నో సేఫ్టీ మెజర్స్.. నోట్ల కట్టలే ప్రాణం ఖరీదు!

దిశ, మునుగోడు : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలో ఉన్న డ్రగ్ కంపెనీలు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అమాయక కార్మికులు ప్రాణాలు వదులుతున్నారు. ప్రమాదం జరిగినపుడు హడావుడి చేసి ఆ తర్వాత కొద్దొగొప్పో ఎక్స్ గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సుమారు 75 ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలు నెలకొల్పబడ్డాయి. […]

Update: 2021-02-21 13:32 GMT

దిశ, మునుగోడు : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలో ఉన్న డ్రగ్ కంపెనీలు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అమాయక కార్మికులు ప్రాణాలు వదులుతున్నారు. ప్రమాదం జరిగినపుడు హడావుడి చేసి ఆ తర్వాత కొద్దొగొప్పో ఎక్స్ గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సుమారు 75 ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలు నెలకొల్పబడ్డాయి. ఇవన్నీ ఒక క్లస్టర్ పరిధిలో కాకుండా వేర్వేరు గ్రామాలలో ఏర్పాటు చేశారు. అయితే మొదట కంపెనీ స్థాపన సమయంలో ప్రజాభిప్రాయ సేకరణలో, అధికారులకు తాము పూర్తి భద్రత ప్రమాణాలు పాటిస్తామని యాజమాన్యాలు ప్రమాణం చేసి అనుమతులు పొందుతారు. ఈ ఫార్మా, బల్క్ డ్రగ్స్ కంపెనీలు అనుమతులు పొందాలంటే లెక్కలేనన్ని ఆంక్షలు ఉంటాయి. కానీ, పారిశ్రామిక అభివృద్ధి పునాదులపై రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయానే ఆలోచనతో ప్రభుత్వాలు కూడా కాస్త వెసులుబాటు కల్పించి అనుమతులు మంజూరు చేస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీ యాజమాన్యాల ఆగడాలకు హద్దు లేకుండా వ్యవహరిస్తున్నాయి. ప్రతీ కంపెనీ యాజమాన్యం తమ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్స్‌లను ఇవ్వాలి. ఈ ఎక్విప్‌మెంట్‌లో ఆప్రాన్, కళ్లజోడు, హెల్మెట్, షూస్ మొదలైనవి ఉంటాయి.

కానీ, ఎన్ని కంపెనీలు వీటిని అందిస్తున్నాయి అంటే అది అంతుచిక్కని ప్రశ్నే. కంపెనీలో ఒక ప్రొడక్ట్ తయారీ ముగిసి మరో ప్రోడక్ట్ తయారు చేయడానికి ముందు దానికి అనుగుణంగా రక్షణ చర్యలను సిద్ధం చేయాలి. కానీ ఇక్కడ నెలకొల్పిన ఏ కంపెనీ కూడా ప్రొడక్ట్‌కు అనుగుణంగా భద్రతా ప్రమాణాలను మార్చడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా చేయకపోవడంతో ఉత్పత్తి నుంచి వచ్చే విషవాయువులను పీల్చి కార్మికులు ప్రాణాలు వదిలిన సంఘటనలు కోకొల్లలు. ఒక రసాయనిక ఉత్పత్తి అయిపోగానే సదరు రియాక్టర్‌ను తప్పకుండా శుభ్రపరచాలి. అలా చేయకుండా మరో ఉత్పత్తిని ప్రారంభిస్తే అది కాస్త కలుషితమై విష వాయువులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రియాక్టర్‌ను శుభ్ర పరచడానికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు కావడంతో కంపెనీ యాజమాన్యాలు కక్కుర్తిపడి గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల చెందిన కార్మికులతో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా రియాక్టర్ లను శుభ్రం చేయిస్తున్నారని విమర్శిస్తున్నారు. దీంతో రియాక్టర్‌లోకి దిగిన సమయంలో అందులోని ఘాడ రసాయనాలను పీల్చి శ్వాస ఆడక చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.

మచ్చుకు కొన్ని…

గత సంవత్సరం ఫిబ్రవరి 27న నందగిరి ఊషయ్య అనే వ్యక్తి లింగోజిగూడెంలోని నైల్ కంపెనీలో ఇటుకల మీద పడి చనిపోగా, మాన్ సింగ్ అనే వ్యక్తి ఖైతాపురం పరిధిలోని ఇండియన్ హ్యూమ్ కంపెనీ లో వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా చనిపోయాడు. అలాగే ఏడుకొండలు అనే వ్యక్తి కోయ్యలగూడెం పరిధిలోని వై.ఎం. డ్రగ్స్‌లో గతేడాది సెప్టెంబర్‌లో కెమికల్ మీద పడి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇవన్నీ కూడా అధికారికంగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన వాటిలో కొన్ని మాత్రమే. ఇంకా చాలా మంది పరిశ్రమలలో ప్రమాదానికి గురై మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. పరిశ్రమల యజమానులు బయటకు పొక్కకుండా మృతుల కుటుంబాలకు ఎంతో కొంత చెల్లించి మేనేజ్ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి.ఇటీవల లింగోజిగూడెం పరిధిలోని ఒక కంపెనీలో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి అస్వస్థతకు గురవ్వగా అతన్ని చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించడంతో శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మృతి చెందిన వ్యక్తి స్థానికేతరుడు కావడంతో కంపెనీ యాజమాన్యం లైట్ తీసుకుంది. కానీ స్థానికంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకొని మృతదేహంతో కంపెనీ ముందు ధర్నాకు దిగడంతో ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇన్ని ఉదంతాలు జరిగినా ఏ ఒక్క కంపెనీలో కూడా భద్రత ప్రమాణాలు పాటించడంలో మార్పు రావడం లేదు. సంబంధిత శాఖ అధికారుల పాత్రపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికేతరులకే ఉద్యోగాలు..

ఏదైనా ప్రమాదం జరిగితే బయటకు పొక్కకుండా ఉండాలి అంటే స్థానికేతరులకు అవకాశం కల్పించాలనే ఆలోచనలో కంపెనీ యాజమాన్యాలు ఉన్నట్లు సమాచారం. అందుకే ఇక్కడ పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశ్రమలలో ఏదైనా ప్రమాదం జరిగితే మరణించిన వ్యక్తి స్థానికుడు అయితే వారంతా కంపెనీల ముందు ధర్నాలకు దిగి ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ఆందోళనతోనే అవకాశాలు ఇవ్వడం లేదని తెలుస్తుంది. దేశంలోనే పేరొందిన ఫార్మా కంపెనీ చౌటుప్పల్‌లో నెలకొల్పబడి ఎన్నో ఏండ్లు అవుతున్నా ఇప్పటి వరకు స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడం లేదు. అర్హులైన స్థానికులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇతర ప్రాంతంలోని తమ సంస్థకు వెళ్లవలసిందిగా సూచిస్తున్నారు.

మొక్కుబడిగా పర్యవేక్షణ

ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పర్యవేక్షక బృందాలు ఎందుకు ఉదాసీనతను ప్రదర్శించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే పరిశ్రమల తనిఖీ అధికారులు తర్వాత అటువైపు కూడా ఎందుకు చూడటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకునే అధికారాలు ఉన్నా వారు ఎందుకుమౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు.

ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం..

గతంలో మా తండ్రి ఓ ఫార్మా కంపెనీలో కార్మికునిగా విధులు నిర్వహించేవాడు. ఆ కంపెనీలో వెలువడిన విష వాయువు పీల్చి అనారోగ్యానికి గురై మరణించాడు. దీంతో తాము ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం. కంపెనీలో కనీస భద్రత ప్రమాణాలు పాటిస్తే తన తండ్రి మరణించే వాడు కాదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి వాటిపై చర్యలు తీసుకోకపోవడంతో మరణాలు పునరావృతం అవుతున్నాయి.

-పన్నాల రవీందర్ రెడ్డి, ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుమారుడు

మా దృష్టికి తేవాలి

కనీస భద్రత ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రమాదానికి కారణమైన కంపెనీల సమాచారం మా దృష్టికి తీసుకురావాలి. అలాంటి కంపెనీలపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

-నితిన్ కుమార్, కర్మాగారాల తనిఖీ అధికారి, నల్లగొండ


Similar News