మోసపోతే గోస పడుతం

Don't be fooled by Congress promises

Update: 2023-11-29 00:15 GMT

శాబ్దాల తరబడి ఆంధ్ర పాలకుల చేతిలో మోసపోయిన తెలంగాణ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని భావించారు. అక్కడి నుంచి పుట్టిందే తొలిదశ తెలంగాణ పోరాటం. ఈ ఉద్యమంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు కానీ.. ఆంధ్రపాలకులు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేయనీయలేదు. 2001లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తన భుజాలకెత్తుకున్న కేసీఆర్​.. గాంధేయమార్గంలో మలిదశ తెలంగాణ ఉద్యమం చేసి, ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్​ సచ్చుడో’ అని చావునోట్లో తలపెట్టి ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేశారు. తెచ్చిన తెలంగాణను ఎవరి చేతిలో పెట్టినా.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరబోవని భావించే ఉద్యమనాయకుడే.. ముఖ్యమంత్రిగా పదేండ్లలో తెలంగాణను ప్రగతిలో పరుగులు పెట్టించారు. ఎన్నికల కోసం ఎదురు చూసిన కాంగ్రెస్​, బీజేపీ రాజకీయ నిరుద్యోగులు అబద్ధాల ప్రచారం, కుట్రలు, అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. తెలంగాణ ఓటర్లు వారి మాటలు నమ్మితే మోసపోయే ప్రమాదం ఉన్నది. గత పదేండ్ల పాలనను ఒక్కసారి నెమరు వేసుకొని.. ఆలోచించి ఓట్లు వేయాల్సిన సందర్భం వచ్చింది.

వేగంగా అభివృద్ధి చెంది..

భారతదేశానికి ఇవాళ తెలంగాణ ఒక అభివృద్ధి మాడల్‌. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించింది. పరిపాలనలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన కేసీఆర్​.. బీడువారిన భూములను పచ్చని పంట పొలాలుగా తీర్చిదిద్దారు. నేటి తెలంగాణ శాంతి సామరస్యానికి ప్రతీక. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ముందుకు వెళ్తున్నది. 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండేది. విద్యుత్ లేక పరిశ్రమలను వారంలో రెండు రోజుల పాటు మూసివేసేవారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది. సీఎం కేసీఆర్‌ సమూలమైన సంస్కరణల ద్వారా పూర్తిగా ఆ పరిస్థితులను మార్చివేశారు. విద్యుత్ మిగులు సాధించాం. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానానికి చేరింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది తెలంగాణ. 2014లో రూ.62 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ ఇప్పుడు రూ.2 లక్షల 94 వేల కోట్లకు చేరుకుంది. తాగునీటిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.36 వేల కోట్లు ఖర్చుచేసింది. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్‌ కల్పించారు.

విద్యుత్తు రంగంలో రూ.38 వేల కోట్లు ఖర్చు చేశారు. 2014లో 7,778 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తయ్యేది. ఇప్పుడది 18,453 మెగావాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకున్నది. తలసరి విద్యుత్తు వినియోగం 2,126 యూనిట్లకు చేరింది. ఇది దేశంలోనే అత్యధికం. 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడులతో 22,100 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. తద్వారా 22 లక్షల 36 వేల పరోక్ష ఉద్యోగాలను సృష్టించారు. 2014లో రాష్ట్రం నుంచి రూ.57 వేల కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతవ్వగా.. ఇప్పుడు రూ.1.83 లక్షలకు చేరాయి. యాపిల్‌, గూగు ల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి బహుళజాతి కంపెనీలు సైతం తమ యూనిట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి. రూ.11 వేల కోట్లకుపైగా ఆసరా పథకం కింద 44 లక్షల మందికిపైగా అర్హులకు పింఛన్లు అందించారు. విద్యారంగంలో రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చారు. 10 వేల మెడికల్‌ సీట్లను పెంచారు. ప్రతీ జిల్లా దవాఖానకు అనుబంధంగా మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది.

అలవికాని హామీలతో మభ్యపెడుతూ..

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నది. అలాంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు 24 గంటల కరెంట్‌ ఇవ్వొద్దని, కేవలం మూడు గంటలు ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించడం ఆ పార్టీ రైతు వ్యతిరేకతను బయటపెట్టింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గత పదేండ్లలో కేసీఆర్‌ చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రభుత్వ పథకాలపై కాంగ్రెస్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నది. కర్ణాటకలో తాజా పరిణామాలతో కాంగ్రెస్‌ డొల్లతనం బయటపడింది. ఏడాదికో ముఖ్యమంత్రిని మార్చిన చరిత్ర కలిగిన పార్టీలో ఏదైనా జరగొచ్చునని చెప్పుకొంటున్నారు కన్నడిగులు. కాంగ్రెస్‌ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా అనాదిగా జరిగే తంతు ఇదే. సీట్ల కేటాయింపు దగ్గరి నుంచి సీఎం ఎంపిక దాకా అంతా కుమ్ములాటల మయమే. ముఠా తగాదాలతో కాలం వెళ్లదీయడమే వారు చేసే పని. ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ఐదేండ్లూ పదవీకాలం పూర్తి చేసుకున్న దాఖలాలు లేవు. సీఎంలను గద్దె దింపేందుకు అల్లర్లు సృష్టించిన హీనచరిత్ర కాంగ్రెస్‌ది. అలాంటి కాంగ్రెస్​ ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అలవికాని హామీలతో మభ్యపెడుతున్నది. ప్రజలారా ఆలోచించండి మోసపోతే.. గోసపడుతం.

బచ్చు శ్రీనివాస్,

సీనియర్ టిఆర్ఎస్ నాయకులు,

93483 11117

Tags:    

Similar News