గులాబీలో గ్రూపులు.. నాయకుల్లో గందరగోళం
దిశ, అశ్వారావుపేట టౌన్: అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. అధికార టీఆర్ఎస్‌లో గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ క్యాడర్ నిరాశకు గురైంది. తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసిన మెచ్చా నాగేశ్వరరావు గెలుపొంది ప్రస్తుతం గులాబీ గూటికిందనే ఉండటం నిజమైన టీఆర్ఎస్ కార్యకర్తలకు మింగుడు పడని విషయంగా పరిణమించింది. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్తబ్దతగా ఉండటంతో ఆయన వెంట ఉన్న […]
దిశ, అశ్వారావుపేట టౌన్: అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. అధికార టీఆర్ఎస్‌లో గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ క్యాడర్ నిరాశకు గురైంది. తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసిన మెచ్చా నాగేశ్వరరావు గెలుపొంది ప్రస్తుతం గులాబీ గూటికిందనే ఉండటం నిజమైన టీఆర్ఎస్ కార్యకర్తలకు మింగుడు పడని విషయంగా పరిణమించింది. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్తబ్దతగా ఉండటంతో ఆయన వెంట ఉన్న కార్యకర్తలకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా తయారైంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కనుసన్నల్లో కార్యకలాపాలు సాగిస్తుండటంతో మెచ్చా వెంట వచ్చిన కొందరి తో పాటు తుమ్మల వర్గీయులు నియోజకవర్గంపై ఆధిపత్యం చేలాయిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మెజారిటీ అభిప్రాయానికి విరుద్ధంగా సంస్థాగత ఎన్నికలు
ఇటీవల జరిగి టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల్లో మెజారిటీ అభిప్రాయానికి వ్యతిరేకంగా కమిటీల ఎన్నిక జరిగిందని, ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వారిని విస్మరించి అసమర్థులకు పదవులు కట్టబెట్టారని నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన గళాలు వినిపించాయి. ఇందులో తుమ్మల నాగేశ్వరరావు వర్గం పూర్తిస్థాయిలో పదవులు దక్కించుకోవడం ఆయనను వ్యతిరేకించేవారు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కటయ్యేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించిన వారిని అందలం ఎక్కించడం కూడా దుమారం రేపుతోంది. దీనికి తోడు సామాజిక వర్గాల సమీకరణలో కూడా సరైన నిర్ణయం తీసుకోకపోవడం, ఉన్నత వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం విమర్శలకు తావిస్తోంది. అశ్వారావుపేట నియోజకవర్గం ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఎలాంటి ప్రాధాన్యతనివ్వకపోవడం ఆయా సామాజిక వర్గానికి చెందిన వారిని పార్టీకి దూరం చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
తుమ్మల మార్కు రాజకీయంపై పెరుగుతున్న అసంతృప్తి
అశ్వారావుపేట నియోజకవర్గంలో మొదటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఆధిపత్యం కొనసాగుతుంది. ఇప్పటివరకు ఆయన ఏకఛక్రాధిపత్యం కొనసాగించినా ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించే కొత్త తరం తయారవుతుంది. ఆయన సన్నిహితులు ఎమ్మెల్యేని పావుగా వాడుకుంటున్నారని, ఆయన్ని అడ్డంపెట్టుకుని నియోజకవర్గంలో పెత్తనం చేలాయిస్తున్నారని బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇటీవల నియోజవర్గం వ్యాప్తంగా జరిగిన సంస్థాగత ఎన్నికల్లో పదవులు దక్కని అనేక మంది వేరు వేరు వర్గాలను తయారుచేసుకొని తమ ఆధిపత్యం కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. దమ్మపేటలో కొందరు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ వర్గంలో కొనసాగుతుండగా, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, అశ్వారావుపేట మండలాలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా నియోజవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ముక్కలు చెక్కలై బలహీనపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ పార్టీ లో ఉన్న వర్గపోరు, ఆధిపత్య రాజకీయాలు ప్రతిపక్ష పార్టీలకు కలిసొచ్చే విషయంగా భావించాలి.
పార్టీ పునర్నిర్మాణం సాధ్యమేనా..?
అశ్వారావుపేట నియోజకవర్గంలో పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా జరిగిన సంస్థాగత ఎన్నికలలో దాదాపు పాత వారికే పదవులు కట్టబెట్టడంతో ఎన్నిక ముఖ్య ఉద్దేశం మరుగున పడినట్టు అయ్యింది. పాత చింతకాయ పచ్చడి అన్న చందంగా ఎన్నిక ప్రక్రియ కొనసాగిందని సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయంట. తెలంగాణ రాష్ట్రానికి ఒకానొక ముఖద్వారంగా స్వాగతం పలుకుతున్న అశ్వారావుపేట నియోజకవర్గం శాసనసభ స్థానం టీఆర్ఎస్ పార్టీకి అందని ద్రాక్షగా మారి వెక్కిరిస్తూనే ఉంది. ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికల్లో వరుసగా మూడు, రెండు సార్లు పదవి చేపట్టిన వారికే తిరిగి బాధ్యతలు అప్పజెప్పడంతో గత చేదు అనుభవాలే ఆశించాలి తప్ప కొత్తగా పార్టీ పునర్నిర్మాణం అనేది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్నలు కూడా గులాబీ శ్రేణుల్లో ఉత్పన్నం అవుతున్నాయని సమాచారం.