సమాన అవకాశాలతోనే అభివృద్ధి!
సమాన అవకాశాలతోనే అభివృద్ధి!... development with equal opportunities in india
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు నిరంతరం పోటీ పడుతున్నాయి. వారిని గెలవడానికి సంప్రదాయ ఉచిత నీరు, విద్యుత్ వంటి కానుకలు సరిపోనందున ఇప్పుడు ఈ ధోరణి మరింత పెరిగి ఉచిత స్మార్ట్‌ఫోన్ వరకు వెళ్ళింది. ఇప్పుడు ఉచితాలు కొత్త భావన కాదు, ఇది ఇప్పుడు భారతీయ రాజకీయాల్లో ఒక జీవన విధానంగా అంతర్లీనంగా తయారైంది. ఇప్పుడు భారతదేశం ‘ఉచితాల సంస్కృతి’ని నిలిపివేయకపోతే, శ్రీలంక అనుభవించిన ఆర్థిక సంక్షోభం భారతదేశం కూడా ఎదుర్కోక తప్పదని పలువురు ఆర్థిక నిపుణులు, మేధావులు, ప్రపంచ సంస్థలు హెచ్చరించిన విషయం తేలికగా తీసుకోకూడదు!
అసమానత్వం పెరగడానికి కారణాలు..
భారతదేశం ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగానే కాదు, అసమాన దేశాలలో కూడా ముందున్న దేశంగా పరిగణిస్తారు. దేశంలో బలమైన ఆర్థికాభివృద్ధి చాలా సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, ఇది పేదరికాన్ని తగ్గించడానికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీనికి హోదా, హక్కులు, అవకాశాలు, వనరుల అన్యాయమైన పంపిణీ, సామాజిక, ఆర్థిక అసమానతలు, అధిక అసమాన జనాభా, సేవలు, పారిశ్రామిక రంగాల్లో అనుకున్న స్థాయిలో ఉద్యోగాలను కలిగించకపోవడం, వ్యవసాయం వదలిలోచ్చిన వారికి తగిన అవకాశాలు కల్పించలేకపోవడం లాంటివి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. పేదలు ఇప్పటికీ కనీస వేతనం సంపాదించలేకపోతున్నారు. మరోవైపు దేశంలో ఆరోగ్య వ్యయం పెరిగిపోతోంది, పాఠశాల విద్యను భరించగలిగే స్థోమత కూడా కొన్ని కుటుంబాలకు లేదు. ఇందులో ఎక్కువ అట్టడుగు వర్గాల వారే! దీర్ఘకాల పెట్టుబడి లేని కారణంగా పేదలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అడ్డగోలు అభివృద్ధి నమూనాలు, దోచి దాచిపెట్టే అవినీతి రాజకీయ వ్యవస్థలు కూడా ఇతరత్రా కారణాలుగా చెప్పవచ్చు. ఈ పెరుగుతున్న అంతరాలు, అసమానతలు మహిళలు, పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి.
బడ్జెట్‌ను మించి బిలియనీర్ల సంపద...
దేశంలో ఎక్కువ పన్నులు చెల్లించేవారు పేదలే, ధనికులతో పోల్చితే పేదలు వస్తువులు, సేవలపై ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. 2012- 2021 వరకు దేశంలో సృష్టించబడిన సంపద 40% ధనవంతులుగా ఉన్నా 1% మందికి చేరగా, 3% మాత్రమే పేదలకు వెళ్ళిందని ఒక నివేదిక దేశంలోని సంపద పంపిణీలో పెద్ద అసమానతను ఎత్తి చూపింది. జీఎస్టీ సొమ్ము దాదాపు 64% జనాభా నుంచి వచ్చింది. కేవలం 4 శాతం మాత్రమే ధనవంతుల నుండి వచ్చినట్టు నివేదిక పేర్కొంది. లీకైన పండోర పేపర్స్ ప్రకారం, 380 కంటే ఎక్కువ మంది భారతీయులు 200 బిలియన్ రూపాయల విలువైన విదేశీ, స్వదేశీ ఆస్తులను కలిగి ఉన్నారని ఆక్స్ ఫామ్ నివేదిక తెలిపింది. ప్రతి సంవత్సరం ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా ప్రతి సెకనుకు దాదాపు ఇద్దరు వ్యక్తులు పేదరికంలోకి కూరుకుపోతున్నారు. మెడికల్ టూరిజం విషయంలో దేశం అగ్రస్థానంగా ఉన్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది. ప్రపంచ ప్రసూతి మరణాలలో 17%, ఐదేళ్లలోపు పిల్లల మరణాలలో 21% మన దేశం నుండే నమోదు కావడం బాధాకరం. దేశంలో పేదలు ఆకలి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆరోగ్య వైపరీత్యాల కారణంగా బాధపడుతుంటే, బిలియనీర్లు మాత్రం బాగా అభివృద్ధి చెందుతున్నారు. కానీ పేదలు జీవించడానికి కనీస అవసరాలు నేటికీ పొందలేకపోతున్నారు. 2023 ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం, దేశ జనాభాలో 1% మంది జాతీయ సంపదలో 40.5% కలిగి ఉన్నారు. దేశంలోని మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 నుండి 2022 నాటికి 166కి పెరిగింది. కరోనా సమయంలోనూ దేశంలోని బిలియనీర్ల సంపద రోజుకు 121 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రూ.54.12 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే ఇది మొత్తం కేంద్ర బడ్జెట్‌కు ఒక ఏడాదిన్నర బడ్జెట్‌కు పూర్తి నిధులు అందించగలదు.
సంపన్నులపై పన్నులే...పరిష్కార మార్గం
దేశంలో ధనవంతులపై పన్ను విధించే సమయం ఆసన్నమైంది. వారినుంచి న్యాయమైన వాటాను చెల్లించేలా, సంపద పన్ను, వారసత్వ పన్ను వంటి ప్రగతిశీల పన్ను చర్యలను అమలు చేసినప్పుడే అసమానతలను పరిష్కరించడం సులువవుతుందని చారిత్రాత్మకంగా నిరూపించబడింది. ధనవంతులు, కార్పొరేట్లపై తక్కువ పన్ను విధించడంలో వైఫల్యం చెందితే, ఇది మరింత అసమానత పెంచుతుందని ఆక్స్‌ఫామ్ ఇండియా పేర్కొంది. అలాగే ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ రూపొందించిన నివేదిక ప్రకారం, దేశంలోని బిలియనీర్ల మొత్తం సంపదపై ఒకసారి 2% పన్ను విధించినట్లయితే, రాబోయే మూడేళ్లలో దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి పోషకాహారం కోసం రూ. 40,423 కోట్లను పొందవచ్చని తెలిపింది. దేశంలోని 10 మంది సంపన్న బిలియనీర్లపై 5 శాతం పన్ను ఒకేసారి విధిస్తే రూ.1.37 లక్షల కోట్లు వస్తాయి. ఇదీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంచనా వేసిన రూ.86,200 కోట్ల నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువ. 1% సంపద పన్ను జాతీయ ఆరోగ్య మిషన్‌కు నిధులు సమకూరుస్తుంది. అలాగే టాప్ 100 మంది బిలియనీర్లపై 2.5% లేదా, టాప్ 10 బిలియనీర్లపై 5% పన్ను విధిస్తే దాదాపు 150 మిలియన్ల మంది పిల్లలను తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి అవసరమైన డబ్బు సమకూరుతుందని ఆక్స్‌ఫామ్ తెలిపింది.
ఉచితాలు - కష్టాలను తగ్గించలేవు...
అనేక రాష్ట్రాల్లో అనేక ఉచితాలు, సబ్సిడీ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆకలి మరణాలు, విద్యుత్తు అంతరాయాలు, విద్య, వైద్య పరంగా సేవలు సరిగ్గా అందటం లేదు, ఉచితాలు, రాష్ట్రా, దేశ ఆర్థిక వృద్ధిపై సానుకూల ఫలితాల కంటే ఎక్కువగా దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతాయి. పేదవాని ఆర్థిక వృద్ధికి ఉచితాలు తాత్కాలికంగా కొంతకాలం పాటు సహాయకారిగా ఉండగలేవేమో కానీ ఉచితాలు, ప్రోత్సాహకాలు భారతదేశ ప్రజల కష్టాలను శాశ్వతంగా తగ్గించలేవు, సరికదా సోమరితనాన్ని పెంచుతోంది. ఇకనైనా కేంద్రం, రాష్ట్రాలు ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఓట్ల కోసం అనవసర ఉచితాల వైపు అడుగులు వేయకుండ ఆరోగ్యం, విద్య, ఉద్యోగ కల్పన వంటి సేవలపై అధిక వ్యయం చేయడం వంటివి చేస్తూ... సమానమైన అవకాశాలను అధిక జనాభా కలిగిన అట్టడుగు వర్గాలకు నిజాయితీగా కల్పించినప్పుడే అసమానతలను దీటుగా ఎదుర్కోగలం..
డా. బి. కేశవులు నేత. ఎండీ
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672