స్నేహ బంధం.. మరచిపోని అనుబంధం..
Article on International Day of Friendship
ప్రతి విద్యార్థి భవిష్యత్తు తాను చదివిన చదువుపై కంటే విద్యార్థి స్నేహం పైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. 100 పుస్తకాల కన్నా ఒక మంచి స్నేహితుడు మిన్న అనే నానుడి ఎప్పటికీ నిజమే. ఒక మంచి స్నేహితుడితో స్నేహం చేస్తే మంచి ఆలోచనలు మరియు మంచి నడవడిక, మంచి ప్రవర్తన యొక్క మార్గాన్ని అనుసరిస్తారు ఇది ముమ్మాటికీ నిజం. ప్రపంచంలో కులం, మతం, వయోపరిమితి, ప్రాంతీయ భేదం లేనిది ఏదైనా ఉందంటే అది స్నేహం మాత్రమే అని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో ధనికులను, పేదలను కలిపేది స్నేహం మాత్రమే. కులాలు, మతాలను కలిపేది స్నేహం ఒక్కటే. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు.
ఎల్లలు లేని స్నేహం
స్నేహితులతో కలిసి ఉన్న ఆనందం వర్ణనాతీతం. అందుకే మంచి స్నేహాన్ని మించిన ఆస్తి లేదంటారు. మనిషికి ఎంత డబ్బున్న బాధలో ఉన్నప్పుడు సంతృప్తిని ఇవ్వలేవు, అదే ఒక మంచి స్నేహితుడు ఉంటే నీ బాధలన్నీ మరిపించి బాల్యాన్ని గుర్తు చేస్తూ బాధను మరిపించే ప్రయత్నం చేస్తాడు. ఇంతటి గొప్ప స్నేహంపై ఎందరో కవులు వందలాది పాటలు ఎన్నో భాషల్లో రాశారు. ఆ పాటలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోగలిగితే, ఎవరూ స్నేహాన్ని విడిచిపెట్టరు, ప్రాణ స్నేహితులను మరచిపోరు. ప్రజలు, దేశాలు, సంస్కృతులు, వ్యక్తుల మధ్య స్నేహం శాంతి ప్రయత్నాలను ప్రేరేపించగలదని, అలాగే సమాజాల మధ్య వంతెనలను నిర్మించగలదనే ఆలోచనతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2011న అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ప్రకటించింది.
మన జీవితంలో లక్షల, కోట్ల కన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహాన్ని జీవితాంతం కొనసాగించటం ఎంతో అవసరం. స్నేహానికి ఎల్లలు, కులం, మతాలుండవు. ఎటువంటి సమస్యనైనా స్నేహితుడితో పొరపొచ్చాలు లేకుండా చర్చించుకునే అవకాశం ఒక స్నేహితుడి దగ్గర ఉంటుంది. స్నేహంలో ఎక్కువ తక్కువలుండవు. మనం బాల్యంలో చేసిన అల్లరి అప్పుడప్పుడు గుర్తుచేసే మంచి హాస్యనటుడు కూడా స్నేహితుడే.
కోట్లు పెట్టినా కొనలేని ఆనందం
అప్పుడప్పుడు నేను స్కూల్లో స్నేహితులతో గడిపిన సంఘటనలన్నీ గుర్తుచేసుకొని నాకు నేను ఆనందిస్తాను అది తీపి జ్ఞాపకం. ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత స్నేహితుడు కనిపించిన క్షణం అపురూపంగా, ఆప్యాయతంగా పలకరిస్తే గతంలో మన బాల్యాన్ని గుర్తు చేస్తుంది. తెలిసీ తెలియక క్లాసురూంలో చేసిన అల్లరి గుర్తుచేసుకుంటూ నవ్వుకునే సందర్భం ఎంత హాయినిస్తుందో.
ఆ రోజుల్లో స్నేహితులతో ఆడుకున్న ఆటలు నేటికీ మదిలో పదిలం. ఆదివారం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఆడుకునేవారం. ఖాళీ అగ్గిపెట్టలతో పత్తాలాట, ఖాళీ సారా ప్యాకెట్లతో బంతాట, గోళీలాట, జిల్లగోన, చింతగింజలతో దాడి ఆట, కోకో , కబడ్డీ , తొక్కుడుబిళ్ల , పిక్కలాట , వొంగుడు దూకుడు, ముక్కు గీసుడు, దాగుడుమూతలు, దొంగ పోలీస్, దూకుడు పుల్ల, ఉప్పు బేర, తాడాట, తుడువు, పైసల్ కమ్ముడు, పైసలాట, నీడలు తొక్కుడు, కూరంట బువ్వంట ఇవన్నీ మధుర జ్ఞాపకాలు. వేసవి కాలం ఈత సరదా. పండ్ల కోసం స్నేహితులతో కంచెలెమ్మటి తిరిగేది గొప్ప అనుభూతి. అద్దె సైకిల్ తొక్కి ఊళ్ళో బుల్లెట్ బండి మీద తిరిగినంత ఆనందం ఉండే. కానీ ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో వారు టీవీలు, మొబైల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు తప్ప స్నేహితులతో గడిపే వారు లేరు. కోట్లు పెట్టిన కొనలేని ఆనందాన్ని ఉచితంగా పొందే అవకాశం ఒక స్నేహానికి ఉంది. దొరకని చోట స్నేహాన్ని వెతికే కన్నా దొరికిన చోట స్నేహాన్ని వదలకు మిత్రమా.. ప్రాణం ఉన్నంతవరకు మంచి స్నేహాన్ని మరువకు నేస్తమా!!
(నేడు అంతర్జాతీయ స్నేహ దినోత్సవం)
కోట దామోదర్
9391480475