వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జైలుకి వెళ్లిన సందర్భంలో షర్మిల పెద్దదిక్కుగా ఉండి పార్టీని తన భుజస్కంధాలపై మోశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో కాంగ్రెస్ అధికారం చేపట్టటంతో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై హస్తం పార్టీ దృష్టి సారించింది. తెలంగాణ విభజన అనంతరం ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్సాహంతో అక్కడ కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం హస్తం పార్టీ. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌లో కీలక పదవి అప్పజెప్పాలని కాంగ్రెస్ ఆధిష్టానం వ్యూహం.
ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర...!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నం జరిగింది. కానీ.. తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్య నేతలు అడ్డుకోవటంతో.. కేవలం మద్దతుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పోటీగా షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించి ఆమె సేవలను వాడుకోవాలని చూస్తోంది. గతంలో వైసీపీ అధికారంలోకి రావడంలో షర్మిల కీలక పాత్ర పోషించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జైలుకి వెళ్లిన సందర్భంలో షర్మిల వైసీపీకి పెద్దదిక్కుగా ఉండి పార్టీని తన భుజస్కంధాలపై మోసిన విషయం తెలిసిందే. షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా మరలా ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కానీ అప్పటి నేపథ్యం వేరు ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పటి రాజకీయ పరిస్దితులు, చేరికలు ఏ మేరకు కాంగ్రెస్‌కు ఉపయోగపడతాయి అన్నది పెద్ద సవాలే. ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగే అనూహ్య పరిణామాలు కాంగ్రెస్‌ను ఎన్నికల రేసులో ఉంచుతాయేమో గానీ ఏ మేరకు ఆ పార్టీ సీట్లను కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి. వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ప్రజల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్‌గా షర్మిల సేవలను వినియోగించుకునే అవకాశాన్ని సైతం అధిష్టానం ఆలోచిస్తోంది. తర్వాత పరిణామాలను బట్టి అమెను రాజ్యసభకు పంపే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం వుంది.
వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కి..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుంది. వైసీపీ, జనసేన-టీడీపీ కూటమి, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండగలదు. ఐతే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఉనికి చాలా తక్కువ. షర్మిల చేరితే, అప్పుడు వైసీపీలోని కొంత మంది కాంగ్రెస్‌లో చేరే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వైసీపీలోని చాలా మంది నేతలు ఒకప్పుడు కాంగ్రెస్ వారే. వారంతా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేసినవారే. అందువల్ల వారు కాంగ్రెస్‌లో చేరే ఛాన్స్ ఉంటుంది. ఇది వైసీపీకి సమస్య కాగలదు. వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదు. దీనికితోడు జగన్ వైఖరిపై ఇప్పటికే ఆ పార్టీలోని నేతలు బాహాటంగానే వ్యతిరేకిస్తున్న సందర్భాలు ఉన్నాయి. వీరంతా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి వీరంతా హస్తం గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశాలు లేకపోలేదు. అదేగనుక జరిగితే జగన్మోహన్‌రెడ్డికి రాబోయే ఎన్నికల్లో గడ్డుకాలమేనని రాజకీయ వ్యూహకర్తలు చెబుతున్నారు.
శ్రీధర్ వాడవల్లి
- 99898 55445