'దిశ'తో దుబ్బాక ప్రజలు ఏం చెప్పారు…?

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి జరుగనున్న ఉప ఎన్నికలో ప్రధాన అంశంగా మారింది. గడచిన ఆరేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను అందుకుంటున్న సంతృప్తి ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో మాత్రం నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. ఇదే అధికార పార్టీపై వ్యతిరేకతగా మారింది. సరిగ్గా ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్నే ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని సర్ది పుచ్చడానికి అధికార పార్టీ […]

Update: 2020-10-31 21:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి జరుగనున్న ఉప ఎన్నికలో ప్రధాన అంశంగా మారింది. గడచిన ఆరేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను అందుకుంటున్న సంతృప్తి ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో మాత్రం నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. ఇదే అధికార పార్టీపై వ్యతిరేకతగా మారింది. సరిగ్గా ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్నే ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని సర్ది పుచ్చడానికి అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. దీన్ని అవకాశంగా మల్చుకుని గట్టెక్కడానికి ప్రత్యర్థి పార్టీలు దృష్టి పెట్టాయి. పోలింగ్‌లో ఇది ఏ మేరకు ఓట్ల రూపంలోకి మారుతుంది, ఎలాంటి ప్రభావం చూపుతుందనేదే అన్ని పార్టీలకూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

తెలంగాణ రావడానికి ముందు ముత్యంరెడ్డి హయాంలో ఒక మేరకు అభివృద్ధిని కళ్లారా చూసిన ప్రజలు ఇప్పటికీ నెమరువేసుకుంటున్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ లేదని, కేవలం సంక్షేమ పథకాలతోనే సరిపుచ్చుకుంటోందని టీఆర్ఎస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు ప్రజలు. ఒక్కో సెక్షన్ ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత ఒక్కో స్థాయిలో ఉంది. ప్రత్యర్థి పార్టీలు ఏం చేయగలుగుతాయనే అంశం కంటే అధికార పార్టీపై ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో తెలియజేయాలన్న ఆరాటం ప్రజల్లో కనిపిస్తోంది. ఇంతకూ ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి అంటే ఏమిటి? వారికి ఎందుకు అసంతృప్తి ఉంది? ఆరేళ్లుగా లేని ఆగ్రహం ఇప్పుడే ఎందుకొస్తోంది లాంటి అంశాలను ‘దిశ’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అందులో ప్రజలు వెల్లడించిన అభిప్రాయాల్లో కొన్ని వారి మాటల్లోనే…

*చెరుకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లే తప్ప కొత్త రోడ్డు ఒక్కటి కూడా రాలేదు. గ్రామాల్లో సీసీ రోడ్లు కూడా రాలేదు

*సమస్యలను తెలియజెప్పడానికి ఎమ్మెల్యేను కలిసే మార్గమే లేకుండా పోయింది. ఒకవేళ ఆయనను కలవడానికి వెళ్లినా స్థానిక నేతలు ఆ ప్రయత్నాలకు గండి కొడుతున్నారు. ఎమ్మెల్యేను కలవనీయకుండా చేస్తున్నారు.

*స్థానిక నేతలు వారి అవసరాలను తీర్చుకోడానికి, పనులు చేసుకోడానికి, పైరవీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజల గురించి పట్టించుకోవడంలేదు.

*గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేదాకా సమస్యలు వెళ్లడంలేదు. వెళ్లినా ఆయన నిస్సహాయుడిగానే ఉండిపోయారు. మళ్లీ జిల్లా మంత్రి దగ్గరకు ఆయన తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. మంత్రి నుంచి ముఖ్యమంత్రి దాకా వెళ్లడమే లేదు. చివరికి పరిష్కారం కాకుండా ఉండిపోతున్నాయి. ఆరేళ్లుగా చూస్తూనే ఉన్నాం.

*పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలను వారు బాగా అభివృద్ధి చేసుకున్నారు. కానీ దుబ్బాకను మాత్రం నిర్లక్ష్యం చేశారు. చివరకు సమీపంలో ఉన్న ముస్తాబాద్ గ్రామం (సిరిసిల్ల నియోజకవర్గం)లో జరిగిన అభివృద్ధి కూడా ఇక్కడ లేదు.

*తాసీల్దారు కార్యాలయానికి ఏ పనిమీద వెళ్లినా లంచం ఇవ్వకుండా పనులు జరగడంలేదు. లంచం ఇచ్చుకోలేక, ఈ విషయాన్ని ఎమ్మెల్యేదాకా తీసుకెళ్లలేక పనులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి.

*తెలంగాణ వస్తే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయనుకున్నాం. కనీసం స్వంత కాళ్ళపై నిలబడేలా స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కూడా అందలేదు.

*వృద్ధాప్య, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా లాంటివి ఉన్నాయి. కానీ రైతులు నష్టపోతే పంటల బీమా సౌకర్యం లేదు. కష్టంలో ఉన్న రైతుల్ని ఆదుకోడానికి, పలకరించడానికి, బాధల్ని పంచుకోడానికి పార్టీ నేతలెవ్వరూ అందుబాటులో లేరు.

*డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామనడమేగానీ ఇప్పటికీ వాటికి అతీగతీ లేకుండా పోయింది.

*మల్లన్నసాగర్ రిజర్వాయర్ పేరుతో భూముల్ని లాక్కున్న ప్రభుత్వం సరైన నష్టపరిహారం ఇవ్వలేదు. కొంతమందికి ఎకరానికి మూడున్నర లక్షల రూపాయలు ఇస్తే మరికొందరికి ఆరు లక్షలు, ఇంకోందరికి రూ. 11.5 లక్షల చొప్పున ఇచ్చింది. ఇళ్లు పోయినవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నదిగానీ ఇప్పటికి రెండేళ్లయినా మాటలకే పరిమితమైంది.

*అధికార పార్టీ మంచిదే అయినా, దాని నాయకుడు మంచోడే అయినా స్థానికంగా ఉన్న పార్టీల నేతలు మాత్రం పెత్తనం చేస్తున్నారు. సొంత ఇల్లు కట్టుకున్నా దౌర్జనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News