ముగిసిన శకం.. చిగురించిన స్వప్నం
father of India's Green Revolution MS Swaminathan passed away
‘భారత వ్యవసాయ రంగంలో ఓ శకం ముగిసింది. భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్.ఎస్ స్వామినాథన్ (98) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన చెన్నైలో నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించే కృషిలో భాగంగా స్వామినాథన్ ఎనలేని సేవ చేశారు. దేశంలో ఆహార కొరతను ఎదుర్కొనడానికి మేలైన వరి వంగడాలను ఆయన సృష్టించారు.
స్థానిక పరిస్థితులకు.. శాస్త్రీయ పద్ధతులు
మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యు శాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో హరిత విప్లవ పితామహుడుగా పేర్కొంటారు. 1960 నుంచి 1970ల్లో స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చింది. కరువు కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధి వైపు మరలించారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించి వ్యవసాయ ఉత్పాదకతను అమాంతం పెంచారు. వ్యవసాయ రంగంలో వినూత్న విధానాలతో స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహనతో ఆధునిక శాస్త్రీయ పద్ధతులను మిళితం చేశారు. దీంతో ఎంతో మంది తక్కువ ఆదాయ రైతులు దేశాభివృద్ధికి గణనీయంగా తోడ్పాటు నిచ్చారు. ఆయన చేసిన సేవలకు గాను 1987లో మొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను అందుకున్నారు. ఆ డబ్బుతో ఆయన చెన్నైలో ఎమ్.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. భారత్‌లో చేసిన సేవల కంటే స్వామినాథన్ ప్రపంచ వేదికపై ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వివిధ అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ కార్యక్రమాలకు ఆయన మేధస్సును అందించారు. టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన 20 మంది ఆసియన్లలో ఒకరిగా ఆయనకు స్థానం దక్కింది.
హరిత విప్లవానికి నాంది ఇలా...
పంట పొలాలకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి, యాంత్రీకరణను ప్రవేశపెట్టి, రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులను వాడి, సంకర జాతి వంగడాలతో స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని హరిత విప్లవం అంటారు. ఇది తొలిసారి మెక్సికోలో 1945లో ప్రారంభమైంది. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి మెక్సికో ప్రభుత్వం వివిధ రకాలైన గోధుమ వంగడాలను అభివృద్ధి చేసింది. మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ నేతృత్వంలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ ఈ విప్లవాన్ని ఇతర దేశాలను విస్తరించడానికి నిర్ణయించింది. అదే సమయంలో 1960ల్లో భారత్ తీవ్ర కరవు పరిస్థితులు ఎదుర్కొంది. ఆ సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖకు సలహాదారుగా ఉన్న ఎంఎస్ స్వామినాథన్.. మెక్సికో హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్‌ను దేశానికి ఆహ్వానించారు. ప్రభుత్వ పరంగా ఇబ్బందులున్నప్పటికీ.. మెక్సికో ప్రయోగశాల నుంచి గోధుమను దిగుమతి చేసుకుని ప్రయోగాత్మకంగా పంజాబ్‌లో పండించారు. అవి మంచి దిగుబడి రావడంతో భారత్‌లో హరిత విప్లవానికి నాంది పలికినట్లయింది. దీంతో స్వామినాథన్‌ను భారత హరిత విప్లవ పితామహుడిగా అభివర్ణిస్తారు.
దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో కృషి చేసిన స్వామినాథన్ సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు వరించాయి. 1971లో రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అందుకున్నారు. ఆయన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2007 నుంచి 2013 మధ్య పార్లమెంట్‌కు నామినేట్ ఎంపీగా సేవలందించారు. 1988లో ఎంఎస్ స్వామినాథన్ లాభాపేక్ష లేని రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. డబ్ల్యూహెచ్‌వోలో స్వామినాథన్ కుమార్తె స్వామినాథన్‌కు ముగ్గురు కుమార్తెలు. వీరిలో ఒకరైన సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో 2019 నుంచి 2022 వరకు చీఫ్ సైంటిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఆమె ఎంతో కృషి చేశారు.
ఐపీఎస్ నుంచి అగ్రికల్చర్ దాకా
స్వామినాథన్ 1925 ఆగస్టు 7న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎంకే సాంబశివన్ సర్జన్. మెట్రిక్యులేషన్ పూర్తయిన తర్వాత స్వామినాథన్ కూడా తండ్రి బాటలోనే మెడికల్ స్కూల్లో చేరారు. కానీ, 1943లో బెంగాల్‌లో చోటుచేసుకున్న క్షామన్ని కళ్లారా చూసిన ఆయన చలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలన్న లక్ష్యంతో వైద్య రంగం నుంచి తన మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగువేశారు. త్రివేండ్రంలోని మహారాజా కాలేజీలో జువాలజీ నుంచి యూజీ డిగ్రీ పట్టా పొందిన ఆయన.. ఆ తర్వాత మద్రాసు అగ్రికల్చరల్ కాలేజీలో చేరారు. అగ్రికల్చరల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో పీజీ చదివారు. పీజీ పూర్తయిన తర్వాత స్వామినాథన్ యూపీఎస్సీ పరీక్ష రాసి ఐపీఎస్‌కు అర్హత సాధించారు. కానీ, ఆ అవకాశాన్ని వదులుకుని యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరారు. అక్కడ బంగాళదుంప జన్యు పరిణామంపై అధ్యయనం చేశారు. అక్కడి నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో చేరి పీహెచ్‌డీ పూర్తిచేశారు. కొంతకాలం అక్కడ పనిచేసిన ఆయన 1954లో భారత్‌కు తిరిగొచ్చి ఐఏఆర్ఐలో శాస్త్రవేత్తగా పరిశోధన కొనసాగించారు. 1972-79 మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ సెక్రటరీగా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను వ్యవసాయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.
(భారత హరిత విప్లవ పితామహుడు ఎమ్.ఎస్ స్వామినాథన్‌కు నివాళి)
- ఇస్కా రాజేష్ బాబు
స్వతంత్ర జర్నలిస్ట్,
93973 99298