ఫార్మసిస్ట్‌లతోనే.. రోగి భద్రత సాధ్యం!

Article on 62nd national pharmacy week

Update: 2023-11-23 00:00 GMT

చికిత్సా బృందంలో మెడికల్ ప్రాక్టిషనర్‌లకు యోగ్యులైన సహచరులు ఫార్మసిస్ట్‌లు. వారు అవసరమైన ఔషధాలు సమకూర్చి, ఔషధాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందిస్తారు. ముడి ద్రవ్యాలు మొదలుకొని వితరణ వరకు ఉత్పత్తి దశలు, నిలువ విధానం, ఔషధాల నాణ్యత, పనితనం, మోతాదు ప్రమాణం, పార్శ్వ ప్రభావాలు, పరస్పర చర్యలు వంటి అనేక విషయాలలో వారు విజ్ఞానం కలిగి ఉంటరు. ఔషధ చికిత్సలో తప్పులు దొర్లితే దుష్పరిణామాలు వాటిల్లి, రోగికి హాని జరుగవచ్చు.. రోగి భద్రతే చికిత్సా బృందానికి ప్రథమ ప్రాధాన్యత!

రోగులకు ఎంతో నష్టం ..

50 శాతం రోగులు మందులను ప్రిస్క్రిప్షన్‌లో రాసినట్లు వాడుకోరు. 60 శాతం మంది చెప్పిన సూచనలను తప్పుగా అర్థం చేసికొంటున్నరు. వైద్యశాలలలో 50 శాతం ఔషధ చికిత్స తప్పిదాలు, రోగులు తాము ఇంతకు ముందు వాడుతున్న మందుల వివరాలు తెలపనందున జరుగుతున్నయి. ప్రిస్క్రిప్షన్‌ను సమీక్ష చేయటం ద్వారా 66 శాతం చికిత్సాపరమైన దోషాలు తగ్గినట్లు ఎన్నో నివేదికలు బహిర్గతం చేశాయి. ఇదంతా ఫార్మసిస్ట్ పరిధిలోని వ్యవహారం. రోగి భద్రత దృష్ట్యా అంతర్జాతీయంగా ఫార్మస్యూటికల్ కేర్‌కు ప్రాధాన్యత పెరిగింది. మన దేశంలో ఆరోగ్యరంగ వ్యవస్థలు ఫార్మసిస్ట్‌ల విస్తృత పరిజ్ఞానాన్ని వినియోగించుకోకుండా, ఔషధాలు సమకూర్చే వరకు పరిమితం చేస్తున్నయి. విషాదం ఏమిటంటే, అది కూడా చాలా వరకు అనర్హుల చేతిలో జరుగుతున్నది. అందువల్ల రోగులకు జరుగుతున్న నష్టం అపారం. అందుకే దేశంలోని ఫార్మసిస్ట్‌లందరికీ మార్గదర్శనం చేస్తున్న సంస్థ ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ (ఐపిఎ). దీని 62వ జాతీయ ఫార్మసీ సప్తాహం సందర్భంగా ‘జాయిన్ ఫార్మసిస్ట్స్ టు ఎన్స్యూర్ పేషంట్ సేఫ్టీ’ అనే నినాదాన్ని ఎంపిక చేసింది.

భారత ప్రభుత్వం 1940లో డ్రగ్స్ చట్టం, 1948లో ఫార్మసీ చట్టం తెచ్చింది. వీటి ప్రకారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడినయి. దేశంలో ఫార్మసిస్ట్‌ల సంఖ్య చాలినంత లేనందువల్ల వృత్తి చాలా వరకు అన్యాక్రాంతం అయింది. దీనికి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) ఫార్మసిస్ట్‌ల సంఖ్య పెంచటమే పరిష్కారమని భావించింది. ఆ దిశగా కృషి చేసి సఫలీకృతం అయింది. ఫార్మసీ కళాశాలలు నెలకొల్పటానికి అనుమతులు ఇచ్చి ప్రోత్సహించింది. ఇప్పుడు పరిశ్రమకు కావలసిన బి ఫార్మ్/ ఎం ఫార్మ్ పట్టభద్రులు ఎంతో మంది లభిస్తున్నరు. కమ్యూనిటీ ఫార్మసీ (మెడికల్ షాప్స్) వైపు ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు అంతగా ఆసక్తి కనపరచనందున డి ఫార్మ్‌ను కొనసాగిస్తున్నది. హాస్పిటల్ ఫార్మసీ సేవల ప్రమాణాలు పెంచటానికి ఫార్మ్-డి కోర్స్ ప్రారంభించింది. ప్రభుత్వ అధినేతలు, ఉన్నత అధికారుల అవగాహన రాహిత్యం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అభిజాత్యం వల్ల ప్రజలు ఫార్మసిస్ట్‌ల సేవలను సద్వినియోగం చేసుకోలేని దుస్థితి దాపురించింది.

సంపూర్ణ సురక్ష సాధించాలంటే..

కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాల సవరణ, కొన్నింటి రద్దుకు పూనుకొన్నది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం సవరణ వల్ల మరింత సరళీకరణ జరిగి ఫార్మసీ వృత్తి పలుచబడింది. ఫార్మసీ చట్టం చేసి 75 ఏండ్లు అయినా సరిగా అమలుకు నోచుకోలేదు. తాజాగా దానిని రద్దు చేయటానికి నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్ తెర మీదికి వచ్చింది. ఫార్మసీ విద్యావంతులలో నిరుద్యోగం సమస్యగా మారింది. ఈ దశలో ఐపిఎ, ఆరోగ్యరంగ నిపుణులు, ప్రభుత్వం, పౌర సమాజం పరిష్కార మార్గాలు వెతుక వలసి ఉన్నది. ముఖ్యంగా ఫార్మసిస్ట్‌లు క్రియా శీలకంగా ఉండాలె. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం అన్ని వైద్య కళాశాలలు, వైద్యశాలలలో హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్స్ నెలకొల్పాలె. ఫార్మసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి ఔషధ వ్యవహారాలు అన్ని దాని పరిధిలో చేర్చాలె. ఔషధాలు ఉన్న అన్ని చోట్లా ఫార్మసిస్ట్ లను నియమించాలె. స్వయం ఉపాధి కోరుకొనే వారికి సహకరించాలె. వినియోగదారుల సంఘాలు ఔషధ వితరణ విధిగా ఫార్మసిస్ట్ ద్వారా జరిగేటట్లు దృష్టి సారించాలె. కమ్యూనిటీ ఫార్మసీ యజమానులు అదనపు ఫార్మసిస్ట్‌లను నియమించుకొని క్లయెంట్‌లకు నాణ్యమైన సేవలు అందించాలె. ఫార్మసిస్ట్‌లు స్వయం ఉపాధి మార్గాలు అన్వేషించాలె. స్టార్టప్ పరిశ్రమలు పెట్టాలె. మోడల్ ఫార్మసీలు ప్రారంభించి ప్రజలకు ఔషధాల వినియోగంపై కౌన్సెలింగ్, ఆరోగ్య విద్య, వ్యాధుల గుర్తింపు, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ, వ్యాక్సినేషన్ వంటి సేవలు అందుబాటులోనికి తేవాలె. సోషియల్ ఫార్మసీ వైపు ఫార్మసిస్ట్‌లు ఇంత వరకు రాలేదు. కెరీర్‌గా ఎన్నుకొనతగిన మంచి భవిష్యత్తు ఉన్న రంగం సోషియల్ ఫార్మసీ. ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించే సోషియల్ ఫార్మసిస్ట్‌లు ప్రజల మన్నన పొందగలరు. ఔషధాల ద్వారా సంపూర్ణ స్వస్థత సురక్ష సాధించాలంటే ఫార్మసిస్ట్‌ల భాగస్వామ్యం తప్పనిసరి.

(62వ జాతీయ ఫార్మసీ సప్తాహం సందర్భంగా)

డా. రాపోలు సత్యనారాయణ

ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ సభ్యులు

94401 63211

Tags:    

Similar News