ప్రభుత్వ నిర్లక్ష్య విపత్తే పెద్దది!
government negligence is big more than The disaster of minchong
రాష్ట్రంలో ఇటీవల విరుచుకు పడిన మిచౌంగ్ తుపానుతో రైతులు, ప్రజానీకం అష్ట కష్టాలు పడుతున్నారు, సాయంపై రాష్ట్ర ప్రభుత్వం అమలు కాని మాటలు చెబుతుంటే, కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఓ వైపు వర్షాభావ పరిస్థితులతో 440 మండలాల్లో పంటలు ఎండిపోయిన స్థితిలో వచ్చిపడిన మిచౌంగ్ తుఫాను దాటికి పండిన ఆ కొంచెం పంటలనూ ఊడ్చేసింది, తుఫాను హెచ్చరికలు వస్తున్నప్పుడే మొదలు కావాలి అది ప్రభుత్వ సన్నద్ధత. కానీ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని దాని ప్రభావంతో అధికంగా వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ వారం రోజులు ముందే హెచ్చరించినా ప్రభుత్వం ఇందుకు సన్నద్ధం కాలేదు. ఈ నిర్లక్ష్యం వల్లే రాష్ట్ర రైతాంగం కన్నీటి మడుగులో ఈదులాడుతున్నారు.డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి రైతులను అప్రమత్తం చేసి, ప్రభుత్వం సన్నద్ధంగా ఉండి, బాధ్యతగా వ్యవహరించి ఉంటే అన్నదాతకు ఇంత అపార నష్టం జరిగి ఉండేది కాదు. ఇలా రైతులు నిండా మునగడానికి కారణం ప్రభుత్వ అసమర్థతే!
పట్టిసీమను నిర్లక్ష్యం చేయడంతో..
ప్రభుత్వం అంతా చేశాం, ఇంత చేశాం అని ఎంత బుకాయించినా ఈ పాపం నుండి తప్పించుకో జాలదు. రైతులు ఒక పక్కన కరువుతో అల్లాడుతుండగానే విరుచుకు పడిన మిచౌంగ్ తుఫానుతో నిండా మునిగి పోయారు. గతంలో ఎప్పుడూ ఏ తుఫాన్‌కీ ఈ విధంగా పంట నష్టం జరగలేదు. అప్పుడు అనావృష్టితో పంటలు వెయ్యలేదు. వేసిన పంటలు ఎండిపోయాయి. ఇప్పుడు అతివృష్టితో మిగిలిన పంట మొత్తం ఈ తుఫాన్ ధాటికి పూర్తిగా నాశనం అయిపోయాయి. ఒక 10%, 15% పంట చేతికి వచ్చింది మిగిలిన మొత్తం అంతా పనికిరాకుండా పోయింది.
తుఫానులు రావడం అనేది ప్రకృతి సహజం. వాటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఆ దెబ్బతిన్న రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఈ తుఫాన్‌కి రైతులు పంట దెబ్బతినడంలో ఎక్కువ బాధ్యత ప్రభుత్వానిదే. గత నాలుగు సంవత్సరాలుగా పంట కాలువలు కానీ, మురుగు కాలువలు కానీ ఎక్కడ మరమ్మత్తులు చేయకపోవడంతో అధిక వర్షాలు కురిసినప్పుడు ఆ వర్షపు నీరు బయటకు పోవాల్సిన మురుగు కాలువల్లో తూటు కాడా, గుర్రపు డెక్క పెరిగిపోయి పొలాల్లో నీళ్లు కాలువల్లోకి పోక, కాలువల్లో నీళ్లు పొలాల్లోకి రావడంతో పొలాల్లో వారి పంట నేలవాలి కుళ్లిపోతుంది. నవంబర్ సగం నుంచి ప్రతి సంవత్సరం తుఫానులు ఎక్కడో ఒకసారి వస్తూనే ఉంటాయి 1980, 90లలో జూన్ లోనే కాలువలకు నీరు వదిలే వాళ్ళు. నీటి లభ్యత తక్కువ కారణంగా జూలై తరువాత ఆగస్టుకు వెళ్ళింది. జూన్‌లోనే నీళ్లు వదిలితే నవంబర్లో వచ్చే తుఫాను కంటే ముందే పంట నూర్పు ఇల్లు అయిపోతాయని గ్రహించిన చంద్రబాబు పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని గ్రహించి ఆగమేఘాల మీద పట్టిసీమ నిర్మాణం పూర్తి చేసి జూన్‌లోనే నీరు ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మీద కోపంతో ఆ పట్టిసీమను పట్టించుకోకుండా రైతులకు చాలా అన్యాయం చేశారు.
కృష్ణా డెల్టా వట్టిపోయింది
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎప్పుడూ తుఫాన్లు వస్తుంటాయి. అందుకనే అవి వచ్చే సమయానికి పంట చేతికి రావాలని గత ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చింది. పులిచింతలలో నిల్వచేసే 45 టీఎంసీల నీటితో రెండో పంటకు కూడా నీరు ఇవ్వవచ్చు. సాగర్ కుడికాలువ లోకి గోదావరి నీటిని తరలించేందుకు గోదావరి - పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టింది గత ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి వచ్చిదానిని ఆపేశాడు. ఈ ఏడాది సకాలంలో నీళ్లు ఇవ్వకపోవడం వలన రైతులు ఆలస్యంగా పంట వేశారు. పంట చేతికి రావడం బాగా ఆలస్యమై తుఫాన్‌లో చిక్కుకుపోయింది. అదే గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.170 కోట్లతో నల్లమడ డ్రెయిన్‌ని అభివృద్ధి చేసి ఉంటే ఒక్క ఎకరం కూడా ఈ ప్రాంతంలో నీట మునిగేది కాదు. పట్టిసీమను వట్టిసీమ అన్న జగన్ గత మూడు సంవత్సరాల్లో వరదలు వచ్చినప్పటికీ కూడా వాటర్ మెయింటినెన్స్ సరిలేక నీళ్లు నిలబెట్టడం చేతకాక ఊడిన గేట్లను సరిచేయక పోవడం వలన పట్టిసీమనుండే నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం సరైన వర్షాలు లేక వచ్చిన ఆ తక్కువ నీటిని కూడా పులిచింతలలో గేట్లు సరిలేని కారణంగా నిలబెట్టుకోవడం చేతకాలేదు. నీటిని నిలబెట్టుకోవటం చేతకాక గోదావరి నుంచి తీసుకోవాల్సిన నీళ్లు కూడా తీసుకోలేకపోవడానికి తోడుగా కృష్ణ డెల్టా ఏర్పడిన తర్వాత ఎప్పుడు లేనంత తీవ్రంగా కరువు పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం కృష్ణ డెల్టాలో కూడా పంటలు ఎండిపోవటం అనేది నిజంగా దురదృష్టకరం.
ఆత్మహత్యలపై కనీసం స్పందించరా?
వ్యవసాయ రంగానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాం అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది రైతుల దుస్థితి. అంకెల గారడీలతో, అబద్దాలతో రైతులను దారుణంగా దగా చేస్తున్నారు. రైతులు పెట్టుబడి భారం మోయలేక సతమతమవుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నాం అని ప్రభుత్వ పెద్దలు, గొప్పలు చెప్పుకొంటున్నా ఆ సాయం ఏ మూలకూ చాలని పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్కన సాగు సంక్షోభం పెరిగిపోతుంటే, రైతులు అప్పుల భారంతో కుప్పకూలుతుంటే, మరో పక్క ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేసాం, మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని బాకాలూదుకొంటున్నది జగన్ ప్రభుత్వం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశం లోనే రైతు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో రాష్ట్రంగా నిలవగా, నేషనల్ శాంపిల్ సర్వే రైతు రుణగ్రస్తులున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కితాబు ఇచ్చింది. రాష్ట్రంలో వరుస రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నా పెట్టుబడి సాయం చేస్తున్నాం అని, ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం అని ప్రగల్భాలు పలకడం తప్ప నిండు ప్రాణాలు తీసుకుంటున్న రైతుల దుస్థితి గురించి మచ్చుకైనా స్పందించడం లేదు.
అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత అప్పులు ఊబిలో కూరుకుపోయ్యారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులను మభ్యపెట్టడానికే తప్ప వారిని ఆదుకొనేవి కావు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలే సర్వరోగ నివారిణి అని చెప్పారు. ఆర్‌కేబీలలో ధాన్యం కొనుగోళ్లు నామ మాత్రమే. పండిన ధాన్యం మద్దతు ధరకు అమ్ముకోలేని దైన్యం, రైతులు గోనె సంచులు కావాలని ఆర్బీకేలలో అడిగినా అందించడం లేదు ప్రభుత్వం. సంచులు లేక ధాన్యాన్ని కల్లంలో ఉంచడంతో వర్షాలకు ధాన్యం తడిచిపోయింది. ధాన్యం మిల్లులకు తరలించడానికి వాహనదారులు ముందుకు రాక రోడ్ల పైనే ధాన్యంపై పరదాలు కప్పి ఉంచాల్సిన పరిస్థితి. పకృతి పగ, ప్రభుత్వ దగా రైతు లోకాన్ని నిర్వీర్యం చేశాయి.
వారికి చేసింది గోరంతే..
జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ఇన్ సబ్సిడీ కింద రైతులకు ఇచ్చింది కేవలం రూ 1,911 కోట్లు మాత్రమే. రైతులు నష్టపోయింది దాదాపు రూ.20 వేల కోట్ల పంట ఉత్పత్తులు నష్టపోయారు. ఈ-క్రాప్ నమోదుతో పాటు అనేక కొర్రీలతో రైతులకు పరిహారంలో కోత పెడుతున్నారు. 33శాతం పంట నష్టపోతేనే పంట పరిహారం చెల్లిస్తున్నారు. రైతు భరోసా పధకంతో రైతులకు ఒరిగింది ఏమీ లేదు. అసంబద్ధ విధానాలతో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారు. జగన్ పాలనలో రైతు లోగిళ్ళలో చీకట్లు అలుముకున్నాయి. రైతుల గురించి జగన్ రెడ్డి చెప్పింది కొండంత, చేసింది గోరంత అని చెప్పాలి. ప్రకృతి తెచ్చిన విపత్తు కన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం పెద్దది.
బొంతు శివ సాంబిరెడ్డి.
తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
80081 39209