వర్షాకాలంలో మొక్కజొన్నసాగు వద్దంటున్నారు

దిశ, న్యూస్ బ్యూరో: రానున్న వర్షాకాలంలో మొక్కజొన్న పంటను అసలు పండించకపోవడమే ఉత్తమమని, ఎట్టి పరిస్థితుల్లో సాగుచేయవద్దని రైతులకు, ప్రభుత్వానికి వ్యవసాయ నిపుణులు సూచించారు. ప్రస్తుతం మొక్కజొన్నలకు మార్కెట్‌లో డిమాండ్ లేదని, రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా యాసంగి (రబీ)లో సాగుచేసుకోవడం మంచిదని సూచించారు. వ్యక్తిగత అవసరాలకోసమైతే పర్లేదుగానీ వ్యాపార పంటగా మాత్రం సాగుచేయడం లాభసాటి కాదని స్పష్టం చేశారు. గిట్టుబాటు ధర లభించాలంటే ఈసారి రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్‌లకు కలిపి 65 లక్షల ఎకరాలకంటే ఎక్కువ […]

Update: 2020-05-15 11:52 GMT

దిశ, న్యూస్ బ్యూరో: రానున్న వర్షాకాలంలో మొక్కజొన్న పంటను అసలు పండించకపోవడమే ఉత్తమమని, ఎట్టి పరిస్థితుల్లో సాగుచేయవద్దని రైతులకు, ప్రభుత్వానికి వ్యవసాయ నిపుణులు సూచించారు. ప్రస్తుతం మొక్కజొన్నలకు మార్కెట్‌లో డిమాండ్ లేదని, రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా యాసంగి (రబీ)లో సాగుచేసుకోవడం మంచిదని సూచించారు. వ్యక్తిగత అవసరాలకోసమైతే పర్లేదుగానీ వ్యాపార పంటగా మాత్రం సాగుచేయడం లాభసాటి కాదని స్పష్టం చేశారు. గిట్టుబాటు ధర లభించాలంటే ఈసారి రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్‌లకు కలిపి 65 లక్షల ఎకరాలకంటే ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట పండించవద్దని సూచించారు. పత్తికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నందున ఈసారి 70 లక్షల ఎకరాల్లో సాగు చేయవచ్చునని సూచించారు. కందులు కూడా గరిష్టంగా 15 లక్షల ఎకరాల వరకు సాగుచేయవచ్చని సూచించారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున వ్యవసాయరంగ నిపుణులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులతో సిఎం కేసీఆర్ శుక్రవారం సమావేశమైన సందర్భంగా పై సూచనలు చేశారు.

వర్షాకాలం మొక్కజొన్న దిగుబడి ఎకరానికి 25 క్వింటాళ్ల లోపు మాత్రమే వస్తుందని, యాసంగిలోనైతే 45 క్వింటాళ్ల వరకు వస్తుందని, అందువల్ల మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ లేని ఈ పంటను యాసంగిలో సాగుచేసుకోవడం మంచిదని నిపుణులు సూచించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి ఏడాదికి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేయాలని, అంతకంటే ఎక్కువ పండిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని సూచించారు. తెలంగాణ అవసరాలు, బియ్యం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సన్న, దొడ్డు రకాలు కలిపి వానాకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని పేర్కొన్నారు. వరితో పోల్చుకుంటే పత్తి సాగు లాభదాయకమని, గతంలో పత్తిని వర్షాల మీద ఆధారపడి సాగు చేసేవారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాగునీటి వసతి పెరిగినందున కాల్వల ద్వారా వచ్చే నీటితో పత్తిని సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని సూచించారు. వరి పంటలో రైతులకు ఎకరానికి రూ. 30 వేల నికర ఆదాయం వస్తే, పత్తి పంటకు మాత్రం అన్ని ఖర్చులూ పోను రూ. 50 వేల వరకు వస్తుందని సూచించారు. పత్తికి మార్కెట్లో డిమాండ్ ఉన్నందున రైతులకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు.

వ్యవసాయ నిపుణులు చేసిన సూచనలపై ప్రభుత్వం త్వరలో చర్చించనుంది. ఆ క్రమంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసే విధానాన్ని ఖరారు చేస్తుంది. సమగ్ర వ్యవసాయ విధానం, పంటల సాగు పద్ధతులపై క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. రైస్ మిల్లర్లతో చర్చలు అసంపూర్తిగా ముగియడంతో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలనే విషయంలో తుది నిర్ణయం జరగలేదు. అందువల్ల శుక్రవారం జరగాల్సిన వీడియో కాన్ఫరెన్సు ఈ నెల 18కి వాయిదా పడింది. అదే రోజున మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతుబంధు అధ్యక్షులు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు తదితరులతో మాట్లాడతారు.

Tags:    

Similar News