కనీ వినీ ఎరుగని విధ్వంసం

Ethanol destruction on the environment

Update: 2024-03-01 00:45 GMT

భూ వాతావరణం మారిపోయింది. సహస్రాబ్దాలుగా చూడని స్థాయిలో నేడు పర్యావరణ విధ్వంసం కొనసాగుతోంది. భారతదేశంలో ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ ట్రెండ్ వరి ధాన్యం ఉత్పత్తి, ఇథనాల్‌తో ముడిపడి ఉంది.

ఇప్పుడు శిలాజ రహిత ఇథనాల్ ఇంధనం ద్వారా కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరగడం వల్ల ఇది భయంకరంగా భూమిని వేడెక్కిస్తోంది. ఇది కొనసాగితే, ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు పర్యావరణ విపత్తును తీసుకురావచ్చని 195 దేశాల శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇథనాల్ ఆవిరి గాలిలో ఐదు రోజుల వరకు ఉంటూ మెల్లిగా క్షీణిస్తుంది. ఒక గాలన్ ఇథనాల్ దహన సమయంలో 18.92 పౌండ్ల (8,595 గ్రాములు) సీఓ2ని విడుదల చేస్తుంది. ఇది సగటున ఒక మైలు డ్రైవింగ్ చేస్తే 315 గ్రాముల CO2 విడుదల అవుతుందని నేషనల్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ పరిశోధనలో ధ్రువీకరించారు.

ప్రపంచ దేశాలు ఇథనాల్ ఉత్పత్తిలో పారిశ్రామికవేత్తలకు అత్యధిక రాయితీలు ప్రకటిస్తూ అత్యాధునిక జీవ ఇంధన విప్లవం అంటూ పంటలను ప్రజలకు కాకుండా కార్లకు ఆహారంగా మళ్లిస్తున్నారు. దీంతో ఆహారం ధరలు పెరుగుతూ ప్రపంచంలోని పేదలు ఆకలితో అలమటిస్తారు. ఇథనాల్ రసాయన కర్బన సమ్మేళనం వల్ల మానవ ఉనికికే ప్రమాదం కల్పించడం అనేది అంతర్జాతీయంగా మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది.

మితిమీరిన భూకబ్జా

దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 2018 జూలై నుండి 2022 ఏప్రిల్ వరకు వివిధ ఇథనాల్ వడ్డీ రాయితీ పథకాలను నోటిఫై చేసింది. దేశ వ్యాప్తంగా కొత్త డిస్టిలరీలను, మొలాసిస్ ఆధారిత, ధాన్యం-ఆధారిత డిస్టిలరీలను విస్తరించడానికి ప్రభుత్వం పారిశ్రామిక వ్యవస్థాపకులకు సౌకర్యాలు కల్పిస్తోంది. ఈనాడు ఇథనాల్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా మునుపెన్నడూ లేని విధంగా భూ కబ్జా జరుగుతోంది. భవిష్యత్తులో ఆహార కొరత వస్తుందనే భయంతో వాటి నుండి అత్యధిక లాభం పొందాలనే తపనతో, అత్యంత సంపన్నమైన దేశాలు, రాష్ట్రాలు, సంస్థలు, వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా విస్తారమైన భూములను కొనుగోలు చేసి లీజుకు ఇస్తున్నారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భాగమై విభిన్నమైన రూపంలో, భిన్నమైన దోపిడీతో సామ్రాజ్య అధినేతలు, భారత పాలకులు కొత్త రూపంలో ముందుకు వస్తున్నారు.

కాప్ 28 సదస్సులో 100 కంటే ఎక్కువ దేశాలు 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచుతామని ప్రతిజ్ఞ చేయడంతో, భారతదేశం తన ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యానికి సంబంధించి గట్టి సవాలును ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ధాన్యం-ఆధారిత ఇథనాల్ వైపు పెద్ద మార్పును చూస్తోంది. ఆహార ధాన్యాలు లేదా బియ్యం నుండి తీసుకున్న ఇథనాల్‌కు ప్రభుత్వం వేర్వేరు ధరలను నిర్ణయించింది. ఇథనాల్ సరఫరా అయితే ఇది ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సవాళ్లను సృష్టించే ప్రమాదం ఉంది. దేశంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాల వెనక ఉన్న లాబీలను విస్మరించలేం. చక్కెర మిల్లులు, ఇథనాల్ మిల్లులు రాజకీయ నాయకుల యాజమాన్యం ఆధీనంలోనే నడుస్తున్నాయి.

వ్యర్థాలపై ధర్నా చేస్తే అరెస్టా?

తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో సుమారు 480 ఎకరాల భూమిలో జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ & ఆగ్రో ఇండస్ట్రీస్ పేరిట ఆ కంపెనీ భాగస్వామ్యంలో ఒకరైన బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి వరి ధాన్యంతో ఇథనాల్ ఉత్పత్తి వల్ల మహబూహబ్‌నగర్ జిల్లాలోని 54 గ్రామాలలోని ప్రజలు వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో ప్రతి ఇంట్లో జలుబు, దగ్గు, ఆయాసంతో రొప్పుతూ అసహజ మరణాలకు దగ్గరవుతున్నారు. గత రెండేళ్లుగా ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని న్యాయబద్ధంగా, శాంతియుతంగా 22-10-2023 న ధర్నా నిర్వహించారు. కాలుష్య వ్యర్ధాల ట్యాంకర్‌ను అడ్డగించిన ప్రజలపై పాశవికంగా లాఠీచార్జి జరిపి అనేక మంది రైతులు, మహిళలు, యువకులను తీవ్రంగా గాయపరచి, అక్రమకేసులు బనాయించి పోలీస్ స్టేషన్‌లలో చిత్రహింసలకు గురి చేశారు. చిత్తనూరులో శాంతియుతంగా జరుగుతున్న ధర్నాను చూడడానికి వచ్చిన 80 సంవత్సరాల వయోవృద్ధుడైన కాశీం లాఠీచార్జికి బలై తీవ్ర గాయాలతో మొన్న 2023 డిసెంబరులో చనిపోయారు.

ప్రపంచ బ్యాంకు ఒత్తిడి సామ్రాజ్య నేతల ఆజ్ఞలకు లోబడి కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ లో ఇథనాల్‌ని కలపటం ఒక రకంగా కల్తీయే. ఒక కిలో చెరుకు ఉత్పత్తికి 3000 లీటర్ల నీరు అవసరం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో ఇతర ఉపయోగాల నుండి పెరుగుతున్న నీటి డిమాండ్‌ను సంతృప్తి పరచడానికి తగినంత సరఫరాలు లేవు. వేగంగా పెరుగుతున్న డిమాండ్, సరఫరాలో వెనుకబడి ఉన్న ప్రస్తుత పోకడల దృష్ట్యా, రాబోయే సంవత్సరాల్లో నీటి కొరత తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. దీనిపై దృష్టి సారించడం లేదు.

ఎం.ఏ.సత్యనారాయణ రావు

పర్యావరణ కార్యకర్త

94940 52775

Tags:    

Similar News