న్యాయం అడుగుతున్నరు సరే.. అవినీతిని ప్రశ్నించరా?
నేను నిజాయితీగా చదివి పరీక్ష రాసి మంచి స్కోరు తెచ్చుకొని ఇష్టమైన టీచర్ ఉద్యోగంలో చేరాను. పెళ్లి చేసుకొని నిజాయితీగా బతికేస్తున్నాను.

నేను నిజాయితీగా చదివి పరీక్ష రాసి మంచి స్కోరు తెచ్చుకొని ఇష్టమైన టీచర్ ఉద్యోగంలో చేరాను. పెళ్లి చేసుకొని నిజాయితీగా బతికేస్తున్నాను. ఎవరి ఉద్యోగం నేను లాక్కోలేదు. ఎవరికీ అన్యాయం చేయలేదు. కానీ మా పరిస్థితి ఇలా రోడ్డున పడింది అంటూ పశ్చిమ బెంగాల్ టీచర్లు రోదిస్తున్నారు. ఆ రాష్ట్రంలో 25 వేల మంది ఉపాధ్యాయులు దిక్కు తోచక రోడ్డున పడ్డారు. హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు డాక్యుమెంట్లు కావాలి. వారికి హృదయంతో మనసుతో పని లేదు. రుజువులు మాయం చేసింది అధికారులైతే శిక్ష పడింది 25 వేల మంది టీచర్లకు. ఇప్పుడు సిస్టంని తనిఖీ చేసే మెటల్ డిటెక్టర్ అవసరం ఉంది. అది ప్రజలే కావాలి. ప్రశ్నించాలి, జవాబు చెప్పే వరకు నిలదీయాలి.
న్యాయంగా ఉద్యోగం సంపాదించడం అంటే ఈ వ్యవస్థలో ఎంత కష్టమైనదో ఉద్యోగ పరీక్షలు రాసే ప్రతి వ్యక్తికీ అర్థం అవుతుంది. పశ్చిమబెంగాల్‌లో అలాంటి అన్ని పరీక్షలు దాటి ఉద్యోగం సంపాదించి ఇంత కాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ వచ్చారు 25 వేల మంది ఉపాధ్యాయులు. కానీ ఈ నియామకాలపై న్యాయ విచారణ జరిగిన క్రమంలో అధికారులు సరైన డాక్యుమెంట్లను కోర్టుకు అందించలేదు. దీంతో తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. అందరి జీవితాలు రోడ్డు మీదకు వచ్చాయి. దీనికి కారణం ఎవరు?
ఓఎంఆర్ షీట్లను తగులబెట్టి…
పరీక్ష నిర్వహించిన స్కూల్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ఉంది. వాటి డాక్యుమెంట్లు ఉంటాయి. దాని ద్వారా ఎవరు జెన్యూన్‌గా పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించారు అన్నది చెప్పవచ్చు. కానీ ఇది అంత సులభమైతే ఇంత హంగామా అయ్యేది కాదు. ఇంత మంది జీవితాలు రోడ్డున పడేవి కావు. కానీ ఉద్యోగాలు ఇచ్చే సమయంలో పరీక్షలు న్యాయంగా ఇచ్చిన వాళ్ళతో పాటు పరీక్షలు రాయని వ్యక్తులు, పరీక్ష రాసి ఉత్తీర్ణులు కానీ వ్యక్తులకు కూడా లంచం తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది బయట పడకుండా ఉండాలని, ఎవరు న్యాయంగా పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించారో, ఎవరు లంచం ఇచ్చి సంపాదించారో తేల్చే అవకాశం లేకుండా ఉండాలని మొత్తం ఓఎంఆర్ షీట్లు తగులబెట్టారు. ఇలా మొత్తం పేనల్‌ని అ భద్రతలో ముంచేసారు. ఇలాంటి విషమ పరిస్థితిలో మొత్తం టీచర్లు ఇరుక్కున్నారు. ఈరోజు కూడా ఈ టీచర్లు మాకు అన్యాయం జరిగిందని, మాకు న్యాయం జరగాలని మాత్రమే ధర్నా చేస్తున్నారు. కానీ ఇలా ఎందుకు అవినీతి చేస్తారు అని కచ్చితంగా ప్రశ్నించడం లేదు.
టీచర్లకు సరైన న్యాయం జరగాలంటే…!
ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో మెడికోపై అత్యాచారం జరిగిన ప్రదేశం మొత్తాన్ని ధ్వంసం చేసి ఎలా అయితే రుజువులు చెరిపేశారో, టీచర్ల నియామకంలో జరిగిన అవినీతిని కూడా అలాగే తుడిచేశారు. ఇప్పుడు మేము నిజాయితీగా పరీక్ష రాశామనీ, మాకు న్యాయం జరగాలనీ కోరుకుంటున్న టీచర్లు ఇప్పటికీ సరైన మార్గంలో తమ ప్రశ్న అడగటం లేదు. తమ ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. అడగాల్సిన ప్రశ్న అసలు మీరు అయోగ్యులకు లంచం తీసుకొని ఎందుకు ఉద్యోగాలు ఇచ్చారు? లంచం ఎవరు తీసుకున్నారు? దీనిలో అవినీతికి పాల్పడిన వాళ్లందరినీ చట్టం చేతిలో పెట్టాలని కదా ఒత్తిడి కలిగించాలి. ఓఎంఆర్ షీట్లు ఎందుకు తగులబెట్టారు.. ఎవరు తగులబెట్టారు అని కదా నిలదీయాలి. ఇక్కడ టీచర్లు యోగ్యత ఉన్నవాళ్లు, లేని వాళ్ళు అన్న చోట ఆగిపోయారు. వీళ్ళకు సరైన న్యాయం దొరకాలంటే సరైన నాయకుడు కావాలి. సరైన ప్రశ్న సంధించాలి. మనం ఏది జరిగినా ప్రశ్నించక పోవటమే కదా కారణం.
ఆరోగ్యకరమైన భవిష్యత్ అందివ్వాలంటే..
అవకతవకలు చేసే, అవినీతి చేసే నాయకులను శిక్షించగలిగితే ఇలాంటి పరిస్థితి మనకి రాదు కదా. మనం జీ హుజుర్ అన్నంత కాలం మనకి ఈ తిప్పలు తప్పవు. సిస్టం చేసే అవినీతికి టీచర్లు, ఆర్‌జీ కర్ డాక్టర్లు, విద్యార్థులు అందరూ బలి కావాల్సిందే. ఇప్పుడు సిస్టంని తనిఖీ చేసే మెటల్ డిటెక్టర్ అవసరం ఉంది. అది ప్రజలే కావాలి. ప్రశ్నించాలి, జవాబు చెప్పే వరకు నిలదీయాలి. 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఎవరినీ, ఏ పార్టీ నీ పదవిలో ఉండనీయకూడదు. ప్రజలకు రాజకీయ నాయకులు భయపడాలి. రాజకీయ నాయకులకు ప్రజలు భయపడకూడదు. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. ఆరోగ్య కరమైన భవిష్యత్తు రేపటి తరాలకు అందివ్వాలంటే ఇప్పుడు మనం పోరాడాల్సిందే.
- సర్వమంగళ
89616 26848