విలీనం తెచ్చిన స్వాతంత్య్రం - యాడవరం చంద్రకాంత్ గౌడ్
తెలంగాణ వీరుల పురిటి గడ్డ. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాడారు.
తెలంగాణ వీరుల పురిటి గడ్డ. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాడారు. దుర్మార్గులైన రజాకర్ల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం నిజాం రాచరిక నియంతృత్వ విధానాలకు విసిగి తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతుల్లో, ధిక్కార స్వరం వినిపించింది. ఆయుధం ధరించి పోరాడిన వారు కొందరైతే, అక్షర ఆయుధంతో పోరాడిన వారు మరికొందరు.
బ్రిటిష్ వారి అధికారం కింద ఆనాడు దేశంలో వివిధ స్థాయిలో సుమారుగా 550 సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ వారు భారత్ నుంచి వెళ్లిపోతుండగా ఆ సంస్థానాలు కూడా స్వతంత్రం పొందాయి. భారతదేశంలో విలీనం అవుతాయో, పాకిస్తాన్ లో విలీనం అవుతాయో లేక స్వతంత్రంగా ఉంటాయో నిర్ణయించుకోమని ఆ సంస్థానాలను కోరారు. రాచరిక కుటుంబాల పాలన కొనసాగాలని ప్రజలకు లేదు. హైదరాబాద్ సంస్థానంలో పాలక జమిందార్లకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది.
సంస్థానాల ప్రజా ఉద్యమాలకు కాంగ్రెస్ మద్దతిస్తూ అవి భారతదేశంలో విలీనమై కొత్త రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరింది. 1947 జూలైలో ఈ బాధ్యతను హోంమంత్రి సర్దార్ పటేల్‌కి అప్పగించారు. ఆయన భారతదేశంలో విలీనం కావలసిన ఆవశ్యకత గురించి రాచరిక కుటుంబాలతో చర్చించాడు. వాళ్లు తమంతట తాము విలీనం కాకపోతే, ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి సైన్యాన్ని పంపించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశాడు. 1947 ఆగస్టు 15 నాటికి కాశ్మీర్, హైదరాబాద్, జునాఘడ్ తప్పించి మిగిలిన సంస్థానాలు భారతదేశంలో విలీన ఒప్పంద పత్రంపై సంతకం చేశాయి.
హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాకిస్తాన్ యూనియన్‌లో కలపడానికి ప్రయత్నం చేశాడు. ప్రజలు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ గ్రామాలపై పడి దోచుకు తినేవాడు. చిన్న పిల్లలు, ముసలి వాళ్లు, ఆడవాళ్లను చూడకుండా వికృతమైన చర్యలను చేసేవారు. మహిళలను వివస్త్రను గావించి బతుకమ్మ ఆడించి, నీచమైన కార్యాలకు పూనుకున్నారు రజాకారులు. అంతే కాకుండా గ్రామాల్లో భూస్వామ్య, పెత్తందారులు దేశ్ ముఖ్ ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోయాయి.
వీటన్నింటి పట్ల విసిగి వేసారి పోయారు తెలంగాణ ప్రజలు. దున్నే వాడికి భూమి అనే నినాదంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి లాంటి నాయకత్వంలో ప్రతి గ్రామంలో సాయుధ దళాలు ఏర్పాటు చేసి పోరాటం కొనసాగించారు. వారికి ప్రజలు కూడా మంగళ హారతులు పట్టారు. దీంతో నిజాం ప్రభువు ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆయుధాలు ధరించి సంచరిస్తున్న వీరిని పట్టుకుని కాల్చి చంపేయమని ఆదేశాలు జారీ చేశాడు.
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నట్లు బ్రిటిష్ వారు ప్రకటించిన తరువాత, తెలంగాణ ప్రజా సమూహం ఇండియన్ యూనియన్ లో విలీనం చేయమని ఉద్యమించారు. వీరికి జాతీయవాదులు మద్దతు పలికారు. ముఖ్యంగా కాంగ్రెస్ వాదులు వారికి సహకారం అందించారు. స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రజాభిలాష నెరవేర్చాలనే కోరిక గమనించిన తొలి ఉప ప్రధాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం ప్రభువుకు హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం తప్పనిసరి చేయాలని చెప్పిన వినకుండా, ప్రజా ఉద్యమాలను అణచి వేయడానికి ప్రయత్నం చేశాడు. భారత ప్రభుత్వం జనరల్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ పోలో చేపట్టి బలవంతంగా హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ కలిపారు. నిజాం రాజు సర్దార్ పటేల్‌కు లొంగిపోక తప్పలేదు. తెలంగాణ ప్రజలంతా సంతోషించారు. స్వతంత్ర భారతావనికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం 17 సెప్టెంబర్ 1948న వచ్చింది.
(సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా...)
- యాడవరం చంద్రకాంత్ గౌడ్
94417 62105