పదోన్నతులే కాదు.. పాఠశాలల్ని ఉన్నతీకరించాలి!!

Update: 2024-08-13 01:15 GMT

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ప్రభుత్వ పాఠశాల విద్యారంగం దశను, దిశను మార్చడానికి ప్రయత్నించడం అభినందించదగ్గ అంశం. అందులో భాగంగా గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన ప్రమోషన్లు, బదిలీలు ప్రక్రియను కొనసాగించడం ద్వారా సుమారు ముప్పైవేల మంది టీచర్లకు పదోన్నతి కల్పించడం ప్రభుత్వ విద్యారంగ చరిత్రలో చారిత్రాత్మకమైనది. అందుకు ప్రత్యేకంగా కృషిచేసిన అధికార వర్గ కృషికి కృతజ్ఞతలు తెలుపవలసిందే. ఈ సందర్భంగా ఆయా ఉపాధ్యాయ సంఘాల స్వార్థ చింతన వల్ల అతీగతీ లేకుండా ఆగిపోయిన కామన్ సర్వీస్ రూల్స్ అంశం గూర్చి, అటు ప్రభుత్వ ఇటు పంచాయతీరాజ్ యాజమాన్యాల నాయకులు టీచర్లు ప్రభుత్వ విద్యారంగం ఎదుర్కొంటున్నటు వంటి సంక్షోభ స్థితిని గుర్తిస్తూ ‘సొంత లాభం కొంత మానుకుని’ పాఠశాలల అభ్యున్నతికి తోడ్పడవలసి ఉన్నది.

ఇన్ని వేల ప్రమోషన్లు ఇచ్చినా వేలాదిమంది బదిలీలు జరిగినా పాఠశాల విద్యారంగంలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల మొత్తం విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా కొనసాగుతున్నది. 500కు పైగా మండల విద్యాధికారి పోస్టులు 60కి పైగా డిప్యూటీ డిఇఓ పోస్టులు, 30 దాకా జిల్లా విద్యాశాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వ విద్యారంగ నానాటికి పర్యవేక్షణ లేమితో కునారిల్లిపోతున్న వాస్తవాన్ని ఉపాధ్యాయ సంఘాలు గుర్తించవలసి ఉన్నది. అందుకు ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ ఖాళీలతో పాటు డైట్ లెక్చరర్స్, జేఎల్స్, ప్రమోషన్లకు సంబంధించిన అంశాలను కూడా పరిష్కరించాల్సి ఉన్నది. అట్లాగే పర్యవేక్షకులు లేరన్న కారణంతో పదోన్నతి పొందిన టీచర్లు తమ విద్యుక్త ధర్మాన్ని విస్మరిస్తే తాము పొందుతున్న జీతాలకు తమ బడిలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందలేకపోతున్న పిల్లలకు ద్రోహం చేస్తున్నట్లే. ఇన్నివేల ప్రమోషన్స్ ఇచ్చామని ప్రభుత్వం, ప్రమోషన్లు వచ్చాయని సంతోషంలో టీచర్లు... విద్యారంగం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను గుర్తించకపోతే విద్యార్థుల భవిష్యత్తుకు ద్రోహం చేసిన వాళ్లు అవుతారు.

విద్యార్థుల సంఖ్య తరిగిపోతోంది!

పదిమంది పిల్లలు లేని బడిలో కూడా ఓ ఉపాధ్యాయున్ని, 50 మంది పిల్లలు లేని హైస్కూల్లో ఓ హెడ్మాస్టర్‌ని సబ్జెక్టుకు టీచర్‌నిచ్చినా విద్యార్థుల సంఖ్య పెరగకపోవడానికి, ఉన్నతమైన ఫలితాలు రాబట్టలేకపోవడానికి కారణాలను ఈ సందర్భంగా అన్వేషించవలసి ఉన్నది. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేయకపోవడం వల్ల విద్యార్థుల సంఖ్య తరిగిపోతున్నదని వాపోయిన ఉపాధ్యాయ సంఘాలు.. నేడు అన్ని పాఠశాలలు ఇంగ్లిష్ మీడియంగా మారినప్పటికీ ఇవ్వాళ గత సంవత్సరాల కంటే భిన్నంగా విద్యార్థుల సంఖ్య తగ్గటానికి తగిన కారణాలను అన్వేషించవలసి ఉన్నది. ఇటీవల అసర్ నివేదిక ప్రకటించినట్లుగా కనీసం 8వ తరగతి విద్యార్థులు ఐదవ తరగతికి, ఐదవ తరగతి విద్యార్థులు రెండవ తరగతికి సంబంధించిన కనీస సామర్ధ్యాలను పొందలేకపోతున్నారని ప్రకటించింది. గతంలో జరిగిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే కూడా విద్యార్థుల కనీస సామర్ధ్యాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేయలేదు. పదేళ్ల తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో 27వ స్థానంలో ఉందని నివేదికలు ప్రకటించడం ఆందోళన కొలిపే అంశం. ఇందుకు టీచర్లను నిందించడం ఒక కారణం అయితే, ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా విధానాలు మరొక కారణమని స్పష్టమవుతున్నది.

కనీస వసతుల లేమితో పారిపోతూ...

గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గటానికి పాఠశాల మీద పర్యవేక్షణ లేమితో పాటు, ఒక్క టీచరు నాలుగైదు తరగతులు బోధించలేని స్థితి, గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో కనీస వసతులలేమి, కనీసం బ్లాక్ బోర్డ్‌కు నల్ల రంగు వేయించలేని, గోడలకు తెల్ల సున్నాలు కొట్టలేని దుర్గతిలో పాడుబడ్డ భవనాల్లా ప్రభుత్వ బడులు ఉండటం ఒక కారణం. పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించిన అంగన్వాడీ కేంద్రాలు కేవలం పిండి బడులుగా పాఠశాలకు దూరంగా కొనసాగడం, వాటిని స్థానిక పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రాథమిక విద్యను పరిపుష్టం చేయవలసి ఉన్నది. అరకొరగా ఇవి ఉన్నచోట కూడా విద్యార్థుల సంఖ్య లేకపోవడానికి మండల కేంద్రాల నుండి ఊర్లలోకి వచ్చే ప్రైవేటు పాఠశాలల బస్సులు పిల్లల్ని గద్దల్లా ఎత్తుకెళ్లడం కొనసాగుతున్నది. ఇందుకు పరిష్కారంగా ప్రైవేటు పాఠశాలలను నియంత్రించడం, ఏ గ్రామంలోని పిల్లలు ఆ గ్రామంలో చదువుకోవడానికి ప్రైవేటు బస్సులు, బడులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. గతంలో మన ఊరు- మనబడి పేర ఎంపికైన పాఠశాలలకు నిధులు కేటాయించి అమ్మ ఆదర్శ పాఠశాలలతో పాటుగా వాటిని ప్రభుత్వం ఆలోచిస్తున్న సెమీ రెసిడెన్షియల్‌గా మార్చవలసి ఉన్నది. అందుకు కొనసాగింపుగా బడికి వచ్చే పిల్లలకు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం మంచి భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వడం గూర్చి ఆలోచించాలి.

రాయడం, చదవటం కూడా రాకపోతే ఎలా?

గతంలో నెలకొల్పిన మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు విద్యారంగాన్ని మరోవైపు నెట్టివేశాయి. అట్లాంటి ప్రయత్నమే 25 ఎకరాలలో అన్ని హంగులతో ప్రభుత్వం నెలకొల్పుతున్నట్లు చెబుతున్న బడులకంటే ఇప్పటికే ఉన్న పాఠశాలలను అన్ని హంగులతో బలోపేతం చేయడం విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలని మెరుగుపరచాలన్న సంకల్పాన్ని ఆచరణలో చూపించడానికి కృషి చేయవలసి ఉన్నది. దీనికి అనుగుణంగా ప్రమోషన్లు పొంది బదిలీలు చేయబడి కొత్తగా ఉద్యోగాల్లోకొస్తున్న వారితో సహా అధికార యంత్రాంగం ఆయా స్థాయిలో రాజకీయ నాయకులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించే ఒక ప్రక్రియను ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రత్యేక అవకాశాలు కల్పించడం గూర్చి ఆలోచించాలి. అట్లాగే తరగతి గది 4 గోడల మధ్య టీచరు విద్యార్థికి మధ్య జరుగుతున్నటువంటి బోధన అధ్యయనంలో చేయవలసిన మార్పుల గురించి ఎస్‌సి‌ఆర్‌టిలు, డైట్లు విస్తృతంగా పరిశోధనలు జరపాలి. మొత్తం ఇంగ్లిషులోనే బోధన కంటే కనీసం ప్రాథమిక స్థాయి వరకు తెలుగు మీడియంలో పటిష్టమైన పునాదిని ఏర్పరచడానికి విద్యావ్యవస్థను సంస్కరించవలసి ఉంది. ఇప్పుడు తెలంగాణ తరగతి గదుల్లో కొనసాగుతున్నటువంటి, సీసీఈ మోడల్‌లో విద్యార్థులకు విపరీతమైన రాత పని తప్ప చదవటం కానీ అవగాహన గానీ పెంపొందటం లేదని రుజువు అవుతున్నది. ఎఫ్.ఏ, నాలుగు ప్రాజెకులు అని, పుస్తకాలు లేకున్నా చదువుకున్న పుస్తక సమీక్షలని నిరంతరం రాయడం తప్ప విద్యార్థుల్లో కనీసం రాయడం చదవడంలో వెనుకబడి కనీస సామర్ధ్యాన్ని పొందలేని స్థితి అత్యధిక శాతం పాఠశాలల్లో ఉంది. దీన్ని సమీక్షించడం ద్వారా సరిచేయవలసి ఉంది.

ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి సరుకులా?

స్కూళ్లల్లో, పదవ తరగతి బోర్డు ఎగ్జామ్ తప్ప మిగిలిన తరగతులలో పరీక్షల విధానం కానీ బోధన కానీ పర్యవేక్షించకపోవడం, పదవ తరగతి పరీక్షలు కూడా ప్రతి జిల్లా మొదటి స్థానంలో ఉండాలని సంకల్పం తప్ప ఉన్నతమైన ఫలితాలు కావాలన్నా ఆచరణ లేకపోవడం వల్ల కేవలం విద్యార్థులు గ్రేడ్లు పొందే జీవులుగా ఎదుగుతున్నారు. వారు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు, పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ సీట్లు నింపుకోవడానికి సరుకుగా ఉపయోగపడుతున్నారు తప్ప జీవితంలో ఏదైనా ఉపాధి పొందలేని దుస్థితి కొనసాగుతున్నది. కనుక పాఠశాల విద్య నుండే విద్యార్థులను ఎటువైపు మళ్లించడం ద్వారా తెలంగాణ సమాజానికి లేదా వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో వికాసానికి తోడ్పడుతుందో.. ఆలోచించే పథకాలను ప్రభుత్వం చేపట్టవలసి ఉన్నది. ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు వేలాది రూపాయలు జీతంగా తీసుకుంటున్నటువంటి ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతతో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయకపోతే.. ప్రభుత్వ పాఠశాలల అంపశయ్య మీద నిలబడాల్సి వస్తుంది. పదోన్నతి పొందిన ఉపాధ్యాయ సంఘాలు రానున్న రోజుల్లో రేషన్లైజేషన్ లేదా స్కూల్‌ల ఎత్తివేత, అప్రకటిత మూసివేతలో ప్రభుత్వ విద్యారంగానికి పేద పిల్లలకు నిరుద్యోగ అభ్యర్థులకు ద్రోహం చేసిన అపవాదును ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ప్రభాకర్ కస్తూరి,

కన్వీనర్, తెలంగాణ టీచర్స్ ఫోరం.

94409 70454

Tags:    

Similar News