జిల్లాల వారీ ఎస్సీ వర్గీకరణ.. ఆచరణ సాధ్యమేనా..?
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ఎస్సీ వర్గీకరణకు
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. అంతకుముందు తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఎస్సీ వర్గీకరణ ప్రధాన అంశంగా ఎన్నికలకు వెళ్లడమే కాక, సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌లో జరిగిన ఒక సభలో దీనిపైన కార్యాచరణ ప్రకటించారు. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలను పంచుతామని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అంటూ న్యాయస్థానాలు గతంలో ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో జిల్లాల వారి వర్గీకరణ ఏ మేరకు సాధ్యం అన్నదానిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతున్నది.
వాస్తవానికి షెడ్యూల్ క్యాస్ట్ (ఎస్సీ) అనేది ఒక కులం కాదు. అనాదిగా అణచివేతకు, దోపిడీకి, పీడనకు గురి కాబడుతున్న కొన్ని కులాల సమాహారం. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అత్యంత వెనుకబాటుతనానికి గురికాబడుతున్న 59 కులాలను రాజ్యాంగంలోని ఒక షెడ్యూల్‌లో చేర్చి, వారిని షెడ్యూల్ కులంగా వ్యవహరిస్తూ వారికి 15% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అయితే అణచివేయబడ్డ సమూహంలో కూడా అసమానతలు ఉన్నాయనీ, దీనిలో కొన్ని వర్గాలకే రిజర్వేషన్లు ఫలాలు దక్కుతున్నాయనీ, మాదిగ ఉప కులాలకు అన్యాయం జరుగుతున్నదనీ, కాబట్టి ఉన్న 15% రిజర్వేషన్లను ఏబిసిడిలుగా వర్గీకరించి ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలను పంచాలంటూ ఒక వర్గం గత మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తుండగా, మరో వర్గం ఈ వాదనను వ్యతిరేకిస్తూ రాజ్యాంగం అమలులోనికి వచ్చిన నాటికి ఇప్పటికీ ఎస్సీల జనాభా గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఉన్న 15% రిజర్వేషన్ల శాతాన్ని జనాభా దామాషా ప్రకారం పెంచడం ద్వారా ఉపకులాలకు సైతం అవకాశాలు దక్కుతాయని వాదిస్తోంది.
పైగా వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఇది వైషమ్యాలకు దారితీస్తుందని, ప్రాంతీయ వ్యత్యాసమే తప్ప ఉప కులాలకు అన్యాయం ఏమీ జరగలేదని, మాదిగ ఉప కులాలు వృత్తులను నమ్ముకుని బతకడంతో ఉద్యోగాలపై దృష్టి పెట్టలేదని, కులవృత్తి లేని మాలలు విద్యా ఉద్యోగాలనే నమ్ముకున్నాయని, కాబట్టే వర్గీకరణ అనేది ఎస్సీల ఐక్యతను దెబ్బతీసేందుకు జరిగిన రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ ఆ వర్గం కోర్టులను ఆశ్రయించడంతో ఈ అంశం దశాబ్దాలుగా రాజకీయ అంశంగా రూపాంతరం చెందింది.
మాదిగలను ప్రసన్నం చేసుకునేందుకు....
కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉషామహ్రా కమిషన్ తన నివేదికలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి సవరణ చేయాలని, దానిలో మూడవ క్లాజును చేర్చడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంట్ ఆమోదించవచ్చు అని పేర్కొంది. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని, దీనికై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో ఆ కూటమికి ఎమ్మార్పీఎస్ మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల సభల్లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేస్తే అందుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందంటూ చెబుతూ వచ్చిన చంద్రబాబు, ఎన్నికల అనంతరం జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తామంటూ ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ సంకీర్ణ పక్షాలు అరకొర ఆధిక్యంతో అధికారం చేపట్టడంతో, రాజ్యాంగ సవరణ సాధ్యం కాదని తేటతెల్లమైంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటు ఉభయసభలలో మూడింట రెండు వంతుల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందటంతో పాటు, సగానికి పైగా రాష్ట్రాల అసెంబ్లీలలో ఆమోదం కూడా అవసరం అవుతుంది. ఇప్పుడున్న పార్లమెంట్‌లో పార్టీల బలాబలాల నేపథ్యంలో ఇది సాధ్యం కాకపోవచ్చు.
దీనితో ఎన్నికల్లో తమకు పూర్తిగా సహకరించిన మాదిగలను ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో ఎస్సీల వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా చేయకపోవడం వల్లనే న్యాయస్థానాల్లో సవాళ్లు ఎదురయ్యాయని, దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని వర్గీకరణ అంశంలో చిక్కుముడులను చంద్రబాబు ఎలా అధిగమిస్తారు, జిల్లాల వారీగా వర్గీకరణకు ఉన్న అవకాశాలు ఏమిటి అనే దానిపై చర్చ జరుగుతుంది.
ప్రాంతాలవారీ వర్గీకరణలో చిక్కులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తులు కల్పిస్తున్న ఆర్టికల్ 371డి ద్వారా ఎస్సీ వర్గీకరణకు అవకాశాలు ఉంటాయని కొందరు మాదిగ కులానికి చెందిన మేధావులు కోరుతుండడంతో ఈ దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తుండడం వల్లే జిల్లాల వారి వర్గీకరణ అంశాన్ని ఆయన ప్రస్తావించి ఉండవచ్చు అంటున్నారు. వాస్తవానికి ఆర్టికల్ 371డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాల రీత్యా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలకు సమాన అవకాశాలు, సౌకర్యాలు కల్పించవచ్చు. ప్రభుత్వ ఉపాధిలో. విద్యా విషయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వేరు వేరు కేటాయింపులు చేయవచ్చు. 1973 సంవత్సరంలో దేశంలోని కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తులు కల్పించేందుకు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371ని చొప్పించడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్ ద్వారా ఎస్సీ వర్గీకరణ అమలులోనికి తేవడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందనేది రాజ్యాంగ నిపుణులు ఆలోచించవలసిన విషయం.
న్యాయస్థానాల్లో నిలబడుతుందా..?
వాస్తవానికి ఈ ఆర్టికల్‌లో కులాలకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. కేవలం ప్రాంతాలకు సంబంధించిన ప్రస్తావన మాత్రమే ఉన్నది. ఈ ఆర్టికల్‌ను అనుసరించి రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో వారి ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఉద్దేశించబడిన రాజ్యాంగ ఏర్పాటుగా ఉన్నది. కానీ ఈ ఆర్టికల్ ద్వారా చేసే ఎస్సీ వర్గీకరణ న్యాయస్థానాల్లో ఎంతవరకు నిలబడుతుందనేది ప్రశ్నార్థకమే. మరోవైపు జిల్లాల వారి ఉప కులాల జనగణన కూడా ఒక ప్రతిబంధకంగా మారవచ్చు. ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోమారు ప్రకంపనలు లేపనున్నదని భావించాలి.
-నేలపూడి స్టాలిన్ బాబు,
రాజకీయ విశ్లేషకులు
83746 69988