ఓట్ల పటాటోప ప్రచారం ముగిసింది. ఎన్నిక వస్తున్నది అరిచిన మైకులు మూగపోయినయి. బొంగురు పోయిన నాయకుల గొంతుకలకూ విశ్రాంతి దొరికింది. అన్ని పార్టీల అభ్యర్థులు నాయకులు కాలికి విరామం లేకుండా తిరిగి తిరిగి జనం చెవుల్లో జివిలి వదలకొట్టిండ్రు.
అబద్ధం ఆడని రాజకీయ నాయకుడు లేడు, అసత్యం పలకని అభ్యర్థి లేడు. ఒకలను ఒకరు ఇష్టారీతిగా ఇయ్యర మయ్యర తిట్టుకున్నరు. కమీషన్‌లు, లంచాలు, పైసలు తినుడు, కోట్లకు కోట్లు వెనక వేసికునుడు ఇలాంటి మాటలు సులువుగా మాట్లాడుకున్నరు. మనుషులను కొనుడు, అమ్ముకునుడు, ఓట్లు కొనుడు అనేవి మామూలే అయిపోయినవి. మందు అయితే ఒక దగ్గర పోస్తే ఎన్ని నదుల ప్రవాహం అయ్యేదో చెప్పలేము. పట్టుబడ్డ పైసలే కోట్లకు కోట్లు, ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం ఖర్చు చేయాల్సిన 95 లక్షల కన్నా అందరూ ఎక్కువనే ఖర్చు పెడతరు.
పత్త కనపడడు..
ఓట్లు కొనుడే పని ఏదో విధంగా చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునుడు. బొంకిచ్చి బోర్లించి మెస్మరిజం చేసి ఓటు వేయించుకునుడే పని. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికలు జరుగుతుండగానే నిబంధనలు ఉల్లంఘిస్తాడు. అట్లనో ఇట్లనో గెలిచినంక ఇక రాజకీయమే. పత్త కనపడడు జాడ ఉండది.
గత నెల రోజులకు పైగా టీవీలు, పేపర్లు, యూట్యూబ్‌లు, వాట్సాప్, ఫేస్‌బుక్‌ల నిండా ఓట్ల నాయకుల నోట్లు ముచ్చట్లే కన్పించినయి. అబద్దాలు ఎన్ని ఆడుతడో దానికే తెలవదు. ఒక లీడర్ ఎన్ని ఉన్నవి లేనివి కల్పించి చెప్పుతాడో ఆయనకే తెలుస్తది. విషపు మాటలకు, కోపపు ప్రసంగాలకు లేని ఆశల కల్పనకు, ప్రగల్భాలకు, విద్వేషాలకు మారు వేషాలకు దేశం మౌనంగా సాక్ష్యం అయింది. నేరాలు, ఘోరాలు, దురాక్రమణలు కబ్జాలు, ఖూనీలు చేసిన వారందరికీ రాజకీయాలపై మనసుపడుతది. ఇదివరకు వీరందరూ రాజకీయ పార్టీలకూ విరాళాలు ఇచ్చేది. ఇప్పుడు వీళ్లే పదవుల్లోకి రావాలనుకుంటున్నారు. దేశాన్ని ఇష్టానురీతిగా మలుచుకుంటున్నారు. చట్టాలు రాజ్యాంగ సవరణలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం పేరిటనే ఇదంతా జరుగుతున్నది.
ప్రజాస్వామ్యానికి విఘాతం
రేపటి నుంచి ఎవరు అధికారంలోకి వస్తరో ఎవరేం చేసినా మాయలు ఫలిస్తాయో చూడాల్సిందే. ప్రజల్లో అందరు స్వచ్ఛందంగా, స్వతంత్రంగా ఆలోచించే స్థితిలో ఉండరు. ఏది మంచిది, ఏది మంచిది కాదనే నిర్ణయ శక్తి కూడా ఉండకపోవచ్చు. ఈ నిర్ణయం వెనుక ప్రభావం ఉంటది. కులం, ధనం, మతం ఇట్లా ఎన్నో ప్రలోభాలకు గురి కావాల్సి వస్తది. అందుకే ఎవలు ఎక్కువ ఓటర్లను మాయచేసే ప్రభావం కల్పిస్తరో వాల్లదే పై చేయి కావచ్చు. అవినీతి ఆరోపణలు ప్రతి పార్టీ ఇంకో పార్టీపై చేస్తూనే ఉంటది. ఇందులో అబద్ధాలు ఏమి ఉండయి. అందరూ అదే రీతి అనుకుంటరు. రాజకీయ అవినీతికి ప్రభుత్వ యంత్రాంగం చేయూతనిస్తే సాధ్యమయితది. ప్రతి పనీ డబ్బులతో ముడిపడి ఉండే సంస్కృతి వచ్చేసింది. ఆఖరుకు ఓటర్లను కూడా అవినీతిపరులుగా అన్ని రాజకీయ పక్షాలు చేస్తున్నవి. ఓటుకు పైసలు ఇస్తేనే వేస్తం అన్న రీతిలో ఆలోచన వస్తుంది. వాళ్లు తింట లేరా మనం ఎందుకు ఉత్తగా వేయాలే అనే రీతిలో డిమాండ్‌లు రావడం ప్రజాస్వామ్యానికి విఘాతమే. ఏది ఏమైనా ఎన్నికల్లో అందరూ పాల్గొని నచ్చిన మెచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది.
అన్నవరం దేవేందర్
94407 63479