స్వయంకృతాపరాధాలే ముంచాయా?

Did the BJP fall due to self-inflicted guilt

Update: 2023-12-06 01:00 GMT

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి నేలవిడిచి సాము చేసినట్లుగా ఉంది. ప్రతిసారీ తెలంగాణ బీజేపీ బలవుతూనే ఉంది. నిజమైన కార్యకర్తలు ఉసూరుమంటూ మళ్ళీ పార్టీ జెండా నిలబెట్టడానికి కష్టపడుతూనే ఉన్నారు. తప్పుడు సలహాలు, చెప్పుడు మాటలు విని నిజానిజాలు విచారించకుండా తీసుకున్న నిర్ణయాలు, ప్రతిపక్షాల ఆరోపణలు ధీటుగా ఎదుర్కోలేకపోవడం, పాతవారిని పూర్తిగా పక్కన పెట్టడం, కొత్త వారితోనే పార్టీ గెలుస్తుందనే భ్రమలు వెరసి రాష్ట్రంలో బీజేపీ మరోసారి పాతాళంలోకి జారిపోయింది. వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేయని, గెలిచే స్థాయి లేని, పోటీ చేసినా కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయిన వారు పార్టీ పదాధికారులుగా ఫోజులు, నోట మాట రాని వారు కొందరు అధికార ప్రతినిధులుగా చలామణి అవుతుంటే బీజేపీ సరైన మార్గంలో ఎలా వెళుతుంది?

అందుకే భారీ మూల్యం..

గతంలో ప్రతి కార్యకర్త పార్టీ నాయకులను సులువుగా కలిసే అవకాశం ఉండేది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా ఎక్కడా లేని రహస్యాలు, అడుగడుగునా గార్డులను పెట్టి గాజు గ్లాసులతో ఎవరూ నాయకులను కలువకుండా అడ్డుగోడలు సృష్టించారు. దీంతో అవగాహన లేని గార్డులతో ఆపించుకొని అవమానాల పాలవడం ఎందుకని కొందరు నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆఫీస్‌కు రావడం కూడా మానేశారు. ఏదైనా ముఖ్యమైన విషయం ఫోన్‌లో నైనా చెప్పాలనుకుంటే పీఏలే అడ్డుకోవడం ఎక్కువైంది. పైగా బీజేపీ ఏదో చేయబోతున్నట్లు పెద్ద బిల్డప్. ఇంతచేసి సాధించిన సీట్లు ఎన్ని అంటే కేవలం 8. పార్టీ నాయకత్వానికి కొందరు వాస్తవాలు చెప్పినా నిర్లక్ష్యం. పార్టీ సోకాల్డ్ సలహాదారులు, పదాధికారులు చెబితేనే పార్టీ శ్రేయస్సు కోసం వాస్తవాలు చెప్పినట్లు లెక్క. కవిత అరెస్టు విషయంలో పార్టీకి, కేంద్రానికి సంబంధం లేదని చెప్పడం ఎంత సమంజసమో? ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆమె సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న విషయాన్ని బలంగా వినిపించడంలో పార్టీ సలహాదారులు, సోకాల్డ్ అధికార ప్రతినిధులు విఫలం కావడం కూడా అంతే ఘోరం. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అనే స్థాయిలో ఎదిగిన పార్టీని కొందరు స్వార్థంతో, ఓర్వలేనితనంతో చేసిన ఫిర్యాదులను పార్టీ అధినాయకత్వం పూర్వాపరాలు ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయంతో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది.

ఆ అవకాశాన్ని జారవిడుచుకుని..

మహాసంగ్రామ పాదయాత్రతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన బండి సంజయ్‌ను చెప్పుడు మాటలు విని ఉన్నపళంగా అధ్యక్ష స్థానం నుంచి తొలగించిన రోజే బీజేపీ తన పరాజయాన్ని లిఖించుకుంది. కొందరు అహంకారుల కారణంగా పార్టీ భ్రష్టు పట్టింది. చివరికి వారేమైనా సాధించారా అంటే చెడపకురా చెడేవు అన్న రీతిలో ఘోరంగా ఓడిపోయారు. వ్యక్తి నిష్ఠకు దూరంగా ఉండే పార్టీ పూర్తిగా సమష్టి నిర్ణయాలకు దూరమైంది. గతంలో పక్క పార్టీ నుంచి ఒకరిని తీసుకోవాలన్నా, పదవులివ్వాలన్నా, ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆర్ఎస్ఎస్ పెద్దలతో కూడా చర్చించే వారు. ప్రతి విషయంలో వారి మార్గదర్శనం బీజేపీ తీసుకునేది. లింగం సుధాకర్ జి. ఆలె శ్యాంజీ లాంటి వారు ఆర్ఎస్ఎస్ బాధ్యతల్లో ఉన్నంతకాలం పరిస్థితి కొంతవరకు బాగానే ఉంది. అయితే 2014లో అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ పెద్దలంతా వ్యతిరేకించినా ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ నాయకుడి ఒత్తిడితో టీడీపీతో జతకట్టి బీజేపీ నిండా మునిగింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఇన్నేళ్ళ తర్వాత బండి సంజయ్ రూపంలో దొరికిన అవకాశాన్ని కూడా పార్టీ చేజేతులా జారవిడుచుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలువకుండా నిలువరించాలంటే, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని ప్రతిపక్షాలు, ప్రజలు అంగీకరిస్తున్న దశలో కూడా పార్టీ శక్తిని సరిగ్గా అంచనా వేయకుండా తప్పు నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు? పక్క రాష్ట్రాల్లో విజయాలు సాధిస్తే ఇక్కడ స్వీట్లు పంచుకుని సంబరపడే స్థాయి నుంచి తెలంగాణలోనే పార్టీ విజయాలకు గర్వంతో స్వీట్లు పంచుకుని సంబరపడే స్థాయికి పార్టీని బండి సంజయ్ చేర్చాడనడంలో సందేహం లేదు.

వ్యక్తులు చెప్పినట్లు నడిస్తే ఎలా?

నాయకులను సరైన దారిలో నడపాల్సిన పార్టీ కొందరు వ్యక్తులు చెప్పినట్లు చేసే దుస్థితికి చేరింది. అందుకే నిజామాబాద్ ఎంపీ అరవింద్ తన నియోజకవర్గంలో తనకు ఇష్టం ఉన్న వారికే టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటా అనగానే పార్టీ ఒప్పుకోవడమేంటి? సొంత ఇంటి యజమాని చెప్పినట్లుగా కుటుంబీకులు వినని ఈ రోజుల్లో ఒక ఎంపీ గెలిపిస్తాననగానే 7 అసెంబ్లీ సీట్లను ఆయనకు అప్పగించడం ఘోర తప్పిదం. నిజామాబాద్ జిల్లాలో పార్టీ భ్రష్టు పట్టడానికి ఆయన కారకుడయ్యాడనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజామాబాద్ లోక్ సభ పరిధిలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత అరవింద్ తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చెప్పుకున్నారంటే అందులో వాస్తవం లేకపోలేదు. అంతేకాకుండా అరవింద్ తండ్రికి సన్నిహితుడైన సుదర్శన్ రెడ్డి (బోధన్)కి అనుకూలంగా అరవింద్ బీజేపీని బలహీన పరుస్తున్నారని పత్రికలు కూడా రాశాయి. అందుకే బోధన్ నియోజకవర్గంలో నలుగురు బలమైన మండలాధ్యక్షులను తొలగించారని, పాతవారిని పూర్తిగా విస్మరించి సుదర్శన్ రెడ్డి ప్రధాన అనుచరుడిని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌గా నియమించారని, కీలకమైన ఎన్నికల సమయంలో పార్టీకి ఇబ్బందులొస్తాయని ప్రతి కార్యకర్త మొత్తుకున్నా పట్టించుకొకపోవడంతో పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. బోధన్ లో నిజమైన నాయకులు, కార్యకర్తలు పార్టీ విజయానికి తీవ్రంగా కృషి చేసినా ఎన్నికలకు రెండు రోజుల ముందు బీజేపీ, కాంగ్రెస్ ఒకటయ్యాయనే దుష్ప్రచారం చేసింది కూడా అరవింద్ అనుచరులే అంటున్నారు. కరడుకట్టిన కార్యకర్తలు కూడా కొందరు అరవింద్ ఓడిపోతే చాలు రాష్ట్రానికి, జిల్లాకు పట్టిన శని వీడిపోతుందని భావించారంటే ఆయన పార్టీలో ఎంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారో అర్థమవుతుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పొరపాటున ఆయనకు మళ్ళీ టికెట్ ఇస్తే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందంటున్నారు.

సమూల ప్రక్షాళన అవశ్యం

గతంలోలాగా మళ్ళీ పొరపాట్లు చేస్తూ ఉన్నంతకాలం కిషన్ రెడ్డి, డా. లక్ష్మణ్ లాంటి నాయకులు పార్టీ కోసం ఎంత కష్టపడ్డా లాభం లేకుండా పోవడమే కాదు, లేనిపోని అపవాదులు మోయాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. ప్రజల్లో లేకుండా, పార్టీ పదవులతో పదాధికారులుగా, అధికార ప్రతినిధులుగా పెద్దరికాలు చేస్తున్న పలువురిని వెంటనే తొలగించాలి. లోకసభ ఎన్నికలకు కూడా ఇప్పటినుంచే దృష్టి పెట్టి పక్క పార్టీ నుంచి వచ్చే వారి కోసం ఎదురు చూడకుండా, పార్టీ ప్రస్తుత పరిస్థితులకు కారకులైన వారిని పూర్తిగా పక్కన బెట్టి వారి స్థానంలో సమాజంలో ప్రతిష్టులైన, సేవాదృక్పథం ఉన్న బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలి. వీలైతే బండి సంజయ్‌ని వెంటనే మళ్ళీ పార్టీ అధ్యక్షుడిగా నియమించి, కేంద్రమంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి మళ్ళీ పూర్తి సమయం తన మంత్రిత్వ బాధ్యతలు నిర్వహించేలా అవకాశం కల్పించాలి. ఆలె శ్యామ్ జీ లాంటి ఆర్ఎస్ఎస్ పెద్దకు పార్టీ పర్యవేక్షక బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఇందుకోసం ఆర్ఎస్ఎస్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గత విజయాల్ని సాధించడం కూడా కష్టమే.

శ్యామ్ సుందర్ వరయోగి

సీనియర్ జర్నలిస్ట్

98669 66904

Tags:    

Similar News