రాష్ట్రంలో రాజ్యమేలుతున్న డ్రగ్స్.. కేసీఆర్ 'మత్తు’ వదిలించేనా..?

దిశ, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సర్కార్​ మొదటి రెండేళ్లు గుడుంబా, కల్తీ కల్లుపై ఉక్కు పాదం మోపింది. గుడుంబా దాదాపుగా నిర్మూలించగలిగింది. కానీ, ఆ తర్వాత రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోవడంతో చాలా చోట్ల కల్లులో కల్తీ పెరిగి మాదకద్రవ్యాల కంటే ప్రమాదకరంగా మారింది. రాజకీయ జోక్యం, సర్కార్​ నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆబ్కారీ శాఖ కూడా చేతులెత్తేసింది. ఇదే అదనుగా మళ్లీ కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. గుడుంబా తయారీ మళ్లీ మొదలైంది. […]

Update: 2021-10-19 22:23 GMT

దిశ, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సర్కార్​ మొదటి రెండేళ్లు గుడుంబా, కల్తీ కల్లుపై ఉక్కు పాదం మోపింది. గుడుంబా దాదాపుగా నిర్మూలించగలిగింది. కానీ, ఆ తర్వాత రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోవడంతో చాలా చోట్ల కల్లులో కల్తీ పెరిగి మాదకద్రవ్యాల కంటే ప్రమాదకరంగా మారింది. రాజకీయ జోక్యం, సర్కార్​ నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆబ్కారీ శాఖ కూడా చేతులెత్తేసింది. ఇదే అదనుగా మళ్లీ కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. గుడుంబా తయారీ మళ్లీ మొదలైంది. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్​ మాఫియా కార్యకలాపాలు పెరిగాయి. హైదరాబాద్‌లోని కొన్ని క్లబ్​లు, పబ్​లు మాదకద్రవ్యాల వినియోగానికి కేరాఫ్​ అడ్రస్​గా మారాయి. కొందరు అధికార బలం ఉన్న రాజకీయ నాయకులు కూడా పబ్​లు, క్లబ్​లలో పెట్టుబడులు పెట్టడంతో అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. కేసుల విచారణ కూడా తూతూ మంత్రంగా మారింది.

ప్రముఖులైతే విచారణ తీరే వేరు..

రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన సినీ ప్రముఖుల డ్రగ్స్​ కేసులు పేరుకు మాత్రమే.. విచారణ తూతూ మంత్రంగా మారాయి. 2017 జులై 2న ఎక్త్సెజ్​శాఖ డ్రగ్స్​ కేసులో విచారణ రాజకీయ ఒత్తిడిల వల్ల నీరుగారిపోయింది. కేవలం 12 కేసులు నమోదు చేసి 11 ఛార్జీషీట్​లను దాఖలు చేసి, నార్కోటిక్​ డ్రగ్స్​ సైకోట్రోపిక్​ సబ్ స్టాన్సెస్​ (ఎన్​డీపీఎస్​)సీఆర్పీసీ సెక్షన్​ 167, సీఆర్పీసీ సెక్షన్​ 67 కింద కేసులు బుక్​ చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత సర్కార్​ పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో విచారణ అర్ధాంతరంగా ఆగిపోయి బడా నిందితులు తప్పించుకున్నారు. ఎక్స్తెజ్​శాఖ ఎన్​ఫోర్స్​మెంట్​నే మరిచింది. టాలీవుడ్​ డ్రగ్ కేసులో సినీ తారల పాపం ఏమీ లేదని ఎక్స్తెజ్​శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. డ్రగ్స్​ పాపమంతా కింగ్​పిన్​ కెల్విన్ మాస్కరెన్​హస్​ ముఠాదేనని స్పష్టం చేసింది. కెల్విన్​ తప్పుడు సమాచారంతోనే గందరగోళం జరిగిందని రంగారెడ్డి జిల్లా కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్​లో చెప్పకనే చెప్పింది. కెల్విన్​తో పాటు జీషాన్​అలీ, వి.నిఖిత్​శెట్టి, వి. రవికిరణ్ తదితరులను నిందితులుగా పేర్కొన్నది. ఈ క్రమంలో తాజాగా డైరెక్టరేట్​ ఆఫ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ (ఈడీ) మనీ లాండరింగ్​ వ్యవహారంలో విచారణ చేపట్టడం కేసు కొత్త మలుపు తిరిగింది.

కింగ్​పిన్ కెల్విన్​ సమాచారంలో ఏ మాత్రం ప్రాథమిక ఆధారాలు లేకపోతే ఈడీ ఫెమా, మనీలాండరింగ్​ కేసులో గతంలో సిట్​ విచారించిన వారితో పాటు కొత్తగా రకుల్​, రానాలను ఎందుకు విచారించాల్సి వచ్చింది అనే దానికి ఆబ్కారీ సిట్​ బృందం సమాధానం చెప్పాల్సి ఉంటుందని పౌర సంస్థలు డిమాండ్​ చేశాయి. వాస్తవానికి కర్ణాటక శాండిల్ ఉడ్​ కేసులో ఎన్సీబీ లోతుగా దర్యప్తు చేసి నమూనాల ద్వారా రాగిణి, సంజనాలను అరెస్ట్​ చేయడం తెలిసిందే. కానీ, తెలంగాణలో విచారణ జరిగిన నాలుగేండ్లకు కానీ ఆబ్కారీ సిట్​ బృందం ఛార్జీషీట్‌లను దాఖలు చేయలేదు. అది కూడా కోర్టు అక్షింతలు వేసిన తర్వాతనే ముందుకు కదలడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సిట్​ విచారణలో పారదర్శకత లేదనే అనుమానాలకు తావిచ్చింది. తిమింగలాలను వదిలి చిన్నచేపలనే బలి చేసిందన్న ఆరోపణలకు తాజాగా ఆబ్కారీ అధికారులు దాఖలు చేసిన ఛార్జీషీట్​లు మరింత బలమిస్తున్నాయి.

ఇక డ్రగ్స్​, క్లబ్​లు, పబ్‌లపై ఉక్కుపాదం..

రాష్ట్రంలో రోజురోజుకూ పరిస్థితి శృతిమించుతున్న క్రమంలో డ్రగ్స్​, క్లబ్​లు, పబ్ లపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బుధవారం ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి డ్రగ్స్ సరఫరా క్లబ్‌లు, పబ్‌లలో గలీజు దందాలను అరికట్టే విషయంలో పోలీసులు, ఆబ్కారీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గంజాయి స్మగ్లర్​లపై దాడులను ప్రారంభించిన పోలీసులు, ఆబ్కారీ అధికారులకు డ్రగ్స్​పైన దృష్టిని సారించాలని మార్గనిర్ధేశం చేయనున్నారు. మరి ఇకనైనా రాజకీయ ఒత్తిడిలు లేకుండా డ్రగ్స్​ నిర్మూలనకు సర్కార్​ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందా? ఈసారి గురి ఎవరిపైన పెడుతుంది? ఇది నష్ట నివారణ చర్యగానే మిగిలిపోనున్నదా? అనేది వేచిచూడాలి.

Tags:    

Similar News