అంబేడ్కర్ జీవితంపై హృద్యమైన సినిమా

Heartfelt movie on Ambedkar's life

Update: 2023-12-09 00:30 GMT

గౌతమ బుద్ధుడు, మహాత్మ ఫూలేలు చూపిన మార్గంలో., భారతదేశాన్ని సామాజిక అసమానతల నుండి విముక్తం చేయడానికి జీవితాంతం ఒక మహోన్నత పోరాటాన్ని కొనసాగించిన ఉద్యమకారుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. ఉద్యమకారులు ఎవరూ.. తమకు విగ్రహాలు కట్టించమని.. దండలు వేసి పూజలు చేయమని మనల్ని కోరరు. తమ ఉద్యమ ఆశయాలను అర్థం చేసుకొని.. తాము కొనసాగించిన ఉద్యమాన్ని నేటి తరం వారసులు మరింత ముందుకు నడపాలని మాత్రమే వారు కోరుకుంటారు. అంబేద్కర్ మహనీయుడు కూడా మన నుండి కోరుకునేది బిల్కుల్ అది మాత్రమే. ఆయన్ని నడిపించిన మహోన్నత ఆశయాలని.. ఆయన నడిపిన ఉద్యమ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి.. అంబేడ్కర్ రచించిన పుస్తకాలను చదవడం.. ఆయన జీవితం నిండా సాగిన పోరాటాలని అధ్యయనం చేయడమే సరైన సాధనం.

తరాలను మార్చిన మనీషి

భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల మధ్య సమానత్వం కోసం జరిపిన పోరాటంలో మొత్తం సమాజానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి చేసిన పోరాటానికి నాయకత్వం వహించారు. సామాజిక సమానత్వం నేటికీ ప్రశ్నార్థకంగానే ఉన్నప్పటికీ దళిత బహుజనులు ఇప్పుడు కాస్త ఆర్థిక సమానత్వం పొందుతున్నారు. అవిశ్రాంతంగా, నిస్వార్థంగా పనిచేసిన మెస్సయగా బాబాసాహెబ్‌ని చెప్పుకోవడం తప్పు కాదు. ఆయన చేసిన ఉత్కృష్టమైన పని... భారతదేశంలోని తరాల ప్రజల జీవితాలను మారుస్తోంది. ఈ సినిమా ఆ మహనీయుడికి నివాళి. అంబేడ్కర్ పాత్రలో ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి జీవించారు. దక్షిణ భారతదేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరిగా ఆయనను ఎందుకు పిలుస్తారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఎంతో రీసెర్చ్ చేసి, మంచి స్క్రీన్ ప్లే, బలమైన కథనంతో జబ్బార్ పటేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లో విడుదలై ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా సామాన్యులకు అందరికీ అందుబాటులోకి వచ్చింది.

గొప్ప సామాజిక సంస్కర్త

అంబేడ్కర్ జీవితాన్ని హృద్యంగా తెరకెక్కించి జబ్బార్ పటేల్ తీసిన డా. బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమా మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిర్మించారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి అంబేద్కర్‌గా నటించాడు. 9 సంవత్సరాల క్రితం కొందరు అంబేద్కరిస్టులు దీన్ని తెలుగులోకి డబ్బింగ్ చేశారు. అంబేద్కర్‌ని.. నీలాంటి నాలాంటి ఒక సామాన్య మానవుడిగా.. ఒక సామాన్య మానవుడు కులవివక్షను ఎదిరించి నిలబడి ఉద్యమకారుడిగా పరిణమించిన తీరుని.. చాలా చక్కగా ఆవిష్కరిస్తుంది ఈ సినిమా. అంబేద్కర్ అంటే ఏమిటో.. అంబేద్కర్ వారసత్వాన్ని కొనసాగించడం ఎలాగో నేర్చుకోవడానికి ఈ సినిమా మనకు సహాయపడుతుంది.

భారతదేశ అతి గొప్ప సామాజిక సంస్కర్త, పండితుడు డా. బి.ఆర్. అంబేడ్కర్ జీవన పయనాన్ని ఈ సినిమా కళ్లకు కట్టేట్లుగా చూపిస్తుంది. న్యూయార్క్‌లో విద్యార్థిగా తాను సాగించిన పయనం మొదలుకుని తమ సామాజిక వర్గం శ్రేయస్సు కోసం తాను చేసిన పోరాటాల క్రమానికి ఈ సినిమా అద్దం పట్టింది. స్వార్థపర శక్తులు నేడు.. అంబేడ్కర్ చుట్టూ అనేక తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్న వేళ.. నిజమైన అంబేడ్కరుడిని తెలుసుకోవడం నేడు అత్యంత అవసరం! ఆ లోటును పూర్తి చేసే మంచి సినిమా ఇది. రండి.. జబ్బార్ పటేల్ అందించిన అంబేద్కర్ సినిమా చూద్దాం..! తెలుగులో ఈ పూర్తి సినిమా యూట్యూబ్‌లో దొరుకుతుంది.

నీకోసం జీవిస్తే నీలోనే ఉంటావు. జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావు. అనే డా. బి.ఆర్. అంబేడ్కర్ సూక్తికి ఈ సినిమా నిదర్శనం. ఆయన చూపించిన మార్గం మన ముందున్నది. నాటి పరిస్థితులకు భిన్నంగా నేటి పరిస్థితులు ఉన్నాయి. అంటరానితనం రూపుమాసిందని చెప్పలేం. కానీ రూపు మారింది. దానికి దళితులంతా ఏకమై ఈ సమాజాన్ని సమానత్వం వైపు పయనింపజేయాలి. కులరహిత వర్గ రహిత సమాజానికై పాటుపడదాం. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి తమలో ఉన్న చాలా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక దిక్సూచి ఈ చిత్రం.

సినిమా - Babasaheb Dr. B.R Ambedkar

నటులు - మమ్ముట్టి, సోనాల్ కులకర్ణి, మోహన్ గోఖలే

దర్శకుడు - జబ్బార్ పటేల్

సినిమాటోగ్రఫీ - అశోక్ మెహతా

విడుదల - 2020 డిసెంబర్ 15

లభ్యం - యూట్యూబ్

- ఆర్. రాజేశం

94404 43183

Tags:    

Similar News