సహజసిద్ధంగా ఏర్పడిన ఇంధన సంపదను అక్షయపాత్రలా భావించి, విచ్చలవిడిగా వినియోగించుకుంటూ పోతున్న పరిస్థితుల్లో సాంప్రదాయ ఇంధన వనరుల లభ్యత భవిష్యత్తులో ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే మానవ అవసరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంధనం లేనిదే మానవ మనుగడ అసాధ్యంగా మారిపోయింది. ఉక్రెయిన్, రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధం వలన ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ దేశాలను చమురు సంక్షోభం మరింతగా కుంగదీసింది.
అప్పుడే ప్రపంచం మేల్కొని ఉంటే..
చమురు కోసం ప్రపంచంలోని చాలా దేశాలు ఇతర దేశాల మీద ఆధారపడటం వలన తలెత్తుతున్న పరిణామాలను గుణపాఠాలుగా నేర్చుకుని, అన్ని దేశాలు ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. సహజ ఇంధన వనరుల స్థానంలో చౌకగా లభించే ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలి. ఇందుకోసం సాంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలి. పైగా ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఇంధనాల వలన ప్రపంచంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. ఎక్కువగా బొగ్గు వలన అధికంగా కాలుష్యం వెలువడుతున్నది. దీని వలన కర్బన ఉద్గారాలు అధికం మొత్తంలో విడుదలై, గ్లోబర్ వార్మింగ్ పెరుగుదలకు కారణమవుతుంది. విచ్చలవిడిగా ఇంధన వనరులను ఉపయోగిస్తూ ప్రపంచాన్ని ముందుకు తీసుకుపోతున్నామని భ్రమించిన వారికి తరిగిపోతున్న ఇంధన వనరులను చూసి, భవిష్యత్ అవసరాలపై ఆందోళన చెందడం సహజం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే సాంప్రదాయేతర ఇంధన వనరుల వాడకంపై అవగాహన పెరుగుతున్నది. దశాబ్ద కాలం ముందు ప్రపంచం మేల్కొని ఉంటే ప్రస్తుతం నెలకొంటున్న అవాంఛనీయ పరిణామాలకు ఆస్కారం ఉండేది కాదు. పర్యావరణ సంబంధిత సమస్యలే కాకుండా తరిగిపోతున్న సాంప్రదాయ ఇంధన నిక్షేపాలను కాపాడుకుని ఉండేవారం.
ఏ దేశమైనా అభివృద్ధి బాటలో పయనించాలన్నా, అందరికీ ఉపాధి అవకాశాలు కావాలన్నా ఆయా దేశాల్లో పారిశ్రామిక, సాంకేతిక, రవాణా, వ్యవసాయ, సేవా రంగాలలో విప్లవాత్మక మార్పులు రావాలి. ఈ రోజుల్లో ప్రతీ రంగం ఒకదానితో మరొకటి ముడిపడి ఉంది. ఇలా ప్రతీ రంగాన్ని ముందుకు నడిపించడానికి ఉపయోగపడేది ‘శక్తి’. ఆ శక్తి ఇంధనం వలన లభిస్తుంది. ఇంధనం పైనే మన అవసరాలన్నీ ఆధారపడి ఉన్నాయి. ఈ అవసరాలను గుర్తించే మన శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరిపి మనకు విభిన్న రకాలైన ఇంధన వనరులను వినియోగంలోకి తెచ్చారు. వారి పరిశోధనల పర్యవసానమే అన్ని రంగాలు ముందంజలో దూసుకుపోతున్నాయి. పెరుగుతున్న ప్రపంచ జనాభాకు కొంతవరకైనా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇందనం లేకపోతే ప్రపంచం ఏమైపోతుందో ఊహకందని విషయం.
బయో ఇంధనాలు వాడాలి..
అయితే క్రమేపీ మనం వాడుతున్న ఇంధన వనరులు తరిగిపోవడమే కాకుండా పలు రకాల పర్యావరణ సమస్యలను తెచ్చిపెట్టాయి. వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నది. కలుషిత ఉద్గారాల వల్ల గాలి కాలుష్యం, జలకాలుష్యం జరిగి మానవుడు రోగాల పాలవుతున్నాడు. భూతాపం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచమంతా ‘గ్లోబల్ వార్మింగ్’పై గగ్గోలు పెడుతున్నది. చెట్లను నరికి, వాటిని కూడా ఇంధనంగా వాడడం వలన గాలిలో అవాంఛనీయ వాయువులు పెరిగిపోయాయి. మనం పీల్చే గాలి స్వచ్ఛతను కోల్పోయింది. ప్రాణాధార ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోయింది. జల కాలుష్యం వలన తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించడానికి తాగునీటిని శుద్ధి చేసే యంత్రాలొచ్చాయి. మన అవసరాలను ఆధారం చేసుకుని, త్రాగునీరు ఇప్పటికే వ్యాపారాత్మకమైన అంగడి సరుకుగా మారిపోయింది. ఇక మున్ముందు నీటి వలే గాలి కూడా పెద్ద వ్యాపారంగా మారుతుందనడంలో సందేహం లేదు. కలుషితగాలికి ప్రత్యామ్నాయంగా కొన్ని దేశాలలో స్వచ్ఛమైన గాలిని బంధించి విక్రయించడం కూడా జరుగుతున్నది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే సమీప భవిష్యత్తులో నీటి శుద్ధి యంత్రాల వలే గాలిశుద్ధి ప్లాంట్లు కూడా ఆవిర్భవించక తప్పదు. భవిష్యత్తులో ఎదురయ్యే ఇంధన వనరుల సమస్యను అధిగమించడానికి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకం తప్పనిసరి. నార్వే లాంటి దేశాలు ఇప్పుటికే పునరుత్పాదక వినియోగ ఇంధనాల (రెన్యూవబుల్ ఎనర్జీ)ను ఉపయోగించి విద్యుదుత్పత్తిని చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఆస్ట్రేలియా లాంటి దేశాలు విద్యుత్‌తో నడిచే వాహనాలను పూర్తిగా వినియోగంలోకి తెచ్చి, శిలాజ ఇంధనాలైన పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా నడిచే వాహనాలను అరికట్టి, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ లాంటి ఉద్గారాల విడుదలకు కొంతవరకు అడ్డుకట్ట వేయడం జరిగింది. చైనా, ఆస్ట్రేలియా, యూ.కె, స్విట్జర్లాండ్, జర్మనీ, నెదర్లాండ్ వంటి దేశాలు ఎలక్ట్రిక్ వాహనాలను అధికంగా వినియోగిస్తున్నారు. సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగంలో దూకుడుమీదున్న అమెరికా కూడా బయో ఇంధనాల వాడకంపై దృష్టి పెట్టడం ముదావహం.
రాబోవు పరిణామాలపై దృష్టిపెట్టాలి..
శిలాజ ఇంధనాలు ప్రకృతిసిద్ధంగా ఏర్పడినవే. ఇవి ఏర్పడడానికి లక్షలాది సంవత్సరాలు పట్టింది. ఇవి తరిగిపోవడానికి ఎంతో సమయం అవసరం లేదు. బొగ్గు, పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న ప్రపంచం ఈ రకమైన ఇంధన వనరులు పరిసమాప్తమైన తర్వాత కుప్పకూలిపోక తప్పదు. ప్రపంచ అభివృద్ధి రథచక్రాల నడక ఆగిపోక తప్పదు. ప్రపంచం దారుణమైన అస్తవ్యస్త పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. అందుకే అన్నిదేశాలు మొద్దునిద్ర వీడుతున్నాయి. రాబోవు విపత్కర పరిణామాలపై దృష్టి పెడుతున్నాయి. అయితే ఈ కృషి సరిపోదు. ఒకసారి వినియోగానికే తప్ప, పునరుత్పత్తికి, పునర్వినియోగానికి పనికిరాని సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించి, సౌరశక్తి, పవన శక్తి, తరంగ శక్తి వంటి కాలుష్య రహితమైన సాంప్రదాయేతర పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి సారించాలి. మనదేశంలో కూడా బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నప్పటికీ సౌరశక్తి, వాయుశక్తి ఆధారిత విద్యుత్‌పై దృష్టి కేంద్రీకరించడం శుభపరిణామం. మన ప్రణాళికలు భవిష్య అవసరాలకు తోడ్పాటు నందించాలి. ఇంధన రంగంలో వినూత్నమైన మార్పులు సంతరించుకోవాలి. కాలుష్య రహిత ఇంధనాలకు అధిక ప్రాధాన్యత నివ్వాలి.
(నేడు జాతీయ ఇంధన వనరుల పరిరక్షణ దినోత్సవం)
-సుంకవల్లి సత్తిరాజు
సామాజిక విశ్లేషకులు
97049 03463