అణగారిన వర్గాల గొంతుక మహాశ్వేతాదేవి
Author Mahasweta Devi is the voice of the downtrodden
ఇప్పుడు మణిపూర్‌లో జరుగుతున్న గిరిజన జాతుల పోరాటమైనా, ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్‌లో జరిగిన అంతర్గత రిజర్వేషన్ పోరాటమైనా, ఇంద్రవెల్లి, వాకపల్లి.. వంటి ఘటనలైనా పరిష్కారం దొరకని యధార్థ కథలుగా మిగులుతున్నాయి. వాటిని వివరించే రచయితలకు అవి కథావస్తువులుగా మారుతున్నాయి. తప్ప వారి జీవితాలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యం లేదు.
కలలకు స్వాతంత్య్రం రావాలంటూ..
‘అడవిని చూడండి అక్కడ పారే సెలయేళ్లు, మెరిసే ఎండ, చెంగు చెంగున గంతేసే కృష్ణ జింకలను చూడండి ఆ దృశ్యాలు ఇంపుగా ఉంటాయి. అలాగే రైతులు పొలాలు దున్నుతున్నప్పుడు అడవులే కాదు, కొండలు, గుట్టలు కూడా పచ్చదనంతో నవనవ లాడుతున్నప్పుడు అక్కడ ఏమీ జరగదు! ఏమీ కాదు ! అలాగే నువ్వు కలగననంతవరకు, కలగనడం ఎలాగో నీకు తెలియనంత వరకు అక్కడ ఏమి జరగదు. అయితే రాజకీయ, పరిపాలన వ్యవస్థలు రిమోట్ కంట్రోల్‌తో నీతో కలలు కనిపించే నీ మెదడు జీవకణాల్ని నాశనం చేస్తూనే ఉంటాయి. అయితే కొన్ని కలలు తప్పించుకుని బయట పడతాయి. అట్లా తప్పించుకుని బయటపడ్డ కలల వెంట నేనెప్పుడూ పరుగెడుతుంటాను. ఈ మానవాళి సజీవంగా కొనసాగాలంటే కలలు గనే హక్కు తప్పకుండా ఉండాలి. కానీ పరిపాలన వ్యవస్థ కలలుగనే హక్కునే కూలగొడుతుంటే ఏమవుతుంది? వ్యక్తులు కూలిపోతారు. మొత్తంగా ప్రపంచమే కూలిపోతుంది. కలలు కనడమన్నది మనందరి సహజ హక్కు. దీన్ని మనం కాపాడుకోవాలి అని ఎల్లవేళలా చెప్తుండేవారు సాహితీవేత్త మహాశ్వేతాదేవి.
ఆమె 1980 నుండి సామాజిక పోరాటాన్ని ఉధృతం చేశారు. ''ఆదివాసులు, గిరిజనులు, భూముల్లేని గ్రామీణ పేద ప్రజలు, కూలీలు, నగరాల్లో పుట్ పాత్ జీవులు ఇట్లా వారి పక్షాన సమస్యలపై నా దినచర్యగా ప్రతిస్పందించాను. భారతదేశంలో స్వాతంత్రం ఎన్ని తప్పిదాలతో, ఎన్ని తప్పు నడకలతో ముందుకు వచ్చిందో విప్పి చెప్పగలిగాను. దేశంలో ప్రతి భాషలో పుస్తకాలు రాయబడాలి.. ముద్రించబడాలి. అణగారిన ప్రజల జీవిత కథలు ప్రవహించాలి ప్రతి ఒక్కరి చేతి వేళ్ళు అక్షరాల కోసం అంగలార్చాలి. మూగబోయిన గొంతు విప్పాలి. గతంలో నైనా, ఇప్పుడైనా, భవిష్వత్తులోనైనా మనమంతా కలలు గనేది మానవీయ విలువల కోసమే అంటూ 2006 అక్టోబర్ 21న మహాశ్వేతాదేవి జర్మనీ ఫ్రాంక్ ఫర్డ్ బుక్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతిమంగా ‘కలలకు స్వాతంత్ర్యం కావాలి. తమ లాంటి రచయితల కలాలకు స్వేచ్ఛ కావాలి’ అని నిరంతరం తన ప్రసంగంలో చెప్తుండేవారు.
గిరిజనుల విషాదాన్ని వివరిస్తూ..
ఆమె 90 శాతం గిరిజనులు జీవిత సంక్షోభాన్ని ఆవిష్కరించేవే. 1979లో సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ఆమె రచన ‘అరణ్యేర్ అధికార్ ’(ఎవరిదీ అడవి?) 19వ శతాబ్దంలో బ్రిటీష్ పాలనపై జరిగిన ఆదివాసీ ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన గిరిజన నేత బిర్సాముండా జీవితానికి, పోరాటానికి రమణీయంగా ఉంటుంది. ఈ పుస్తకం చోటా నాగపూర్- రాంచీ ప్రాంతంలో గిరిజనోద్యమం ఆధారంగా రాసిన నవల. ఈ నవలను ఆమె అందరిలా కాకుండా సంఘటన స్థలానికి వెళ్లి, ఆ మట్టితో మాట్లాడి, ఆ గాలిలో తిరిగి రాసింది. అందుకే భారతీయ గిరిజనోద్యమాల ఆత్మ ఘోష మొత్తం ఈ నవల ద్వారా అవగతమవుతుంది.
ఈమె ఒక్కొక్క కథ గిరిజన జీవితంలోని ఒక విషాద పరిణామాన్ని వివరిస్తుంది. ‘శనిచరి’ కథలో వ్యభిచార కూపంలోకి బలవంతంగా కూరుకుపోతున్న వంగ ప్రాంత అటవీ బాలిక విషాద కథ. పనిపేరుతో బాలికలను తీసుకెళ్లి వ్యభిచారం చేయించే దళారుల నుంచి తప్పించుకొని శనిచరి మాత్రం పుట్టిన బిడ్డతో సహా తిరిగి గ్రామంలోకి వచ్చి చేసిన తప్పుకి అపరాధం చెల్లిస్తుంది. అయినా గిరిజన సమాజం ఆదరించదు. రైలు పట్టాల మీద బొగ్గు ముక్కలను ఏరుకుంటూ బతుకీడుస్తున్న దైన్యం. ఆ బొగ్గు ముక్కలే నిప్పు రవ్వల్లాంటి ప్రశ్నలను సంధిస్తాయి. ఇక ‘జీవిత ఖైదీ’ కథలో ‘మకర సవర’ వర్తమాన చరిత్రలోని ఒక ఘోరంతో అల్లకల్లోలమైన గిరిజన జీవితం కనిపిస్తుంది. ఇది సవర తెగలో పుట్టిన 'మకర' అనే గిరిజనుడి వైవాహిక సంఘర్షణ.
పెళ్ళయిన చాలా కాలానికి కూడా అతని భార్యకు గర్భం కాకపోవడంతో ఆమే స్వయంగా విడాకులు కోరుకుంటుంది. నిస్సంతువుగా ఉండటం ఆ తెగలో నిషిద్ధం. గ్రామ పెద్దలకు హఠాత్తుగా తెలుస్తుంది అసలు సంగతి. అతనికి పిల్లలు పుట్టకుండా, రహస్యంగా శస్త్రచికిత్స చేశారని! గిరిజన సాంప్రదాయాన్ని 1975 నాటి అత్యవసర పరిస్థితులలో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ఎలా సంక్షుభితం చేశాయో వర్ణించే కథ ఇది.
అలాగే ఆమె 1997లో విశాఖపట్నం వచ్చి అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా ఆయన శతజయంతి సందర్భంలో నవల రాస్తానని చెప్పారు. అలాగే విజయనగరం జిల్లాలో ‘మూల వలస’ సందర్శించి మన్యం వీరుని నవల రాస్తానన్నారు. అలాగే తెలంగాణ ఆదివాసీ గిరిజన పోరాటాలపై విస్తృత సమాచారం సేకరించారు. నైజాం రజాకార్లపై తిరగబడ్డ ఘనచరిత్ర గల కుమ్రం భీం వంటి ఆదివాసీ పోరాట యోధుని గురించి ఆమె ఆరా తీశారు. ఆమె అనుకున్నట్టు ‘అల్లూరి’ నవలా ప్రయత్నం నెరవేరితే తెలుగు ప్రాంతాల గిరిజనోద్యమానికి ఇంకా వెలుగు ప్రసరించేది. ఇలా అణగారిన వర్గాల గొంతుకగా తన కథా రచనలతో కేంద్ర సాహిత్య అకాడమీ(1979), జ్ఞానపీఠ్ (1996) రామన్ మెగసెసె (1997), పద్మభూషణ్ (2006) పురస్కారాలు అందుకున్న బెంగాలీ రచయిత్రి మహాశ్వేత హఠాత్తుగా 2016 జూలై 28న కన్నుమూయడంతో అడవి ఒక్కసారిగా నిర్ఘాంత పోయినట్లయింది. అడవి సంరక్షణ, ఆదిమ జాతుల వారు రక్షితులుగా రాజ్యాంగ ఫలాలు అందిపుచ్చుకునేలా నేటి పాలకులు కొంతైనా చేయగలిగితే అదే మహాశ్వేతకు నిజమైన నివాళి!
( నేడు మహాశ్వేతాదేవి ఏడవ వర్ధంతి )
గుమ్మడి లక్ష్మీనారాయణ ,
ఆదివాసీ రచయితల వేదిక,
94913 18409