ఆ ఆలయంలో అద్భుతం.. బలి ఇచ్చిన మేకకు మళ్లీ ప్రాణం..

ఒకప్పటి కాలంలో కొన్ని ఆలయాల్లో జంతు బలులు జరుగుతుండేవి.

Update: 2024-10-10 08:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పటి కాలంలో కొన్ని ఆలయాల్లో జంతు బలులు జరుగుతుండేవి. అయితే ప్రస్తుతం అక్కడక్కడ కొన్ని ఆలయాల్లో మాత్రమే జంతుబలులు ఇస్తుంటారు. అలాగే గ్రామదేవతలకు, పొలిమేర దేవతలకు జంతు బలులు ఇస్తుంటారు. ఈ క్రమంలో ఓ అమ్మవారి ఆలయంలో కూడా మేకలను బలి ఇచ్చే సాంప్రదాయం ఉంది. కానీ అక్కడ జరిగే ఓ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమ్మవారి ముందు బలి ఇచ్చిన మేక కొద్ది సేపటికే మల్లీ బతుకుతుందంటున్నారు అక్కడి పూజారులు. వింటుంటేనే వింతగా ఉంది కదా. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆలయం బీహార్‌ రాష్ట్రంలోని కైమూర్ జిల్లాలో పన్వర కొండ పై ఉంది. ఈ ఆలయంలో మాతా ముండేశ్వరి భవాని కొలువై ఉన్నారు. ఇక్కడి అమ్మవారు ఎప్పుడు కూడా రక్త త్యాగం కోరుకోదని చెబుతారు. అలాగే ఇక్కడ జంతువులను బలి ఇచ్చే విధానం కూడా కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. మేకలను ఈ అమ్మవారి ముందు బలి ఇస్తే కత్తిని అస్సలు ఉపయోగించరు. అలా కాకుండా కొన్ని అక్షతలను అమ్మవారి ఆస్థానంలో వేసిన మరుక్షణం మేక చనిపోతుందని, మళ్లీ అక్షతలు పడగానే మేక సజీవంగా మారుతుందని చెబుతారు.

ఆ ఆలయం వివరాలు దుర్గా మార్కండేయ పురాణంలోని సప్తశతి విభాగంలో పేర్కొన్నారు. ఈ గ్రంథం తెలిపిన పురాణాల ప్రకారం పూర్వం చంద్, ముండ్ అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారట. ఈ రాక్షసులు చేసే ఆగడాలు భవాని మాత ఈ ప్రదేశానికి వచ్చేలా చేశాయట. మాతా భవాని చంద్‌ని వధించినప్పుడు ముండ్ అనే రాక్షసులు పన్వర కొండ పై దాక్కున్నాడు. అయినా భవాని వదలకుండా వెతికి పట్టుకుని ముండ్ ని వధించిందని పురాణం చెబుతుంది. ఆ తర్వాత శాంతించిన అమ్మవారు అదే స్వరూపంలో అక్కడే కొలువుదీరిందని చెబుతారు. ఆ ఆలయంలోని అమ్మవారిని చూడగానే ప్రకాశవంతంగా ఉంటుందని ఎవరూ కూడా అమ్మవారి విగ్రహం పై ఎక్కువ సేపు దృష్టి పెట్టలేరని చెబుతారు.

ఏడాది పొడవునా ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతారని చెబుతున్నారు పండితులు. భక్తుల కోరికలు నెరవేరిన వెంటనే అమ్మవారికి బలులు సమర్పించడానికి మళ్లీ ఆలయానికి వస్తుంటారట. అయితే ఇక్కడి అమ్మవారికి కోళ్లను కాకుండా మేకను బలి ఇచ్చే సంప్రదాయం ఉందని చెబుతున్నారు. కానీ బలి ఇచ్చిన మేక నుంచి ఒక్క రక్తపు చుక్క కూడా బయటికి రాదంట. అది ఎలా అంటే బలి ఇచ్చే మేకను అమ్మవారి ముందుకు తీసుకువచ్చి మంత్రం పఠించి పూజారి మేక పై అక్షతను విసురుతారు. ఆ అక్షతలు పడగానే మేక వెంటనే చలనం లేకుండా నేల పై పడి శ్వాస ఆగిపోతుందట. ఆ తర్వాత మిగతా పూజ కార్యక్రమాలను పూర్తి చేస్తారట. ఆ తర్వాత అమ్మవారి అక్షతలను మళ్లీ తీసుకుని మేక పై వేస్తారట. ఈసారి అక్షతల ప్రభావంతో మేక లేచి బయటకు పరుగులు తీస్తుందట. ఈ సంప్రదాయాన్ని చూసేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారట.


Similar News