న్యాయవాదులు రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తేనే..

If lawyers give judgments beyond all temptations..

Update: 2024-05-17 00:45 GMT

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యూడిషరీ, మీడియా. ఈ నాలుగు స్తంభాలు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లు చేసే వ్యవస్థలు. 143 కోట్ల ప్రజల హక్కుల పరిరక్షణకు, రాజ్యాంగ సంరక్షణకు ఆశా దీపాలు.. ఈ వ్యవస్థల్లో పనిచేసిన కొందరు భారత రాజ్యాంగాన్ని, చట్టాలను సరిగా అమలు చేసి ప్రజల హక్కులు కాపాడబడాలని ఆకాంక్షించిన వారు. వాటి అమలుకు కృషి చేసినవారు.

ఎన్నికల నిర్వహణ అనగానే దేశ ప్రజలందరికీ గుర్తొచ్చే పేరు టిఎన్ శేషన్. అలాగే పౌర హక్కులు అనగానే తార్కుండే, కన్నాభిరాన్, బాలగోపాల్... ఇలా ఎందరో.. మానవతావాదులు అనగానే ఎస్. ఆర్. శంకరన్, బి. డి. శర్మ, న్యాయాధీశుల తీర్పుల విషయానికొస్తే మనల్ని ప్రభావితం చేసే పరిపూర్ణ వ్యక్తిత్వం కలవారు కొద్దిమందే ఉంటారు. గొప్ప ఫిలాసఫర్లు,న్యాయవాదులు, జర్నలిస్టులు,మేధావులు,చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, త్యాగధనులు, విప్లవకారులు మరెందరికో జన్మనిచ్చిన నేల ఇది. వీరు జీవించి ఉంటే పరిస్థితి ఎంత బాగుండేదో కదా! అని ఇప్పటికీ అనిపిస్తుంది. వీరంతా భారత దేశ చరిత్రలో చిరస్మరణీయులు.

నిష్పక్షపాతంగా తీర్పులివ్వడానికి..

ఈ సందర్భంలో గుర్తొచ్చే పేరే సుప్రీంకోర్టు ఏడవ ప్రధాన న్యాయమూర్తి, పద్మవిభూషణ్ పి. బి. గజేంద్రగడ్కర్. ఈయన గురించి ప్రచారంలో ఉన్న ఒకానొక కథ అందరికీ ఆదర్శం, అనుసరణీయంగా ఉంటుందన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. ఒకానొకసారి ఆయన ఇంటికి ఉదయం పూట వెళ్లిన ఒక పెద్దమనిషి, గడ్కర్ గారు దినపత్రిక చదవడం గమనించాడు. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే, అది సుమారు రెండు మూడు నెలల కిందటి పాత పేపర్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. సంశయం తీర్చుకునేందుకు ఇదేమిటి సార్? ఇది ఈరోజు పేపర్ కాదు కదా! పాత పేపర్ ఎందుకు చదువుతున్నారు? అని అడిగేశాడు. దానికి గడ్కర్ గారు నవ్వుతూ.. పాత పేపర్ చదివితే అలనాటి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అదే ఈరోజు పేపర్ చదివితే, సమకాలీన అంశాలు, నా ఆలోచనలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. దానివల్ల నేను ఇచ్చే తీర్పులపై ఆ ప్రభావం పడుతుందేమోనన్న ఆలోచన కారణంగా పాత దినపత్రికను చదువుతున్నాను అన్నారట. ఎంత గొప్ప విషయం ఇది. న్యాయమూర్తిగా, న్యాయస్థానంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా, రాగద్వేషాల కతీతంగా తీర్పులు రావాలనే ఆకాంక్ష కారణంగానే తమను తాము చట్టపు, చట్రంలో బిగించుకొని తీర్పులిస్తుంటారు. అలాంటి వారికి ఇది గొప్ప ఉదాహరణ.

ప్రలోభాలకు గురై తీర్పులిస్తే..

ఈ మధ్య న్యాయమూర్తుల అందరూ భారత శిక్షాస్మృతినే అమలు చేయాలి. కానీ, శాస్త్రీయ విశ్లేషణ, మానవీయ కోణం, పరిశీలనా విధానంలో మార్పు కారణంగా తీర్పులు వేరే విధంగా వచ్చాయని భావించక తప్పదు. ఇది సమాజంలో ఆందోళన కలిగించే విషయం. ఈ మధ్య న్యాయమూర్తులు అభిప్రాయాలు వేరే వేరే ఉండటంతో.. ఒకే నేరానికి సంబంధించి అభియోగం చేయబడిన వ్యక్తి, మోపబడిన అభియోగాలు ఒకటే ఉన్నప్పటికీ న్యాయమూర్తులు మారడం వలన తీర్పులు వేర్వేరుగా ఉన్నాయి. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు. కానీ, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నది భారత శిక్ష సంస్కృతి గొప్పతనం. రాజకీయాలకు, మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించగల వారే చిరస్మరణీయులుగా చరిత్రలో నిలిచిపోతారు. ప్రలోభాలకు గురై తీర్పు ఇచ్చేవారు ప్రజల మనో ఫలకాలపై దోషులుగా మిగిలిపోతారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను పరిగణనలోకి తీసుకుని తీర్పులిస్తే భారత న్యాయ వ్యవస్థకు, రాజ్యాంగ మూలాలకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. అనుమానాలకు తావుండదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాల్సిన వారు, నిత్య జాగరూకులై ఉండటం ఎంతో అవసరం. ప్రజలను ప్రేమించే వారు, వ్యవస్థను రక్షించాలి అనుకునేవారు మాత్రమే ఈ కర్తవ్యాన్ని నెరవేర్చగలరు. అప్పుడే చరిత్ర పుటలలో వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

రమణాచారి

సామాజిక విశ్లేషకులు

99898 63039

Tags:    

Similar News