ఆరిన గుడ్డి దీపం
కుండపోత వాన. మొగులుకు చిల్లుపడినట్టుగానే ఉన్నది. కరెంటు లేదు. బుడ్డిదీపం నీడల నులుక మంచాల మీద కునుకు తీస్తుండ్రు మైసయ్య,
కుండపోత వాన. మొగులుకు చిల్లుపడినట్టుగానే ఉన్నది. కరెంటు లేదు. బుడ్డిదీపం నీడల నులుక మంచాల మీద కునుకు తీస్తుండ్రు మైసయ్య, యాదమ్మ. మైసయ్యకు 84 ఏళ్లుంటాయి. యాదమ్మకు 72 సంవత్సరాలు. మేనరికం కావడంతో ఏజ్ గ్యాప్‌ను అప్పటి పెద్దలు పట్టించుకోలేదట. బయట రేకుల షెడ్డులో గాఢ నిద్ర పోతున్నాడు బాలేశు. ఉన్న దేవుండ్లందరికీ మొక్కంగ పుట్టిన ఏకైక సంతానం బాలేశు. అంతలోనే ధడేల్ మని శబ్దం. ఇల్లు కూలింది. ఆ శిథిలాల కింద మైసయ్య, యాదమ్మ సమాధయ్యారు.
*
బాలేశుకు 15 ఏండ్ల క్రితమే పెళ్లయింది. ఎకరం భూమి ఉన్నది. ఏదో ఒక పనిచేసి సాదుకుంటడనుకొని పిల్లనిచ్చిండ్రు. బాలేశు భార్య పేరు తిరుమల. పదో తరగతి సదువుకొన్న బాలేశు ఏ పని చేసేవాడు కాదు. ఊళ్లో ఎవరన్నా అడిగితే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న అనేటోడు. 'నిన్ననే పట్నం పోయొచ్చిన కొలువు వస్తది'అని చెప్పేవాడు. ఐదేండ్లు సంసారం చేసిన భార్య 'పనిగండం మొగడు నాకొద్దు'అంటూ విడాకులిచ్చి పుట్టింటికి వెళ్లిపోయింది. మీది నుంచి కులపోళ్లు రెండు లక్షల రూపాయలు దండుగ (జరిమానా) వేసిండ్రు. 'కూసుండి తింటె గుట్టలైన కరుగుతయ్'అంటరు కద. బాలేశు ఏ పనిచేయకపాయె. మీదికేళ్లి పెండ్లికి చేసిన అప్పు కుప్పయింది. ఐదు లక్షల రూపాయలు వడ్డీతోటి కట్టాలని షావుకారు తంగ్ చేస్తుండు. ఏం చేయాల్నో అర్థం కాలేదు మైసయ్యకు.
'ఇజ్జత్ తోటి బతికినం, ఇజ్జత్ గానే సావాలె.. వద్దు.. వీడు పనిచేయడు.. వాని సావువాడు సావని'అనుకున్నాడు. భార్య యాదమ్మకు నచ్చజెప్పిండు. ఊళ్లె ఉన్న పటేల్ ను కలిసి తన భూమి అమ్ముతానని చెప్పిండు. పట్టా పాస్ బుక్ ఇచ్చి జెర జెల్ది పోయేటట్టు సూడుమని బతిమిలాడిండు. సరేరా, నేను మండలాఫీసుకు పోతున్న అక్కడ కాగితాలు సూసి చెప్త అన్నడు. మరునాడు ఉదయాన్నే చేతికర్రను ఊతంగా తీసుకొని మెల్లిగా పటేల్ ఇంటికి పోయిండు మైస. అరుగుమీద కూసున్నడు. పటేల్ బయటికి రానే అచ్చిండు. 'నీ భూమి అమ్ముడు చానా కష్టం మైసయ్యా' అనేసరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది మైసయ్యకు. 'ఏమైంది పటేలా, మా తాతల నుంచి చేస్కుంటున్నం. మాదే కదా.. పాసు బుక్కు కూడా ఉన్నది కదా''నువ్ చెప్పేది నిజమే కానీ సర్కారుకు అవన్నీ తెల్వదు కదా! నీ సర్వే నంబర్ మీద ఎవడో కేసు పెట్టిండట. నంబర్ లో ఉన్న 80 ఎకరాల మీద కేసు పడ్డది. నంబర్ మొత్తాన్ని బ్లాక్ చేసిండ్రు'అనంగనే రందితోనే ఇంటికి చేరుకున్నడు.
*
అన్నం పోతలేదు. నిద్ర పడ్తలేదు. బయట ఏ సప్పుడైనా షావుకారు పైసల కోసం వచ్చిండేమోననే టెన్షన్ అయితున్నది. ఒక రోజు రాత్రి మైసయ్యకు నోటి మాట రాలే. కాలు కదులలే. పక్కనే ఉన్న భార్యను నిద్ర లేపుదామంటే చేయి ఆధీనంలో లేదు. ఎంత బలాన్ని కూడగట్టుకున్నా సత్తువ వస్తలేదు. ఎడమ కాలితో కాలి దగ్గర ఉన్న నీళ్ల చెంబును తన్నిండు. అలికిడికి యాదమ్మ నిద్ర లేచింది. లైట్ వేసింది. మైసయ్య మూతి వంకర పోయింది. కుడి కాలు, చేయి బండరాయిలా మారాయి. ఏడుస్తూ 'ఓ అయ్యా, జర లెవ్వయ్యా'అంటూ ఏడ్చేసింది. కొడుకు బాలేశును నిద్ర లేపింది. ఇద్దరూ కలిసి కాలికి, చేతికి అమృతాంజనం రాశారు. పక్కింటి వాళ్లను లేపిండ్రు. అందరూ కలిసి ఆటోలో నిజామాబాద్ దవాఖానకు తీస్కపోయిండ్రు.
ఐదు రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించారు. దవాఖాన బిల్లు మూడు లక్షలైంది. బాలేశు ఆ రాత్రికే ఊరికిపోయిండు. పటేల్ ను కలిసిండు. విషయమంతా చెప్పిండు. నాయిన డిశ్చార్జి కావాలంటే మూడు లక్షలు కట్టాలట. పైసల్లేవు ఎలాగైనా ఇప్పించమని బతిమాలాడు. తానే వస్తానని చెప్పాడు పటేల్. మరుసటి రోజు నిజామాబాద్ దవాఖానకు వచ్చి బిల్లు కట్టాడు. డిశ్చార్జి చేయించి ఇంటికి పంపాడు. ఆటోలో మైసయ్యను తీసుకొని యాదమ్మ, బాలేశు ఊరిబాట పట్టారు.
*
మరుసటి రోజు ఉదయమే మైసయ్య ఇంటికి వచ్చిండు పటేల్. యాదమ్మ కుర్చీ తెచ్చి వేసింది. కూసున్నడు పటేల్. 'మైసయ్యా రంది పెట్టుకోకు నీ జాగా ఎట్లనన్నచేసి అమ్ముత.. కానీ, పైసలు తక్కువ వస్తయ్'అన్నాడు. 'మన ఊళ్లె ఎకరా 80 లక్షలు పలుకుతుంది. నీ జాగాకు కిరికిరి ఉన్నది 20 లక్షలకు ఎక్వరావు'అన్నాడు. 'పటేలా అన్యాయమైతది. సగం వచ్చినా సరే జెర సూడు'అంటూ చేతులు జోడించింది యాదమ్మ. 'అది కూడా అమ్ముడు పోవుడు కష్టమే, నేనే మీ బాధ సూడలేక కొంటున్న'అన్నడు. 'సర్కారు ఆఫీసుల లాక్ ( ధరణిలో పీవోబీ) పడ్డది. దానికి మళ్లా హైదరాబాద్ దాకా పోవాలె.. పెద్ద పరేషానే ఉంటది.. ఇగో గీ కాగితాల మీద సంతకం పెట్టు'అంటూ సేల్ డీడ్ మీద సంతకాలు తీసుకున్నడు పటేల్. మూడు లక్షలు దావఖాన్ల కట్టిన. రెండు లక్షలు షావుకారికి ఇచ్చిన. 15 లక్షలుంటయ్.. అమ్ముడు పోంగనే ఇస్తా.. నీ దగ్గర వడ్డీ వసూల్ చెయ్య టెన్షన్ పడకు అంటూ వెళ్లిపోయిండు పటేల్..!
*
అన్నదమ్ములు పంచుకోంగ మైసయ్యకు 60 గజాల ఇల్లు వచ్చింది. పెంకుటిళ్లు. వానొస్తే ఉరుస్తుంది. ముంగటి పోర్షన్ మొత్తం దెబ్బతిన్నది. పెంకలు తీసేసి రేకులు వేసుకోండ్రి అని చెప్పిండు మేస్త్రీ. పటేల్ దగ్గర యాభై వేలు తెచ్చి ఇల్లు రిపేరు చేయించిండ్రు. ఏ అవసరం పడ్డా పటేల్ దగ్గరికిపోవడం పైసల్ తేవడం ఖర్చుచేసుకోవడం. మైసయ్యకు వృద్ధాప్య పింఛను కింద రూ. 2016, యాదమ్మకు పైలేరియా పింఛను 3,016 వస్తుంది. తిండి ఖర్చులు వెళ్లిపోతున్నయ్. పండుగొచ్చినా పబ్బమొచ్చినా, దవాఖానకు వెళ్లినా పటేల్ దగ్గర ఉన్న పైసలు తెచ్చుకొని తినాల్సిందే.
ఓ రోజు ఉదయమే పటేల్ వచ్చిండు. 'మైసయ్యా, ఇగో మీ ఒప్పందం ప్రకారం 20 లక్షలు అయిపోయినై లాస్ట్ రూ. 10 వేలున్నయ్. మీకు లెక్క అప్పజెప్పి పోదామని వచ్చిన'అంటూ ఓ చీటీని, పది వేల రూపాయల నగదును యాదమ్మ చేతికి అందించి వెళ్లిపోయిండు. ఇప్పుడు అర్జంటుగా దవాఖాన వెళ్లాల్సి వస్తే ఎట్లా అంటూ రంది పడుతున్నది యాదమ్మ. మంచంలో పడుకొని అన్నీ విన్న మైసయ్య కన్నీరు పెట్టుకుంటున్నడు. చెట్టంత ఎదిగి పక్కనే ఉన్న కొడుకును చూస్తే అసహ్యం వేస్తున్నది. కానీ, ఏమీ చేయలేని స్థితి. తన కొడుకు ఏదైనా పనిచేసుంటే ఇన్ని కష్టాలు వచ్చేవా. మా పింఛన్ మీదనే ఇల్లు నడువవట్టె.. అంటూ మౌనంగా రోదించాడు.
*
కుండపోత వాన కురుస్తున్నది. ఇంట్లోంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి. వాన ఆగగానే బాలేశు బయటికి వెళ్లి రేషన్ బియ్యం తీసుకొచ్చాడు. ఆరోజు అలా గడిచిపోయింది. రాత్రికి వర్షం భారీగా పెరిగింది. మైసయ్య పడుకున్న రూం కురుస్తున్నది. రగ్గు కప్పుకొని మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. అంతలోనే ధడేల్ మనే శబ్దం.. ఇల్లు కూలింది.. ఆ శిథిలాల కింద యాదమ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది. రెప్పపాటులో ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఆ చప్పుడు రేకుల షెడ్ లో పడుకున్న బాలేష్ నిద్రలేచాడు. కేకలు పెట్టాడు.. రోదించాడు.. చుట్టుపక్కల వాళ్ల ఇండ్లకు వెళ్లి తలుపులు బాదాడు అందరూ జమయ్యారు. శిథిలాలను తొలగించారు. ఇద్దరూ విగతజీవులై పడి ఉన్నారు. మరుసటి రోజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. వచ్చిన చుట్టాలు బాలేశును తలా ఓ మాటని వెళ్లిపోయారు.
అప్పటి వరకు తల్లిదండ్రుల పింఛన్ మీద కాలం వెళ్లదీసిన బాలేశు కు అర్థం కాలేదు. ఏం చేయాలో తోచలేదు. అంతలోనే హైదరాబాద్ లో ఉంటున్న ఓ మిత్రుడు ఊరికి వచ్చాడు. విషయం తెలుసుకొని బాలేశును పరామర్శించాడు. జరిగిన అనర్థాన్ని విప్పి చెప్పాడు. కష్టం లేకుండా కాలం గడిపావంటూ చీవాట్లు పెట్టాడు.. తనతో రమ్మని తీసుకెళ్లి సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం పెట్టించాడు. తాను చేయలేనంటూ మొండి కేసినా తిట్టి మరీ కొలువులో కొనసాగించేలా చేశాడు. అక్కడే పనిచేస్తున్న కిషన్ కూతురు భర్త చనిపోవడంతో ఆమె ఇంటి వద్దే ఉంటున్నది. ఆమెకు ఓ కొడుకు.. కిషన్ తన కూతురును బాలేశుకు ఇచ్చి పెండ్లి చేశాడు. ఈ కుటుంబం సఫిల్ గూడాలో నివాసం ఉంటున్నది.
ఎంఎస్ఎన్ చారి
79950 47580