పదహారణాల తెలుగు ఎడిటర్ నార్లవెంకటేశ్వర రావు

పదహారణాల తెలుగు ఎడిటర్ నార్లవెంకటేశ్వర రావు... editorial on telugu editor Narla venkateswara rao

Update: 2022-11-30 18:30 GMT

ఎడిటర్‌గా ఆయన రాసిన సంపాదకీయలు ఎన్నో సంచలనాలు సృష్టించాయి. మరెన్నో సమస్యల పరిష్కారానికి దారులు వేశాయి. తనకు నచ్చని సంఘటనలు జరిగితే, తెగదెంచుకొని సంస్థలను వదిలివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నవ్యతనూ, నాణ్యతనూ మేళవించి తెలుగు పత్రికారంగానికి ఆయన శోభను తీసుకువచ్చారు. నార్ల పాత్రికేయుడు మాత్రమే కాదు సాహితీవేత్త, కవి, రచయిత, ఉద్యమకారుడు, హేతువాది, మానవవాది. అనేక కవితా ఖండికలు, పద్య సంకలనాలు, సాంఘిక, పౌరాణిక నాటకాలు, వ్యాసాలు రాశారు. వివిధ దేశాల చరిత్రలు, ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు, విజ్ఞాన, నైతిక విలువలను సామాన్య ప్రజానీకానికి పరిచయం చేశారు. ఆయనకు తెలుగుపైనే కాదు ఆంగ్లంపైన కూడా మంచి పట్టు ఉండేది. ఆంగ్లంలో కూడా అనేక రచనలు చేసి పలువురు ప్రశంసలు పొందారు. మూఢ నమ్మకాలు, ఛాందసాలను విమర్శించారు. సామాజిక పరిణామాలను భౌతికవాద దృష్టితో పరిశీలించడం నార్ల ప్రత్యేకత.

నార్ల వెంకటేశ్వరరావు పేరు వినపడగానే సంపాదకీయం గుర్తుకు వస్తుంది. 'సంపాదకీయం అనేది పత్రికకు గుండె వంటిది. నిష్పక్షపాతంగా సంపాదకీయం రాసిన నాడు సమాజానికి మేలు చేసిన వారం అవుతాం' అని ఆయన తరచూ చెబుతూ ఉండటమే కాకుండా, నిరూపించారు కూడా. ఆయన సంపాదకీయం చదవటం కోసమే పత్రిక కొనుగోలు చేసే పరిస్థితిని తీసుకువచ్చారు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ఆయన సంపాదకీయాలు రాజకీయ, సామాజిక వ్యవస్థలపై చాలా ప్రభావాన్ని చూపాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. పాత్రికేయులు పాటించవలసిన విధి విధానాలను ఆయన ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండేవారు. ఏనాడూ రాజీ పడి తన వృత్తిని నిర్వహించలేదు.

'ప్రజాస్వామ్యం విజయవంతం కావాలన్నా, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల నుంచి ప్రజలు రక్షణ పొందాలన్నా పత్రికలు అత్యంత ఆవకశ్యకం' అనేవారు. పత్రికలే లేకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడే లేదని హెచ్చరించేవారు. 'అధికార పక్షం నిరంకుశంగా వ్యవహరించినపుడు దానికి అడ్డుకట్ట వేయడానికి ప్రతిపక్షాల కన్నా పత్రికలే కీలకం' అంటూ ఉండేవారు. 'పాత్రికేయం అంటే ప్రజల పక్షాన నిలబడాలి కానీ, రాజకీయాల పక్షాలు వైపు కాదని' ప్రజా పాత్రికేయానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతేకాదు, పత్రికలలో ఉపయోగించే భాష సామాన్యులకు కూడా అర్థం కావాలనేవారు. పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేయడంలో ఆయన కృతకృత్యులయ్యారు. కాగడా, జనవాణితో తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నార్ల ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ద్వారా సమర్థంగా కొనసాగించారు. 'తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగువారిలో మనం కదలిక పుట్టించగలం' అని ఆయన తోటి జర్నలిస్టులకు ఉద్బోధించారు.

'ఎడిటర్' అంటేనే ఇష్టం

'బతుకుదెరువు కోసం పత్రికా రంగంలోనికి రావద్దు. నిజాయితీగా, నిర్భీతిగా ఉండేవారే ఈ వృత్తిలోనికి రావాలి' అంటూ కొత్తగా పాత్రికేయులుగా మారాలనుకునేవారికి నార్ల (Narla Venkateswara Rao)హితవు చెప్పేవారు. దానికి భిన్నంగా నిజాలను కప్పిపుచ్చి యాజమాన్యాన్ని రాజకీయ పక్షాలను, నాయకులను సంతృప్తిపరచడం కోసం చేపట్టే పాత్రికేయ వృత్తి తార్చుడు వృత్తి కన్నా హీనమైనదని నిర్మొహమాటంగా చెప్పేవారు. 'సంపాదకుడు' అనిపించుకోవడం కన్నా 'ఎడిటర్' అని పిలిపించుకోవడానికే ఆయన ఇష్టపడేవారు. 'ఏ ఎండకు ఆ గొడుగు పట్ట నేర్చినవాడు ఏమైనా కావచ్చునేమో కానీ, నిజమైన ఎడిటర్ కానేకాడని' కుండ బద్దలుగొట్టినట్లు చెప్పడం నార్లవారికే చెల్లింది. 'తాను చెప్పడమే కాదు, ఎడిటర్‌గా ఆయన కూడా అలాగే నిష్కర్షగా తన వృత్తి బాధ్యతలను ముక్కు సూటిగా నిర్వహించారు. నీళ్లు నమలడం ఆయనకు చేతకాదు.

మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. 'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా' అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసి పత్రికా రచయిత నార్ల. టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, కళా వెంకటరావు, ఎన్‌జీ రంగా, కాసు బ్రహ్మానందరెడ్డి మొదలైన పెద్దలందరూ నార్ల కలంపోటుకు గురైనవారే. తేడా వస్తే, పతాక శీర్షికలలో వారి గురించి ధ్వజమెత్తేవారు. అంతటి ధైర్యశాలి నార్ల. జీవిత కాలం అంతా ఆయన ఏ ఒక్క 'ఇజమ్‌'కూ లొంగకుండా, దేనికీ తలవంచకుండా స్వేచ్ఛగా వృత్తిని కొనసాగించి ఆదర్శ ప్రాతికేయులయ్యారు. పాత్రికేయానికి మార్గదర్శకులయ్యారు.

సంచలన సంపాదకీయాలు

ఎడిటర్‌గా ఆయన రాసిన సంపాదకీయలు ఎన్నో సంచలనాలు సృష్టించాయి. మరెన్నో సమస్యల పరిష్కారానికి దారులు వేశాయి. తనకు నచ్చని సంఘటనలు జరిగితే, తెగదెంచుకొని సంస్థలను వదిలివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నవ్యతనూ, నాణ్యతనూ మేళవించి తెలుగు పత్రికా రంగానికి ఆయన శోభను తీసుకువచ్చారు. నార్ల పాత్రికేయుడు మాత్రమే కాదు సాహితీవేత్త, కవి, రచయిత, ఉద్యమకారుడు, హేతువాది, మానవవాది. అనేక కవితా ఖండికలు, పద్య సంకలనాలు, సాంఘిక, పౌరాణిక నాటకాలు, వ్యాసాలు రాశారు. వివిధ దేశాల చరిత్రలు, ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు, విజ్ఞాన, నైతిక విలువలను సామాన్య ప్రజానీకానికి పరిచయం చేశారు. ఆయనకు తెలుగుపైనే కాదు ఆంగ్లంపైన కూడా మంచి పట్టు ఉండేది. ఆంగ్లంలో కూడా అనేక రచనలు చేసి పలువురు ప్రశంసలు పొందారు. మూఢ నమ్మకాలు, ఛాందసాలను విమర్శించారు. సామాజిక పరిణామాలను భౌతికవాద దృష్టితో పరిశీలించడం నార్ల ప్రత్యేకత. తన జీవిత చరమాంకం వరకూ మూఢ నమ్మకాలపై అలుపెరుగని పోరాటం చేస్తూనే వచ్చారు.

సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధ విశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ 'సీత జోస్యం' రాశారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్య భావజాలానికి సవాలు విసురుతూ 'శంభూక వధ' రాశారు. విశ్వనాథ సత్యనారాయణ, వడ్లమూడి గోపాలకృష్ణయ్య వంటి వారి ఆస్తిక, ఛాందస భావజాలాన్ని, మూఢ విశ్వాసాలను నార్ల తీవ్రంగా విమర్శించేవారు. బాలల కోసం 'వాస్తవమ్ము నార్లవారి మాట' మకుటంతో దాదాపు 700 సందేశాత్మక పద్యాలు ఆటవెలదిలో రాశారు. 1 డిసెంబరు 1908 న జన్మించిన విశిష్ట ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు 16 ఫిబ్రవరి 1985న ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఆయన ఆశయాలను ఆచరణలో చూపగలిగినప్పుడే ఆయనకు నిజమైన ఘన నివాళి.

(నేడు నార్ల వెంకటేశ్వరరావు జయంతి)


రుద్రరాజు శ్రీనివాసరాజు

9441239578

Tags:    

Similar News