కుల వివక్షను దహించిన చిత్రం

Dahanam is a film that ignited caste discrimination

Update: 2023-12-02 00:45 GMT

సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా ఇదే సంగతి. కొన్ని సినిమాలైతే మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్‌ కు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ రిలీజ్‌లకే నోచుకోవడం లేదు. మరికొన్ని మూవీస్‌ థియేట్రికల్‌ రిలీజైన తర్వాత ఆరేడు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలా ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే దహనం. గతంలో లాహిరి లాహిరి లాహిరిలో, ధన లక్ష్మి ఐలవ్యూ వంటి సినిమాల్లో నటించిన ఆదిత్య ఓం ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా ఆచారాలు, కట్టు బాట్ల, సంప్రదాయాల నేపథ్యంలో ఒక సందేశాత్మక కథనంతో దహనం సినిమా తెరకెక్కింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా పలు చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అవార్డులు కూడా వచ్చాయి.

ఈ ఏడాది మార్చిలో ధియేటర్లలో విడుదలైన దహనం చిత్రాన్ని ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో ఓపెన్ ఫీల్డ్ మీడియా బ్యానర్‌పై డా.పి. సతీష్ కుమార్ నిర్మించారు.దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సినిమా కథ సమాజంలోని అగ్రకులాల ఆధిపత్యానికి, వెలివేయబడ్డ దళిత కుటుంబానికి మధ్య ఉంటుంది. కుల వ్యవస్థను నిర్మూలించడమే ఈ సినిమా ప్రధానాంశంగా తెరకెక్కింది.

కథేంటంటే..

ఈ సినిమాలో భరద్వాజ శాస్త్రి పాత్ర ద్వారా శివభక్తుడికి ఉండే కట్టుబాట్లను తన నటన ద్వారా చక్కగా చూపించారు. భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగానే భూస్వామ్య, జమీందారు వ్యవస్థల అధిపత్య ధోరణిని కూడా ఈ సినిమాలో భూపతి పాత్రలో తెలుసుకోవచ్చు. అలాగే కాటికాపరిగా బైరాగి పాత్రలో నటించిన ఎఫ్ఎం. బాబాయ్ జీవితం ద్వారా ప్రతిరోజూ ఒకే ఊరిలో బ్రతుకుతూ ఒకే నేలపై నడుస్తూ ఒకే గాలి పీలుస్తూ ఉండే ఇద్దరు శివభక్తుల మధ్యన అంటరానితనం తనని తాను దహించుకునేలా చేయడం, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బ్రాహ్మణ అమ్మాయి ఒక దళిత అబ్బాయి మధ్యన కూడా గౌరవప్రదమైన స్నేహం, మంచితనం, చనువు ద్వారా ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆ అమ్మాయిని కాపాడటం. దీంతో అగ్రకుల అమ్మాయిని తాకాడని కుల వివక్షతో తాను పట్టుకున్న చేతికి వాతలు, ఆ అమ్మాయికి హోమం వంటి పూజలు చేయించడం, పసుపు నీళ్ళతో అభిషేకం చేయడం ద్వారా మైలపోతుందనుకోవడం వంటివి ఈ సినిమాలో చూపించడంతో ఆనాటి కాలంలో అగ్రవర్ణాల వారి ముందు మహార్ కులానికి చెందిన వారు ఎదుర్కొన్న కులవివక్షను తెలుసుకోవచ్చు. నేటికి కూడా అక్కడక్కడ ఇలాంటి దౌర్భాగ్యపు కట్టుబాట్లు ఉండటం మానవత్వానికి మచ్చలాగా మిలిగిపోతున్నాయి. అలాగే ఈ సినిమాలో భూపతి పాత్ర ద్వారా నాడు భూస్వాముల ఆధిపత్యం ఏ విధంగా ఉండేదో తెలుస్తుంది. అలాగే నాటి కాలంలో స్త్రీలపై ఈ భూస్వాముల చేసే దౌర్జన్యాలు, ముఖ్యంగా కింది కులాల స్త్రీలపై చేసే దౌర్జన్యాలు వారి వ్యామోహం తీర్చడానికి అడ్డురాని కులం, అంటరానితనం ఇతర విషయాల్లో అడ్డం వస్తుందా అనే ప్రశ్నను రేకేత్తించారు. ఈ చిత్రంలో ప్రధాన భూమిక పోషించిన నటీనటులు భూపతి గారి భార్య పాత్రధారిణి పరమ శివభక్తురాలు, భరద్వాజ శాస్త్రీ పాత్ర కూడా పరమ శివభక్తుడు ఆ తర్వాత కాటికాపరి పాత్ర పోషించిన బైరాగి కూడా శివభక్తుడే. ఈ చిత్రం పూర్తిగా శైవ కవిత్వాన్ని పరిచయం చేసింది కాదు. పూర్తిగా శివనామస్మరణే మోక్షం కలిగిస్తుంది. శివభక్తుడే గొప్పవాడు అనేలా సాగింది.

అందరూ సమానమని గ్రహించి..

ఈ సినిమాలో పరమ శివభక్తుడిగాను, నిత్యం శివుడినే పూజించే పూజారిగా, ఆ తర్వాత నాటుసారా చేపల పులుసు తింటూ కాటికాపరిగా జీవితం గడుపుతున్న బైరాగి ఇద్దరూ శివభక్తులుగానే చూపించారు. అయితే శివ పూజ చేసే భరద్వాజ శాస్త్రి, బైరాగి ఈ రెండు పాత్రలను పోల్చి చూసినప్పుడు శాస్త్రి గారి కుటుంబమంతా తినడానికి తిండి లేకుండా బ్రతుకుసాగిస్తుంటుంది. బైరాగి కుటుంబం కడుపు నిండుగా తింటూ జీవనం సాగిస్తుంటారు.. అయినా శివుడి ప్రేమ బైరాగి మీదే ఉంటుంది. కలలో బైరాగిని శివుడు పిలవటం ద్వారా భరద్వాజ శాస్త్రి పాత్ర ద్వారా దివంగత గాయకుడు సాయిచంద్ పాడిన రాతిబొమ్మలోన కొలువైన శివుడా, రక్తసంబంధం విలువ నీకు తెలియదురా, తెలిసుంటే చెట్టంత మా కొడుకును తిరిగి తెచ్చియ్యగలవా? అంటూ పాట ద్వారా ప్రశ్నిస్తారు. కానీ శివుడు అనుగ్రహించకపోవడం వంటివి చూడవచ్చు.

దైవం మీద భక్తి అనేది మనసులో ఉండాలి కానీ కట్టుబాట్లతోనూ, కులాలపరంగాను ఉండదని, నీసు (మాంసాహారం)తింటే భక్తి ఉండదనేది, దేవుడు అనుగ్రహించడనేది మూర్ఖత్వమే అని బైరాగి పాత్ర మనకు నేర్పుతుంది! అంతేకాకుండా భక్తకన్నప్ప శివుడికి మాంసాన్నే నైవేద్యంగా పెట్టాడని శివుడినే ఆరాధించేవాడని నెమరువేసుకుంటాము. చివర్లో మైల పడతాడు శివయ్య అనుకుంటూ బైరాగి చెప్పిన డైలాగ్ రాత్రంతా శ్మశానంలో నాతో కలిసి జాగారం చేస్తావు తెల్లారే సరికి కొండెక్కి పూజలందుకుంటావు నీకు మైల ఉండదేంటయ్య అందుకే గంగమ్మను నెత్తిన పెట్టుకొని తిరుగుతావు ఆమెనే శుద్ధి చేస్తుంది. అని చెప్పే డైలాగ్ అందరిని ఆలోచింపజేస్తుంది. తనను తాను దహించుకోవడం ద్వారా భక్తుడికి భగవంతుడికి మధ్య బంధం తెలుస్తుంది. చివరికి తన ద్వారానే బైరాగి మరణించాడని ఆయన ద్వారానే ఆలయ ధర్మకర్తగా అవకాశం వచ్చిందని తెలుసుకుని వియ్యంకుడిగా చేసుకున్న భరద్వాజ శాస్త్రి పాత్ర ద్వారా సినిమా ముందులోనే రామాయణ భారతాలు రాసిన వాల్మీకి, వ్యాస మహర్షి మన కులంవారు కాదు కదా? కులం అనేది మనం సృష్టించుకున్నదే, దేవుడు దగ్గర కులాలు ఎందుకు? అని బ్రాహ్మణులతో చెప్పించడంతో ఈ చిత్రం కుల వివక్షను దహించిందని చెప్పవచ్చును. ఈ సినిమా ద్వారా దేవుడి దగ్గర అందరూ సమానమే అని గ్రహించి మానవత్వమే భూప్రపంచంలో ఉన్నతమైనది అని చాటాలి.

(ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది)

-ఎజ్జు మల్లయ్య

96528 71915

Tags:    

Similar News