభివృద్ధి మీద బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ సమ్మెట దెబ్బ వేశాయి. దీనితో చదువుకున్న విద్యార్థులు దిక్కు తోచక, పనిలేక, ప్రోత్సాహం లేక బ్యాంకుల లోన్లు ఇవ్వక ఇంటా, బయటా అపహాస్యానికి గురై, ఆత్మహత్యా సదృశ్యంగా బతుకుతున్నారు. ఇకపోతే ఒక పక్క కులం లేదని చెబుతూ కులాన్ని, మతాన్ని యధేచ్చగా ప్రోత్సహిస్తూ అగ్రకులాలు రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ కులాల సంస్థలకు, ట్రస్ట్‌లకు బ్యాంకులు విపరీతంగా ధనాన్ని ఇస్తూ, మత కేంద్రాలను ప్రోత్సహిస్తూ అంబేద్కర్ యువజన సంఘాలకు మొండి చెయ్యి చూపిస్తూ కులతత్వాన్ని యధేచ్చగా మూడు ప్రభుత్వాలూ ప్రోత్సహిస్తున్నాయి.

రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి!

మహిళలను ఉద్ధరిస్తున్నామని రోజూ ప్రకటించుకుంటున్న ఈ ప్రభుత్వాలు స్త్రీ విద్య అత్యున్నతంగా జరుగుతున్న ఈ దశలో ఉద్యోగాలను ఊరిస్తూ ఊరిస్తూ జాబ్‌లకు నిర్ధిష్ట ప్రణాళిక, ప్రకటనలు చేయకుండా వారిని నిరాశావాదులుగా మార్చి కుటుంబాలలో తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు. వయసు, జాతి, వర్గ,వర్ణ, లింగ, బేధం లేకుండా మత్తుమందులు, మద్యం సరఫరా చేస్తూ యువశక్తిని, నిర్వీర్యం చేసి అరాచక శక్తులుగా మార్చి వేస్తున్నారు. నిజానికి పాలకులు దళిత ద్రోహులుగా, దళిత జీవన వ్యవస్థ విధ్వంసకులుగా, దళిత చట్టాలు కాలరాసే వారుగా తమ పాలన కొనసాగిస్తున్నారు. అందుకే ఇప్పటికీ అస్పృశ్యతా భారతంగానే దేశం ఉంది. అందుకే రాజస్థాన్‌లో కుండలో మంచి నీళ్ళు తాగినందుకు ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టి చంపిన ఉదంతం మన కళ్ళముందు కన్పిస్తుంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సాక్షిగా, అంబేద్కర్, ఫూలే, మార్క్స్ వాదులు ఇక ఉపేక్షించడానికి వీల్లేదు. దళిత బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. దళితుల జీవించే హక్కుపై ఉక్కు పాదం మోపుతున్న అగ్ర కుల పాలకవర్గాన్ని దించి అందరికీ సంపద పెంచే కుల అస్పృశ్యతా నిర్మూలనకు రాజ్యాంగ బద్ధమైన ఆచరణను కలిగి ఉండే ప్రభుత్వాలను దళిత బహుజన మైనారిటీ ప్రభుత్వాలను రూపొందించుకోవడమే నాటి చారిత్రక కర్తవ్యం.

డా. కత్తి పద్మారావు

దళిత సామాజిక ఉద్యమ కర్త,       

98497 41695

Read More...   నికార్సైన సాయుధ పోరాటయోధుడు రావి

Tags:    

Similar News