కౌంటింగ్ అవకతవకలు.. యాదృచ్ఛికమా? ఉద్దేశపూర్వకమా?

మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొదట వెల్లడించిన పోలైన ఎన్నికల శాతానికి, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతాలలో

Update: 2024-06-22 00:45 GMT

మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొదట వెల్లడించిన పోలైన ఎన్నికల శాతానికి, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతాలలో భారీగా వ్యత్యాసం ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మొత్తం లెక్కించిన ఓట్లు, పోలైన ఓట్ల మధ్య తేడాలు ఉండటంతో ఫలితాలు అధికార, ప్రతిపక్ష సభ్యుల గెలుపు ఓటములను ప్రభావితం చేశాయి. ఎన్నికల కౌంటింగ్ అవకతవకలు... యాదృచ్ఛికమా? ఉద్దేశపూర్వకమా? అనే ప్రశ్న రోజురోజుకు బలపడుతోంది.

1950 నుండి మొన్న జరిగిన (2024)ఎన్నికల వరకు అక్కడక్కడ చిన్నపాటి చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తానికి మన ఎన్నికల సంఘం అతి సమర్ధవంతంగా ఎన్నికలు నిర్వహించింది. అయితే ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్షాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ పరస్పరం నిందలు, ఆరోపణలు చేసుకోవడం మామూలే. ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవడం కూడా సహజమే. ఈ సారి మొత్తం 7 దఫాలుగా ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అందుకు అనుగుణంగా విపక్షాలు నిరసన దీక్షలు చేశారు. సుప్రీంకోర్టులో కేసులు వేశారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

జర్నలిస్ట్ పూనమ్ రేపిన సంచలనం

కౌంటింగ్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్‌లో గణాంకాలను ఉటంకిస్తూ న్యూస్ వెబ్ సైట్‌లో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ 'ది వైర్' లో తాజాగా ప్రచురితమైన ఓ ఆర్టికల్ ఇప్పుడు సంచలనంగా మారింది. చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయని ఆ ఆర్టికల్ ఆధారసహితంగా పేర్కొంది. 543 నియోజకవర్గాలకు గాను డామన్ డయ్యూ, లక్షదీప్, కేరళలో 'అట్టింగల్' మినహా దాదాపు అన్ని స్థానాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని, దేశంలో 140కి పైగా లోక్‌సభ నియోజకవర్గాలలో ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే, లెక్కించిన ఓట్లు అధికంగా ఉన్నాయని ఈ వ్యత్యాసం 2 ఓట్ల నుంచి 3,811 ఓట్ల వరకు ఉంటుందని ఆమె ఆరోపించారు. అలాగే ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే తక్కువగా ఓట్లు లెక్కించిన నియోజకవర్గాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయని ఆమె చెప్పారు.

న్యాయ విచారణ జరిగేనా?

లోక్‌సభ ఎన్నికలు 7 దశల వారీగా జరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘం ఖచ్చితమైన పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలను వెంటవెంటనే వెల్లడించలేదు. దానితో రాజకీయ పార్టీలు సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వెల్లువలా డిమాండ్ చేస్తే ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు వివరాలను విడుదల చేయటాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల లెక్కింపులో వెల్లడైన ఫలితాలు అధికార బీజేపీకి అనుచిత లాభం జరిగిందని విపక్షాల ప్రధాన ఆరోపణ. ఈ అవకతవకలపై నిష్పాక్షికంగా జుడీషియల్ పర్యవేక్షణలో విచారణ జరగాలని విపక్షాలు, కొన్ని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

డా. కిశోర్ ప్రసాద్

98493 28496

Tags:    

Similar News