సరికొత్త చరిత్ర సీరియళ్లతో ముందుకు వస్తున్న దూరదర్శన్
భారత ఏక్ ఖోజ్, రామాయణం, మహాభారత్ గుర్తున్నాయా? దూరదర్శన్‌లో ఒకప్పుడు గొప్పగా ప్రజాదరణ పొందిన మెగా సీరియళ్లు ఇవి. ప్రేక్షకుల
భారత ఏక్ ఖోజ్, రామాయణం, మహాభారత్ గుర్తున్నాయా? దూరదర్శన్‌లో ఒకప్పుడు గొప్పగా ప్రజాదరణ పొందిన మెగా సీరియళ్లు ఇవి. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన షెహన్ షాలు అవి.ఈ తరానికి అవి అంతగా తెలియక పోవచ్చు. వీరి ముందు తరం నుంచి మాత్రం ఆ జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోలేదు. ఆ రోజులలో ప్రతి ఆదివారం ఓ పండుగలా ఉండేది. దూరదర్శన్ యావత్ దేశాన్ని సమ్మోహనం చేసింది. అప్పుడు ఏ ఇంటిలో అయినా టీవీ ఉంటే అదో స్టేటస్ సింబల్. అందరి చూపులు ఆ ఇంటి పైనే ఉండేవి.
ఆదివారం పిలవని అతిథులుగా వచ్చి టీవీల ముందు వాలిపోయేవారు. ఈ సీరియళ్లకు అతుక్కుపోయేవారు. అది గత చరిత్ర. దూరదర్శన్ ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాసే పనిలో పడింది. దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య అమృతోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న చారిత్రక సందర్భమిది. ఈ నేపథ్యంలో దూరదర్శన్ స్వాతంత్రోద్యమ పోరాట ఘట్టాలను, అన్ సంగ్ హీరోస్ త్యాగాలను ఇతివృత్తంగా తీసుకుని 'స్వరాజ్' మెగా సీరియల్ రూపొందించింది. ఓ దృశ్య కావ్యంగా మలచిన ఈ మెగా సీరియల్‌ను ఆగస్టు 14 నుంచే దూరదర్శన్ ప్రసారం చేస్తున్నది.
చరిత్రను తిరగదోడుతూ
1498లో వాస్కోడిగామా భారతదేశంలో పాదం మోపిన తొలి చారిత్రక సందర్భంతో తొలి ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. 75 ఎపిసోడ్‌ల 'స్వరాజ్' సీరియల్‌లో 15 నుంచి 20 వ శతాబ్దం వరకు దేశంలో సాగిన విదేశీయుల ప్రస్థానం, భారత రాజులపై వారు పన్నిన కుట్రలు, యావత్ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకుని పాలించిన సంఘటనలు, ప్రజలపై అణచివేత, ఆ తర్వాత వలస పాలకులపై భారతీయుల తిరుగుబాటు వంటి అనేక ఘట్టాలు ఇందులో కనిపిస్తాయి. ఎందరో సమరయోధుల పోరాట చరిత్రలు ఈ సీరియల్‌లో ప్రధాన ఎపిసోడ్‌లుగా ప్రసారమవుతున్నాయి.
ప్రముఖ ఇండియన్ ఆథర్, కాలమిస్టు ఆనంద్ నీలకంఠన్ ఈ సీరియల్‌కు టెలీప్లే అందిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ జోషీ వ్యాఖ్యానంతో సాగుతుంది. దూరదర్శన్ భారీ ఖర్చుతో దీనిని నిర్మించింది. 75 వారాల పాటు ప్రతి ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు జాతీయ నెట్‌వర్క్ హిందీలో ప్రసారం అవుతుంది.
తెలుగులోనూ ప్రసారం
అదేవిధంగా తెలుగు సహా తమిళ, కన్నడ, మళయాళ, మరాఠీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ వంటి భాషలలోనూ ప్రసారమవుతున్నది. ఈ మెగా సీరియల్‌ను ఆగస్టు మెుదటి వారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఆగస్టు 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లైబ్రరీ హాలులో కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సీరియల్ మొదటి భాగాన్ని తిలకించారు. ఈ సీరియల్ ఆగస్టు 20 నుంచి ప్రతి శనివారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తెలుగు భాషలో కూడా దూరదర్శన్ యాదగిరి చానల్‌లో ప్రసారం అవుతుంది. తిరిగి ఆదివారం రాత్రి 9.30 నుంచి 10.30 వరకు, బుధ, శుక్రవారాలలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు పున:ప్రసారం అవుతుంది. ఇదే ఎపిపోడ్‌ను ఆలిండియా రేడియో శనివారం ఉదయం 11 గంటలకు ఆడియో రూపంలో ప్రసారం చేస్తుంది. దూరదర్శన్ 'నయా భారత్ కా నయా దూరదర్శన్' పేరుతో సరికొత్త రూపుతో, సరికొత్త సీరియళ్లతో అలరించబోతోంది. జయ్ భారత్, కార్పొరేట్ సర్పంచ్, ఎహ్ దిల్ మాంగే మోర్ వంటి సీరియళ్లు ప్రేక్షకులకు అందించబోతున్నారు. దేశభక్తుల వీరోచిత పోరాట గాథలను దూరదర్శన్ మన ముందు గొప్పగా ఆవిష్కరించబోతున్న శుభ తరుణం ఇది. రండి, వీక్షిద్దాం.
జె. విజయ్‌కుమార్ జీ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్
98480 78109