ఉగాది పండుగ విశిష్టత, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా?
తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది.
దిశ, వెబ్ డెస్క్: తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది. పురాణాల ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృత యుగం ప్రారంభమైంది. కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాదిగా జరుపుకుంటారు. అలాగే, ఈ రోజునే బ్రహ్మ దేవుడు ఈ జగత్తును సృష్టించాడని చెబుతారు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగ+ఆది యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది. తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది పేరు విశ్వావసు సంవత్సరం. ఇక ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది.. షడ్రుచుల సమ్మేళనంగా తయారయ్యే పచ్చడి. మార్చి 30న ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడి విశిష్టత తెలుసుకుందాం.
ఉగాది పచ్చడి.. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. అలాగే జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశం అందరికీ అందించడమే ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఇక ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీకగా సూచిస్తారు.
తీపి: ఉగాది పచ్చడిలో తీపి కోసం బెల్లాన్ని వాడుతారు. జీవితంలోని ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. అలాగే, బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి శక్తిని అందించి జీర్ణక్రియకు దోహదం చేస్తుంది.
పులుపు: ఇది జీవితంలో నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను సూచిస్తుంది. ఇక పులుపు కోసం కొత్త చింతపండును వాడతారు. చింతపండులోని పులుపు కఫ, వాతాల వల్ల వచ్చే రుగ్మతలను పోగొడుతుంది.
కారం: జీవితంలో ఎదురయ్యే కఠినమైన పరిస్థితులను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండేందుకు సంకేతంగా భావిస్తారు. ఇందు కోసం మిరియాలు లేదా పచ్చి మిరపకాయలు కానీ, మిరప్పొడి కానీ వాడతారు. కారం మనిషి శరీరంలోని హానికారక క్రిములను నాశనం చేసి పంచేంద్రియాలు చురుగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది.
ఉప్పు: జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో ముందుకెళ్లాలనే స్పూర్తిని నింపుతుంది. ఉప్పు మనిషికి ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది.
చేదు: జీవితంలో చేదు అనుభవాలను పాఠాలుగా తీసుకొని ముందుకెళ్లాలని సంకేతం. ఇందుకోసం వేపపువ్వు వాడుతారు. వేప పువ్వు ఋతువులు మారడం వలన కలిగే అనేక రోగాలను తరిమి కొడుతుంది.
వగరు: లేత మామిడి పిందెలను వాడతారు. లేత మామిడి పిందెలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉగాది పచ్చడిలో వగరు జీవితంలోని కొత్త సవాళ్లకు సంకేతం.
కాగా, తెలుగు వారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' పండుగ జరుపుకుంటారు