యుగాంతానికి 100 సెకన్లు.. ‘డూమ్స్ డే క్లాక్’లో టైం సెట్

దిశ, ఫీచర్స్: 2020లో కొవిడ్ మహమ్మారి ప్రపంచదేశాలను భయభ్రాంతులకు గురిచేయగా, ప్రపంచ వినాశానికి ఇది హెచ్చరికని, త్వరలోనే ప్రపంచం అంతం కాబోతుందని ఎంతోమంది వ్యాఖ్యనించారు. డూమ్స్‌డే ప్రవచనాలు, మయాన్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్ 21, 2020 నాటికి ప్రపంచం అంతమైపోతుందని కొంతమంది సిద్దాంతకర్తలు తేల్చి చెప్పడంతో ప్రజలంతా భయపడిపోయారు. కానీ అది జరగలేదు 2012లోనూ ‘యుగాంతం’ ఊహాగానాలు రాగా అప్పుడు కూడా అది అబద్ధమని తేలింది. ప్రళయం వస్తుంది, ప్రపంచం అంతరిస్తుంది, ఇక వినాశనం తప్పదనే మాటలు […]

Update: 2021-01-31 01:05 GMT

దిశ, ఫీచర్స్: 2020లో కొవిడ్ మహమ్మారి ప్రపంచదేశాలను భయభ్రాంతులకు గురిచేయగా, ప్రపంచ వినాశానికి ఇది హెచ్చరికని, త్వరలోనే ప్రపంచం అంతం కాబోతుందని ఎంతోమంది వ్యాఖ్యనించారు. డూమ్స్‌డే ప్రవచనాలు, మయాన్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్ 21, 2020 నాటికి ప్రపంచం అంతమైపోతుందని కొంతమంది సిద్దాంతకర్తలు తేల్చి చెప్పడంతో ప్రజలంతా భయపడిపోయారు. కానీ అది జరగలేదు 2012లోనూ ‘యుగాంతం’ ఊహాగానాలు రాగా అప్పుడు కూడా అది అబద్ధమని తేలింది. ప్రళయం వస్తుంది, ప్రపంచం అంతరిస్తుంది, ఇక వినాశనం తప్పదనే మాటలు తరుచుగా వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులు, ప్రపంచ యుద్ధాలు, అణుబాంబుల పేలుళ్ల వంటివి భూగోళానికి పొంచి ఉన్న పెద్ద ప్రమాదాలుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తుంటారు. అంతేకాదు ఆస్టరాయిడ్లు, గ్రహశకలాల నుంచి ఎంతో కొంత ప్రమాదం ఉందని వారు అంటున్నారు. పరిశోధకులు, శాస్త్రవేత్తలు, సిద్ధాంతులు, కాలజ్ఞానులు ఇలా ఎవరికి వారు యుగాంతంపై ఎప్పటికప్పుడు కొత్త కొత్త అభిప్రాయాలు, అంచనాలు వేస్తున్నారు. కాగా, ప్రపంచం అంతమయ్యే ప్రమాదాల తీవ్రత గురించి ముందుగా హెచ్చరించేందుకు ‘డూమ్స్ డే క్లాక్’ ఒకటుంది. దాని ప్రకారం ‘100’సెకన్లలో యుగాంతం రాబోతుందని శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేశారు. ఇంతకీ డూమ్స్ డే క్లాక్ అంటే ఏమిటి? నిజంగానే భూమి అంతమవుతుందా?

అమెరికాకు చెందిన కొంతమంది సైంటిస్టులు 1945లో ‘బులెటిన్ ఆఫ్ ద అటామిక్స్ సైంటిస్ట్‌’ అనే జర్నల్‌ను ప్రారంభించారు. ఈ జర్నల్‌ను నిర్వహించే శాస్త్రవేత్తలే..ప్రపంచ వినాశనానికి దగ్గరగా చేరుతున్నాయనే హెచ్చరికలను జారీ చేయగా 1947లో ‘డూమ్స్ డే’ గడియారాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన విపత్కర పరిస్థితులను ఆధారంగా చేసుకుని ‘డూమ్స్ డే క్లాక్’లోని సమయాన్ని శాస్త్రేవేత్తల బృందం సెట్ చేస్తుంది. అణ్వాయుధాలు, అణుయుద్ధాలు, వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు వంటి అంశాల వల్ల భూగోళానికి పెనువిపత్తు ముంచుకొస్తుందని డూమ్స్ క్లాక్ హెచ్చరిస్తుండగా, 1947 నుంచి ఇప్పటి వరకు ఈ గడియారంలో సమయాన్ని 20 సార్లు మార్చారు. మానవాళి వినాశనానికి ఎంత దూరంలో ఉందన్న దానిని బట్టి సమయాన్ని ముందుకు, వెనక్కు మారుస్తూ ఉంటారు. 2018లో యుగాంతానికి ఇక రెండే నిమిషాలు మిగిలివున్నాయని తెలిపేలా ‘డూమ్స్ డే క్లాక్’ను శాస్త్రవేత్తలు సవరించారు. ఇందులో రెండు నిమిషాలని అంటే..120 సెకన్లని కాదు, ప్రపంచ వినాశానికి చాలా దగ్గరగా ఉన్నామని అర్థం.

న్యూక్లియర్ వెపన్స్, ప్రధాన ఆయుధ ఒప్పందాల ఉల్లంఘన, అమెరికా, ఇరాన్‌ అణు ఒప్పందం విరమణ తదితర కారణాలతో 2020 జనవరిలో ‘డూమ్స్ డే క్లాక్’ను 100 సెకన్లకు మార్చారు. ఇక 2020లో కొవిడ్ విజృంభణతో లక్షలాది మంది మరణించడం, దాంతో తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం ఏర్పడటం, అణు,వాతావరణ ప్రమాదాలను ఎదుర్కొవడంలో పురోగతి లేకపోవడంతో విశ్వ వినాశనం దరిచేరుతుందని, అందుకే ఈ ఏడాది డూమ్స్ క్లాక్‌టైమ్‌ను మరోసారి 100 సెకన్లకు సెట్ చేస్తున్నట్లు ‘బులెటిన్ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్స్’ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 13 నోబెల్ గ్రహీతలను కలిగి ఉన్న బులెటిన్ బోర్డ్ ఆఫ్ స్పాన్సర్లతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ‘గంటలు, నిమిషాలు కాదు కేవలం సెకన్ల వ్యవధిలో మనం ఉన్నాం. అంటే వినాశనానికి ఎంత దగ్గరగా ఉన్నామో మనమే తేల్చుకోవాలి. ఇది మనకో వేకప్ కాల్. డూమ్స్ డే గడియార చరిత్రలో..యుగాంతానికి అత్యంత దగ్గరైన సమయం ఇదే. ఇప్పుడు మనం నిజమైన అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం’ అని బులెటిన్ అధ్యక్షుడు, సీఈవో రాచెల్ బ్రోన్సన్ తెలిపారు.

‘ఎన్నోదేశాల్లో అణ్వాయుధాల ఆధునీకరణ, విస్తరణ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 13వేలకుపైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అణు నష్టాలను తగ్గించడానికి దౌత్య ప్రయత్నాలు లేకపోవడంతో విపత్తు సంభవించే అవకాశం పెరుగుతోంది. సంప్రదాయిక లేదా అణు వార్‌హెడ్‌లను ఉపయోగించగల హైపర్సోనిక్ గ్లైడ్ వాహనాలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సెస్ ఉపయోగం పెరుగుతోంది. దాంతో గత 75 ఏళ్లలో ఎప్పుడూ లేని ప్రమాదం ప్రపంచానికి పొంచి ఉంది’ అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రాబోయే విపత్తును అడ్డుకోవాలంటే..అన్ని దేశాలు అణ్వాయుధాల విషయంలో పరిమితులు విధించుకోవడంతో పాటు, ప్రపంచ నష్టాలను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. వాతావరణ కాలుష్యాన్నితగ్గిస్తూ, జీవ పరిశోధనలను వేగవంతం చేసి, ఆరోగ్య సంక్షోభాలు రాకుండా తగిన చర్యలు పాటిస్తే యుగాంతం నుంచి మరి కొన్నేళ్లు పాటు తప్పించుకోవచ్చన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. డూమ్స్ డే క్లాక్‌తో పాటు, మరికొన్ని అధ్యయనాల ప్రకారం చూస్తే, భూమి అంతానికి మరికొన్ని లక్షల సంవత్సరాలు పట్టొచ్చు. కాకపోతే, సకల జీవరాశిని కాపాడుకునేందుకు భావి తరాలు భవ్యంగా బతికేందుకు వీలైనంతగా భూమికి నష్టం కలిగించే పనులు చేయడం మానితే అందరికీ బాగుంటుంది. అందుకోసం తమవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన పనులు చేయాలి.

Tags:    

Similar News