జీపీఎస్‌కి తలవూపితే... వృద్ధాప్యానికి ఉరితాడే!

If you say OK to GPS...employee will face difficulties in old age!

Update: 2023-06-28 00:45 GMT

2004 తర్వాత ఉద్యోగాల్లో నియమితులైన ఉద్యోగుల పెన్షన్ విషయం ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారుతోంది. తొలినుంచి ఉన్న పెన్షన్‌ను రద్దుచేసి ప్రయివేటు కార్పొరేట్ మూకలకు ధారాదత్తం చేయడంతో ఉద్యోగులు గళమెత్తక గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. 2004 జనవరి 1న, భారత ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ నోటిఫై చేసింది, దీనికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని పేరు పెట్టారు. NPS దేశవ్యాప్తంగా 2009 మే 1 నుండి అమలులోకి వచ్చింది. స్వచ్ఛంద ప్రాతిపదికన అసంఘటిత రంగంలోని స్వయం ఉపాధి నిపుణులు దీని పరిధిలోకి వచ్చారు. కానీ ఉద్యోగ జీవితం నుంచి రిటైరయ్యాక వృద్ధాప్యంలో పడబోయే బాధలు, బాధ్యతలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. పాలకుల వంచనకు గురై తెలివిలోకి వచ్చేసరికి రెండు దశాబ్దాల కాలం గడిచిపోయింది. ఇప్పుడు సీపీఎస్ స్థానే జీపీఎస్ పేరుతో మరో చిత్రానికి స్క్రీన్ ప్లే సిద్ధం కావడంతో ఉద్యోగుల్లో కలకలం మొదలైంది.

అసలు పెన్షన్ అనేది భిక్ష కాదు. అదొక హక్కు. 1857లో భారత స్వాతంత్ర్య పోరాటం తర్వాత బ్రిటిష్ పాలకులు భారతదేశంలో పెన్షన్ వ్యవస్థను ప్రారంభించారు. అది బ్రిటన్‌లో అప్పుడు అమలులో ఉన్న పెన్షన్ స్కీమ్ యొక్క ప్రతిబింబం. కానీ ఈ వ్యవస్థ నిబంధనలు ఉద్యోగులను వారి పదవీ విరమణ చెల్లింపులు అనంతర జీవితాన్ని నిరుత్సాహపరిచాయి. కాబట్టి, ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటూ, 1857 నాటి పెన్షన్ సిస్టమ్ స్థానంలో ఇండియన్ పెన్షన్ యాక్ట్ 1871 వచ్చింది. 1881లో రాయల్ కమీషన్ ఆన్ సివిల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను అందించింది. 1919, 1935 సంవత్సరాల్లో రూపొందిన భారత ప్రభుత్వ చట్టాలు మరిన్ని నిబంధనలు తీసుకొచ్చాయి. ఈ పథకాలను తరువాత ఏకీకృతం చేశారు. పైగా ప్రభుత్వ రంగంలోని మొత్తం శ్రామిక జనాభాకు పదవీ విరమణ ప్రయోజనాలను అందించడానికి వీటిని విస్తరించారు.

సీపీఎస్, జీపీఎస్ మధ్య తేడా

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వల్లెవేస్తున్న అంశాలను పరిశీలీస్తే, సీసీఎస్‌లో పెన్షన్ అనే పదం లేదు. కేవలం యాన్యూటీ - అది కూడా అనిశ్చితితో కూడుకున్నది . రిటైర్డ్ ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతంలో సుమారు 20% మాత్రమే యాన్యూటీ గా వచ్చే అవకాశం. అది కూడా సర్వీస్ సమయంలో, రిటైర్ అయ్యాక ఉన్న వడ్డీరేట్ల మీద, స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ 20 శాతం కన్నా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. రిటైర్ అయిన ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతం రూ.1 లక్ష అయితే వచ్చే యాన్యూటీ కేవలం రూ.20 వేలు మాత్రమే.

జీపీఎస్ అనేది గ్యారెంటీ తో కూడిన పెన్షన్. రిటైర్డ్ ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతంలో 50% కచ్చితంగా అందుతుంది. మార్కెట్లో హెచ్చుతగ్గులు, వడ్డీ రేట్లు తగ్గడం లాంటి సమస్యలతో జీపీఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు. రిటైర్ అయిన ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతం రూ.1లక్ష అయితే కచ్చితంగా రూ.50 వేలు పెన్షన్ గా అందుతుంది. ద్రవ్యోల్బణం వల్ల పెరిగే జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకోదు. యాన్యూటీ తప్ప వేరే ఏ విధమైన సదుపాయం లేదు. ద్రవ్యోల్బణం ఆధారిత డీఆర్ (Dearness Relief) లకు ఇందులో అవకాశమే లేదు.. 62 ఏళ్లకు ఉద్యోగి రిటైర్ అయ్యారనుకుంటే... రిటైర్మెంట్ సమయంలో వచ్చిన యాన్యూటీ , ఉద్యోగి చనిపోయే వరకు పెరిగే అవకాశం లేదు. అది మరో 20 ఏళ్లు కావచ్చు లేదా 30 ఏళ్లు కావచ్చు. గ్యారంటీ పెన్షన్ కాకపోవడంవల్ల రిటైర్ అయిన ఉద్యోగికి యాన్యూటీ ఎంత వస్తుందీ అన్న దానిపై స్పష్టత లేదు. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగే జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి 6 నెలలకోసారి ద్రవ్యోల్బణ ఆధారిత డీఆర్ (Dearness Relief) ఇస్తారు. ద్రవ్యోల్బణం వల్ల నష్టపోకుండా, ద్రవ్యోల్బణంతో ఆధారిత డీఆర్ రిలీఫ్ ఇవ్వడం వల్ల పెన్షన్ ప్రతి ఏటా పెరుగుతూ పోతుంది. తద్వారా రిటైర్ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలకు భరోసా ఉంటుంది.

62 ఏళ్లకు ఉద్యోగి రిటైర్ అయ్యారనుకుంటే, చివరి నెల బేసిక్ జీతం రూ.1 లక్ష అనుకుంటే, అందులో సగం రూ.50 వేలు పెన్షన్ అందుతుంది. ఇది ప్రతిఏటా పెరిగి 20 ఏళ్ల తర్వాత, ద్రవ్యోల్బణ ఆధారిత డీఆర్ (సుమారుగా సంవత్సరానికి 6%)కారణంగా వచ్చే పెన్షన్ రూ.1.10లక్షల పైనే ఉంటుంది. ప్రతి సంవత్సరానికి సుమారుగా 3,000 చొప్పున వృద్ధి ఉంటుంది. పెన్షన్ విషయంలో పూర్తి గ్యారెంటీ ఉంటుంది. తనకు పెన్షన్ ఎంత వస్తుందీ అన్నది ఉద్యోగికి ముందుగానే తెలుస్తుంది. వారి ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునేందుకు ఇది దోహదపడుతుంది.. ప్రతి ఉద్యోగి నెలకు 10% జమ చేయాలి. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఇందులో కూడా ఇదే కొనసాగుతుంది. GPS అమలుకు ఎంత ఆర్థిక భారమైన ప్రభుత్వమే భరిస్తుంది. ఇంతకుమించి ఉద్యోగి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు.

జీపీఎస్.. వాస్తవాలు

ఉద్యోగులు తన బేసిక్ పే, డీఏ నుండి 10 శాతం కాంట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది.. ప్రభుత్వం మాత్రం తన 10% కాంట్రిబ్యూషన్ ఇవ్వదు... ఉద్యోగుల నుంచి వసూలు చేసిన పది శాతం కాంట్రిబ్యూషన్‌ని ఒక నిధిగా ఉంచుతారు... NSDL కు జమ చేయడం ఆపేస్తారు... గ్రాట్యూటీ అనగా చివరి 16 నెలల వేతనం ఇవ్వరు... చివరి బేసిక్ పే లో 33% పెన్షన్ గా ఇస్తారు దానికి డిఏ కానీ పిఆర్సీ వంటి ప్రయోజనాలు వర్తించకపోవచ్చు. ఉద్యోగి తన వాటా నుంచి జమ చేసిన 10% కాంట్రిబ్యూషన్ నిధి లోనుండి రిటైర్మెంట్ తర్వాత 37% మాత్రమే చెల్లిస్తారు. దానికి పన్ను కూడా కట్టవలసి ఉంటుంది.

సీపీఎస్ కంటే జీపీఎస్ ప్రమాదకరం

వాస్తవానికి సీపీఎస్ కంటే జీపీఎస్ అనేది చాలా ప్రమాదకరమైనది, ప్రభుత్వం సీపీఎస్ తొలగించి స్థానే జీపీఎస్ అమలు చేస్తున్నామంటోంది. కారణం... సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కాదు... కేవలం ప్రభుత్వం మీద భారం తగ్గించుకోవడానికి మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు సీపీఎస్‌లో ప్రతి ఉద్యోగికీ (బేసిక్ + డీఏ) లో 10% ఉద్యోగి మొత్తానికి ప్రభుత్వం కూడా 10% జతచేసి వేయవలసి వస్తుంది. కాబట్టి ఆ భారాన్ని వదిలించుకోవడానికి జీపీఎస్ అనే సర్వాంగ సుందరమైన గణాంకాలతో కొంగ్రొత్త నిర్వచనాలతో తీసుకురానుంది. అందులో 10% వేయాల్సిన బాధ్యతను కూడా తొలగించుకోబోతోంది. సీపీఎస్ అనేది తొలగించక పోయినా దేశమంతా ఒకే విధానం అమలులో ఉంటుంది. లాభం నష్టాలు అందరికీ ఒకేలా ఉంటాయి. సమన్యాయం ఉంటుంది. కానీ జీపీఎస్ అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తే రాబోయే రోజుల్లో జీపీఎస్‌కి వ్యతిరేకంగా ఏపీ ఉద్యోగులు మాత్రమే సీపీఎస్ కావాలని ఒంటరిగా పోరాడాల్సినటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.

ఎన్‌పీఎస్‍లో ఇక పెన్షన్‌పై హామీ!

ఇదిలావుండగా దేశంలోని అనేక రాష్ట్రాలు పాత పెన్షన్ వైపు అడుగులు వేస్తుండడంతో జాతీయ పింఛను పథకంలో కీలక మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పూర్వపు పెన్షన్ అమలుకు హామీ ఇవ్వనుండడంతో మోడీ ప్రభుత్వం ఇకపై రిటైర్డ్ ఉద్యోగులకు నిర్దిష్ట మొత్తం పెన్షన్ అందేలా ఎన్‌పీఎస్‌లో మార్పులు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లో ఉన్న ఎన్‌పీఎస్‌ విధానంలో నిర్దిష్ట పెన్షన్‌కు ఎలాంటి హామీ లేదు. ఇప్పుడు ఉద్యోగి రిటైర్ అయ్యాక చివరి వేతనంలో 40 - 45 శాతం పెన్షన్ అందుకునేలా ఎన్‌పీఎస్‌లో మార్పులు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత పెన్షన్ విధానంలో (OPS) ఉద్యోగి తన వంతుగా ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకసారి ఉద్యోగ విరమణ చేశాక చివరి నెల జీతంలో 50 శాతం మొత్తం ప్రతి నెలా పెన్షన్ అందుకుంటారు. దీనివల్ల పెన్షన్ చెల్లింపులకే ప్రభుత్వం అధిక భాగం చెల్లించాల్సి వస్తోంది. అదే ఎన్‌పీఎస్‌లోనైతే ఉద్యోగి తన వాటాగా 10 శాతం చెల్లించాలి. ప్రభుత్వం తన వాటాగా 14 శాతం చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని డెట్, ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేస్తారు. అయితే, NPS కింద పెన్షన్ మొత్తానికి ఎలాంటి హామీ ఉండదు.

పాత పెన్షన్ విధానమే భేష్

జీపీఎస్ అనే ఒక దుర్మార్గపు ఆలోచనను లోతుగా చూస్తే అది ఉద్యోగుల పాలిట యమపాశం, దీనికంటే సీపీఎస్‌ నయం అనేలా ఉంది. ఇందుకు ఉదాహరణగా 2008 DSC లో ఎస్‌ఏగా చేరిన వ్యక్తి ఉదాహరణ తీసుకుంటే, అతని అకౌంట్‌లో ప్రస్తుతం 16 లక్షల సీపీఎస్ డబ్బు ఉంది అది గవర్నమెంట్ స్వాహా. ఈరోజు అతని సీపీఎస్ కటింగ్ 8500, గవర్నమెంట్ వేసే 8500 మొత్తం 17000 స్వాహా. రేప్పొద్దున రిటైర్మెంట్ తర్వాత చెల్లించే నగదు సున్నా. ఇప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల సర్వీసు ఉంటే అతని మొత్తం సీపీఎస్ డబ్బు ఒక కోటి ఉంటే 60 లక్షల డబ్బు వెనక్కి ఇచ్చి మిగిలిన డబ్బు షేర్‌లలో పెట్టి ఎంతో కొంత నెల నెలా ఇచ్చేవారు. ఇప్పుడు అది కూడా లేదు. రిటైర్మెంట్ తర్వాత డీఆర్ ఇవ్వక్కర్లేదు. రిటైర్మెంట్ తర్వాత పీఆర్‌సీ ఇవ్వక్కర్లేదు. ప్రధానంగా సీపీఎస్ ఉద్యోగుల 10% మనం వాడుకోవచ్చు, గవర్నమెంట్ కట్టే ప్రస్తుత 10% (త్వరలో 14%) మిగిలిపోతుంది. పైగా 20 సంవత్సరాల తర్వాత ఎవరు అధికారంలో ఉంటారో! అప్పుడు కథకు ఆనాటి ప్రభుత్వం ఎలాంటి ముగింపు ఇస్తుందనేది ఎవరూ చెప్పలేరు. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల నుంచి మినహాయించుకొంటున్న వాటాకు, గత ఏడు నెలలుగా తన వాటాను జమ చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఇవాళ జీపీఎస్‌కి తలవూపితే వృద్ధాప్యానికి ఉరితాడు తగిలించుకున్నట్లే! ఇక ఎప్పటికీ పాత పెన్సషన్ స్కీం ను డిమాండ్ చేసేందుక్కూడా అవకాశం కోల్పోయినట్లే! కాబట్టి సకల హితకారిణి పాత పెన్షన్ విధానం మాత్రమే...!

-మోహన్ దాస్,

ఏపిటిఎఫ్ 1938

94908 09909

Tags:    

Similar News