ఆత్మస్థైర్యంతోనే కరోనా నియంత్రణ
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా సమాజ జీవనాన్నే మార్చేస్తోంది. ఐతే ఈ మధ్య కాలంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో భయంతో కూడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రిలో తిండి పెట్టడం లేదని ఒకరు, శ్వాస కూడా కషష్టమవుతోంది ఆక్సిజన్ పెట్టడం లేదని ఇంకొకరు, నాన్నా.. నన్ను క్షమించు అంటూ మరొకరు.. సామాజిక మాధ్యమాల్లో తాను పడుతోన్న బాధను వివరిస్తూ పెడుతోన్న పోస్టింగులతో సమాజం మరింత ఆందోళనకు గురవుతోంది. వారి ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇదిలాగే కొనసాగితే […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా సమాజ జీవనాన్నే మార్చేస్తోంది. ఐతే ఈ మధ్య కాలంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో భయంతో కూడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రిలో తిండి పెట్టడం లేదని ఒకరు, శ్వాస కూడా కషష్టమవుతోంది ఆక్సిజన్ పెట్టడం లేదని ఇంకొకరు, నాన్నా.. నన్ను క్షమించు అంటూ మరొకరు.. సామాజిక మాధ్యమాల్లో తాను పడుతోన్న బాధను వివరిస్తూ పెడుతోన్న పోస్టింగులతో సమాజం మరింత ఆందోళనకు గురవుతోంది. వారి ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇదిలాగే కొనసాగితే ఎట్లా అన్న సందేహం తలెత్తుతోంది. తనకు కరోనా పాజిటివ్ వచ్చింది.. ఇక నా జీవితమే వృథా అన్న భావనకు వచ్చేస్తున్నారు. నలుగురు ఏం అనుకుంటారోనన్న ఆందోళన.. బంధుమిత్రులు దూరం చేస్తారన్న కలవరం. చనిపోతే నా పిల్లలేం అవుతారు? నా కుటుంబం ఏం అవుతుంది? ఇప్పుడిలాంటి భయమే పెను ఉత్పాతాన్ని సృష్టిస్తోంది. కానీ అవి ఎంతవరకు నిజమో మీ ఫ్యామిలీ డాక్టర్‌ను అడగాలి. మానసికంగా, శారీరకంగా బలంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే కరోనా వైరస్ ఎదుర్కోగలమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
టెస్టులకు ముందుకు రావడం లేదు
లక్షణాలు కనిపించినా టెస్టులకు ముందుకు రావడం లేదు. ఆయాసం ఎక్కువైన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. టెస్టులు చేస్తే పాజిటివ్ రాగానే భయపడుతున్నారు. ఆసుపత్రిలో బెడ్ లేదనగానే ఆందోళన, భయంతో కుప్పకూలుతున్నారని ఉస్మానియా ఆసుపత్రి చిన్న పిల్లల వైద్య నిపుణురాలు డా.అనురాధ చెప్పారు. అదే ముందే వస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. వైరస్ చనిపోయేంత తీవ్రత లేదు. కానీ భయం వల్లే ఆత్మహత్యలను ప్రేరేపిస్తోంది. ఆకస్మాత్తుగా తలెత్తే ఆ భయం ఉప్పెనలా ఉంటుంది. ఆ సమయంలోనే రోగులు కుప్పకూలిపోతున్నారని చెప్పారు. ఆ భయంతోనే శరీరంలో రియాక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అదే సమయంలో గుండెనొప్పి, రక్త ప్రసరణ నిలిచిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్స్ లేవన్న ప్రచారం కూడా భయపెడుతోంది. అందుకే జ్వరం, జలుబు, దగ్గు వంటి చిన్న సమస్యలతో ఆసుపత్రికి వస్తే అదే కారణాన్ని చూపిస్తున్నారు. ఏండ్ల తరబడి గుండె జబ్బులతో బతుకుతున్నారు. ఈ కరోనా వైరస్‌ను ఎదుర్కోలేమా అని డా.అనురాధ అన్నారు.
భయమే ఎక్కువ
కరోనా వైరస్ పట్ల భయపడొద్దు. దాని నియంత్రించేందుకు మందులు లేకపోవచ్చు. కానీ ‘ఆత్మస్థెర్యం’తో నివారించొచ్చు. అదొక్కటి ఉంటే చాలు. కరోనా పాజిటివ్ వచ్చినా ఏం చేయలేదని గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ విభాగంలో పేషెంట్ కౌన్సిలింగ్, ఎడ్యుకేషన్ కమిటీ సభ్యురాలు సైకియాట్రిస్టు డా.పింగళి శ్రీలక్ష్మీ స్పష్టం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి మానసిక పరిస్థితిని అంచనా వేసి ధైర్యంగా ఉండేందుకు శ్రమిస్తున్నాం. ఎప్పుడు సైకియాట్రిక్ అవసరమొచ్చినా వెంటనే కాల్ చేస్తున్నారు. ఫోన్‌లోనే కౌన్సిలింగ్ మొదలు పెడతారు. ఐనా వారు మానసికంగా కోలుకునేటట్లు లేకపోతే రోగితో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాం. వారి భయాందోళనలను పోగొట్టి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న రోగుల్లో ఆత్మస్థెర్యాన్ని నింపుతున్నామని డా.శ్రీలక్ష్మీ చెప్పారు.
మా కుటుంబం ఏం కావాలి?
పాజిటివ్ రిపోర్టు వచ్చిన వాళ్లలో అత్యధికం కుటుంబం ఏం కావాలన్న ఆలోచనే చేస్తున్నారు. మేం చనిపోతే మా పిల్లలు ఎట్లా? నా ఇల్లు ఎలా గడుస్తుంది? అంటూ భయపడుతున్నారు. నేను చనిపోతానేమో.. అంటూ ఎక్కువగా ఆలోచిస్తున్న వారే ఎక్కువగా ఉన్నట్లు డా. శ్రీలక్ష్మీ తెలిపారు. ఒకరిద్దరైతే మా కొడుక్కి వంట రాదు.. ఏం తింటున్నారో ఏమో? అంటూ ప్రేమ, ఆప్యాయతలకే బాండ్ అవుతూ ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.
డాక్టర్ దగ్గరా అబద్ధమే
ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు డాక్టర్ దగ్గరికి వచ్చినా అబద్ధాలే చెబుతున్నారు. లక్షణాలను సరిగ్గా చెప్పకుండా తప్పించుకుంటున్నారని వివేకానంద మెడికల్ సెంటర్ ఎండీ డా.కే రమేష్ సాగర్ చెప్పారు. ఇటీవల యాదాద్రి జిల్లా నుంచి ఓ పేషెంట్ వచ్చాడు. కేవలం జ్వరం వచ్చిందని, అది కూడా రెండే రోజులైందని చెప్పారు. కానీ లక్షణాలు చూస్తే కరోనా వైరస్‌గా కనిపించాయి. వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లమన్నాను. వాళ్లేమో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా అదే సమాధానం వచ్చింది. దాంతో కొన్ని గంటలు గడిచాయి. ఈ క్రమంలోనే అతడు మృత్యువు ఒడిలోకి వెళ్లాడు. లక్షణాలు ఉన్నాయంటే డాక్టర్ కూడా చూడరని భయపడుతున్నారు. ఈ భయాన్ని అధిగమించాలన్నారు.
కరోనా నియంత్రణకు ఇలా చేయాలి
– వాస్తవాన్ని అంగీకరించాలి. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలో నేనూ ఒక్కడిని.
– ప్రమాదమొస్తే ఎదుర్కొవాలి. పాజిటివ్ వస్తే చనిపోతామన్న భయం వీడాలి.
– భౌతిక దూరం పాటించాలి. ఆత్మీయతను ప్రదర్శించాలి.
– రోజూ వ్యాయామం చేయాలి. ప్రాణాయామం చేయాలి.