ఉచితాలు ఎందుకు?

Freebies schemes are for votes only says naragoni

Update: 2023-07-04 23:30 GMT

పైన పటారం లోన లోటారం లాగా నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అప్పు చేసి పప్పు కూడు అన్నట్లు అప్పులు చేస్తూ, ప్రభుత్వ భూములు అమ్ముతూ, అధికారం నిలబెట్టుకోవడం కోసమే ఉచిత పథకాలు, పింఛన్లు, రుణమాఫీ, దళిత బంధు, కల్యాణలక్ష్మి, బీసీలకు లక్ష ఆర్థిక సహాయం లాంటి పథకాలు ప్రవేశపెడుతుంది. ప్రజల దగ్గర పన్నుల రూపంలో తీసుకున్న డబ్బులను ప్రభుత్వం అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా, కేవలం ఓట్లే లక్ష్యంగా ఉచిత పథకాల ద్వారా కొని అధికారం నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం విచారకరం. ఇలాగే కొనసాగితే రాష్ట్రం దివాళా తీయక తప్పదు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రం అప్పుల పాలు ఎందుకు అయింది? ఈ అప్పులు తీర్చేది ఎవ్వరు? మరలా, ప్రజలే పన్నుల రూపంలో కట్టాల్సిందే, రాష్ట్రం చేసిన 5 లక్షల కోట్ల అప్పులకు నెలకు రూ. 1860 కోట్లు మిత్తి కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం.

వారు తప్ప ఎవరూ బాగుపడలే!

నిజానికి ఈ ఉచిత పథకాల వల్ల కొందరికే లాభం అందరికీ కాదు. ఉచిత పథకాల వలన పేదరికం పోతుందా? ఉదాహరణకు రైతు బంధు వలన భూస్వామ్య కుటుంబాలే బాగుపడుతున్నాయి కానీ పేద రైతులకు ఉపయోగం ఏముంది? గత ప్రభుత్వంలో 29 లక్షల మందికి ఇచ్చే పెన్షన్లు 44 లక్షల మందికి ఇస్తున్నం అంటున్నారు మరి పేదరికం పెరిగినట్టా? తగ్గినట్టా?

పేదరికం పోవాలంటే అందరికీ ఉపాధి కల్పించాలి. అలాగే ప్రతి వ్యవస్థలో మౌలిక వసతులు కల్పించాలి. ఇండ్లు లేని నిజమైన లబ్ధిదారులను గుర్తించి 80 గజాల స్థలాలు ఇస్తే సరిపోయేది. వాటిని అమ్మకుండా కొనకుండా జీఓ తీసుకొస్తే బాగుండేది. కానీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం అవి పేదలకు కేటాయించకముందే చాలాచోట్ల కూలిపోయే పరిస్థితి ఉంది. పైగా లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉండటంతో ఉన్నవి సరిపోవు. వ్యతిరేకత వస్తుందని అవి ప్రారంభించడం లేదు. నిజానికి ఇలాంటి పథకాలతో రాష్ట్రం బాగుపడదు. ఇవన్నీ ప్రజలకు తాత్కాలిక ప్రయోజనాన్ని మాత్రమే ఇస్తాయి. నిజానికి తెలంగాణలో పేదల బతుకులు మారుతాయని స్వరాష్ట్రం కోసం పోరాడితే వచ్చిన తెలంగాణలో రాజకీయ నాయకులు తప్పా ఎవరు బాగుపడలేదు. వారు అనుభవిస్తున్నది అంతా ప్రజల సొమ్మే. ఒకప్పుడు రాజకీయ నాయకుడంటే ప్రజా సేవకుడిగా భావించే వారు కానీ ఇప్పుడు ఫక్తు వ్యాపారస్తుడిగా భావిస్తున్నారు.

నారగొని ప్రవీణ్ కుమార్

అధ్యక్షులు, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

98490 40195

Tags:    

Similar News