హాట్ టాపిక్: కేటీఆర్ కు థాంక్స్ చెప్పిన ఈటల.. ఏమన్నారంటే..?
దిశ ప్రతినిది, కరీంనగర్: అధికార టీఆర్‌ఎస్ పార్టీపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై విరుచుకుపడ్డారు. హుజురాబాద్ లో గెలిచినంత మాత్రాన ఢిల్లీలో మార్పు రాదని, ఓడిపోతే మా సర్కారు పడిపోదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేసినందుకు ఈటల థాంక్స్ చెప్పారు. కేటీఆర్ ఓటమిని ఒప్పుకున్నారని, వాస్తవాలను తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ఈటల అన్నారు. నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరిని […]
దిశ ప్రతినిది, కరీంనగర్: అధికార టీఆర్‌ఎస్ పార్టీపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై విరుచుకుపడ్డారు. హుజురాబాద్ లో గెలిచినంత మాత్రాన ఢిల్లీలో మార్పు రాదని, ఓడిపోతే మా సర్కారు పడిపోదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేసినందుకు ఈటల థాంక్స్ చెప్పారు. కేటీఆర్ ఓటమిని ఒప్పుకున్నారని, వాస్తవాలను తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ఈటల అన్నారు. నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారని, అలా అయితే ఈ గడ్డ మీద వేరే పార్టీ ఉండొద్దు అని చట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్ కు సవాలు విసిరారు.
గత మూడు నెలలుగా చిల్లర పనులు చేసి అబాసు పాలయ్యారని విమర్శించారు. దళిత బంధు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి తాను అడిగిన తరువాత ఏడేళ్లకు అంబేడ్కర్ చిత్రపటానికి దండ వేశారని, జై భీమ్ అన్నారన్నారు. సీఎంఓలో ఒక్క దళిత ఆఫీసర్ కూడా లేడని అన్నందుకు ఆ లోటును పూడ్చుకున్నారని ఈటల అన్నారు. చివరకు ఇంటలీజెన్స్ చీఫ్ ను కూడా దళిత అధికారిని నియమించారని సంతోషకర పరిణామమని ఈటల వ్యాఖ్యానించారు. నా రాజీనామా తరువాత హుజూరాబాద్ ప్రజలకు చాలా మేలు జరిగిందని, ఇదే విధానం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అమలు చేయాలని రాజేందర్ డిమాండ్ చేశారు.
ఎన్ని చేసినా కేసీఆర్ పై తెలంగాణ ప్రజలకు నమ్మకం మాత్రం లేదని ఈటల స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో జరిపిన సర్వేల్లో ఎన్ని ఇచ్చినా ఓటు మాత్రం ఈటలకే వేస్తామని ప్రజలంటున్నారన్నారని తేలిందన్నారు. తాను గెలుస్తున్నానని సర్వే రిపోర్టులు తేల్చడంతో హుజురాబాద్ లో ఓడిపోతున్నామనే మంత్రి కేటీఆర్ అలా మాట్లాడారన్నారు. సొంత స్థలాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకొనే అవకాశం ఇవ్వాలని, దళిత బంధుతో పాటు అన్ని కులాలలో ఉన్న పేదలకు పేద బంధు పథకం రాష్ట్రం వ్యాప్తంగా అమలు చేయాలన్నారు. చింతమడకలో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చినట్టుగా తెలంగాణ అంతా ఇవ్వాలని, సీఎం ఆఫీసు లో బీసీ, ఎస్టీ అధికారిని కూడా నియమించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో జరుగుతున్న తీరును చూసి దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారన్నారు.
పచ్చటి పల్లెల్లో చిచ్చు పెట్టే నికృష్ట చర్యలను తక్షణం ఆపాలని ఆయన కోరారు. నా బొమ్మ పెడితే చాలు గెలుస్తా అన్న ధీమా నుండి మండల స్థాయికి వస్తా అని ప్రకటించుకునే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. సిద్దిపేట మంత్రి ఇక్కడే అడ్డాపెట్టి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 20 ఏళ్లుగా ఇక్కడి నాయకులను కడుపులో పెట్టి చూసుకున్నానని, వారు తిరిగి ఆ పార్టీలో చేరినా నమ్మకం లేక సిద్దిపేట నుండి నాయకులను దింపి వారితోనే ప్రచారం చేయించుకుంటున్నారన్నారు. ఇలాంటి నీచపు బ్రతుకు బ్రతకాల్సిన అవసరం ఉందా అన్న విషయంపై నన్ను వదిలేసి వెళ్ళిన నాయకులు ఆలోచించుకోవాలని ఈటల హితవు పలికారు.
ఎన్నికల తరువాత మీ ముఖం చూసే దిక్కు ఉండదని, సీఎం ప్రతిష్టే దిగజారిన తరువాత తలకాయ కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టినా మీకు భవిష్యత్తు లేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. హుజురాబాద్ లో గెలుపు నాదేనని, భయంతో ఓటు టీఆర్ఎస్ కే వేస్తామని చెప్తున్నా వారి అంతరాత్మలో తానే ఉన్నానన్నారు. నా గెలుపు తరువాత తెలంగాణలో పెను మార్పు వస్తుందని, పేద ప్రజల గొంతుకనవుతానని, దోపిడీ అంతమై, స్వేచ్చ వస్తుందన్నారు. టీఆర్ఎస్ వాళ్ళది దింపుడు కల్లం కాడ ఆశ మాత్రమేనని ఈటల వ్యాఖ్యానించారు.
ఇంటెలిజెన్స్ అధికారి బాపురెడ్డి ఆయన చొక్కా ఆయనే చింపుకొని మా మీద కేసు పెట్టాడని ఆరోపించారు. ప్రైవేట్ లెక్చరర్ లు మీటింగ్ పెట్టుకుంటా అంటే బెదిరించి క్యాన్సిల్ చేయించే నీచ స్థితికి టిఆర్ఎస్ దిగజారిందని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.