రంజాన్ రహస్యమేంటి ?.. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఎందుకు చేయాలి ?
రంజాన్... నెలరోజులపాటు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ.
దిశ, ఫీచర్స్ : రంజాన్... నెలరోజులపాటు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ. నెలరోజులపాటు ముస్లింలు రోజా ఉంటారు. రోజా అంటే ఉపవాసం అని అర్థం. హెన్రీఫోర్ట్ కమ్యూనిటీ కాలేజ్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం దేవదూత... మహహ్మద్ ప్రవర్తకు ఏ నెలలో ఇస్లామిక్ పవిత్ర గ్రంథాన్ని ఇచ్చాడో ఆ నెలలోనే రంజాన్ ప్రారంభం అవుతుంది. ఈ మాసంలోఆరాధన, ప్రార్థన, ఉపవాసం, ఖురాన్‌ను అధ్యయనం చేయడం వంటివి చేయాలని బలంగా విశ్వసిస్తారు. ఈ రంజాన్ సమయంలో ఎక్కువ సమయం మసీదులో గడపాలని, మసీదులోనే ప్రార్థనలు చేయాలని మతపెద్దలు చెబుతుంటారు. రంజాన్ మాసంలో ముఖ్యమైనది ఉపవాసం. ఈ ఉపవాసం ఎందుకు చేస్తారు... అందరూ ఉపవాసం చేయవచ్చా లేదంటే మినహాయింపు ఏమైనా ఉంటుందా తెలుసుకుందాం.
ఇస్లాం పునాదులు ఐదు స్తంభాలపై ఉంటాయి. అందులో ఒకటి ఉపవాసం. పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఉపవాసం ఉండేందుకు ప్రయత్నిస్తాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారం, నీటికి దూరంగా ఉంటాడు. ఉపవాసం చేసేవారు తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిపై దృష్టిపెడతారని, రోజా దానికి పూర్తిగా సహకరిస్తుందని అంటారు. ఉపవాస దీక్ష చేయడం వల్ల స్వీయ క్రమశిక్షణ అలవడుతుందని నమ్ముతారు. ఇతర జీవులపై దయ, కనికరం వంటివి కూడా పెరుగుతాయని బలంగా నమ్ముతారు. పేదలకు సహాయం చేయడం, జబ్బులతో బాధపడే రోగులకు సేవలు అందించడానికి ఉపవాసం సహకరిస్తుందని నమ్ముతారు.
రంజాన్ మాసంలో సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ అని పిలువబడే ప్రార్థన, భోజనంతో ఉపవాసం విరమించబడుతుంది. అకాడమీ ఆఫ న్యూటిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం, ఖర్జూరం, నీరు లేదా పాలతో ఉపవాసాన్ని విరమించడం ఆరోగ్యపరంగా మంచిదే. ఖర్జూరం, నీరు తీసుకున్నాక భోజనం.. అది కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చేయడం వారి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది.
ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదో నెల రంజాన్. చంద్రుని దశలపై ఆధారపడి రంజాన్ తేదీలు మారుతూ వస్తుంటాయి. సౌదీలోని చంద్రుని వీక్షణ కమిటీ రంజాన్ ప్రారంభ తేదీలను నిర్ణయిస్తుంది. నెలవంక కనిపించిన మరుసటి రోజు నుంచి రంజాన్‌ను పాటిస్తారు. అయితే, చంద్రుడు కనిపించకపోతే చంద్రుని స్థానాన్ని లెక్కించి నిర్ణయం తీసుకుంటారు. రంజాన్ మాసమంతా ఉపవాసం తరువాత చివరి రెండు రోజులు ఈద్‌ఉల్‌ఫితర్, రంజాన్ పండుగను జరుపుకుంటారు. పండుగ రోజు ఉదయం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆరోజు శక్తిమేరకు దానం చేస్తారు.