ఆ పోలీస్ స్టేషనే విజయవాడ కనకదుర్గ పుట్టినిల్లు..
ఇంద్రకీలాద్రి పై కొలువుదీరి భక్తులను కాచే అమ్మవారి పుట్టినిల్లు ఓ పోలీస్ స్టేషన్ అంటే ఎవరైనా నమ్ముతారా.
దిశ, వెబ్ డెస్క్ : ఇంద్రకీలాద్రి పై కొలువుదీరి భక్తులను కాచే అమ్మవారి పుట్టినిల్లు ఓ పోలీస్ స్టేషన్ అంటే ఎవరైనా నమ్ముతారా. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న అది నిజం. అసలు పోలీస్టేషన్ అమ్మవారికి పుట్టినిల్లు ఎందుకు అయ్యింది. ఇంతకీ అది ఏ పోలీస్టేషన్ వివరంగా తెలుసుకుందాం..
పురాణాల ప్రకారం 14, 15వ శతాబ్డంలో కొండవీటి రెడ్డిరాజులు విజయాడ పరిసరప్రాంతాలని పరిపాలించేవారు. ఆ సమయంలో ప్రస్తుతం విజయవాడ ఉన్న స్థలంలో ఎలాంటి పట్టణం, గ్రామం ఉండేది కాదు. ఎక్కడ చూసినా చూట్టూ చెట్లు, దట్టమైన అడవులు ఉండేవట. ఆ ప్రాంతమంతా క్రూరమృగాలు సంచరిస్తూ ఉండేవట. కొంత మంది జాలర్లు కృష్ణానదిలో చేపలు పట్టేందుకు వస్తూ ఉండేవారు.
జాలర్లకు కాపలాగా ఉండేందుకు కొండవీటి రెడ్డిరాజులు ఇద్దరు సిపాయిలను నియమించాట. వారిలో ముఖ్యమైన అతని పేరు మంగయ్య. ఈ ఇద్దరు సైనికులు చాలా జాగ్రత్తగా వారి విధులను నిర్వహించేవారు. జాలర్లు నదిలో చేపలు పట్టి వాటిని కొండపల్లికి తీసుకువెళ్లేవారు. కొండపల్లిలో వెల్లే మార్గంమధ్యలో అంటే ప్రస్తుతం విజయవాడ 1టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలో జాలర్లు సేదతీరేవారని చరిత్ర చెబుతుంది.
కొద్దిసేపటి తరువాత మళ్లీ వారి ప్రయాణాన్ని కొనసాగించేవారట. ఏదో చిన్నపొరపాటు కారణంగా జాలర్లకు కాపలాగా ఉన్న ఇద్దరు సిపాయిలను విధుల నుంచి తొలగించారట అప్పటి పాలకులు. కొంతకాలం తరువాత నదిలో చేపలు పట్టేందుకు వచ్చే జాలర్లు వారు సేదతీరేందుకు అనుకూలంగా ఆ ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలను కట్టుకున్నారట. అలా ఆ ప్రాంతంలో ఓ చిన్న ఊరు ఏర్పడిందని చెబుతారు.
ఆ ఊరిని జాలర్లపల్లె అని పిలిచేవారట. ఉద్యోగం పోగొట్టుకున్న సైనికులు కూడా జాలర్లపల్లిలో జాలర్లతో కలిసి జీవనం సాగించేవారట. మంగయ్య జీవనాధారం కోసం మేకలను కాసేవాడు. ఒక రోజు మంగయ్య మేకలను తోలుకుని ఇంద్రకీలాద్రి కొండపై వెళ్లాడని, అక్కడ ఓ ప్రాంతంలో కూర్చొని ఏదో పరధ్యానంలో ఓ చిన్న రాయిని తీసుకుని మట్టిపైన ఏదో గీతలు గీస్తూ కూర్చున్నాడట.
అలా గీస్తూ ఉన్న సమయంలో ఆ మట్టిలోనుంచి ఓ చిన్న విగ్రహం లాంటి రూపం బయటపడిందచి చరిత్ర. అయినా మంగయ్య పరధ్యానంలో విగ్రహాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో అమ్మవారు ఆగ్రహించి సిపాయి మంగయ్య కూతురి ఒంటిలోకి పూనుకుందని చెబుతారు. దాంతో ఆ చిన్నపిల్ల గంభీరంగా మాట్లాడటం మొదలు పెట్టి ఏం మంగయ్య నేను అనుగ్రహించినా నన్ను పట్టించుకోకుండా వచ్చేస్తావా అంటూ అడిగిందట. ఆ మాటలు విన్న మంగయ్య విగ్రహం బయటపడిన ప్రదేశానికి వెళ్లి విగ్రహాన్ని వెలికి తీసి చూశాడట.
అది ఓ అద్భుతమై అమ్మవారి విగ్రహం. ఆ విషయం జాలర్లపల్లిలోని ప్రజలకు తెలిసి తిలికించి అమ్మవారికి ఓ చిన్న గుడిసెను నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారని చెబుతారు. అలా మంగయ్య అమ్మవారిని సేవిస్తూ ఉండగా ఓ రోజు రాత్రి అమ్మవారు మంగయ్య కలలో కనిపించిందట. అలా కనిపించిన అమ్మవారు మంగయ్య నన్ను నీ తోబుట్టువుగా భావించు, దసరా ఉత్సవాలకు మొదటి సారెను నీ చేతుల మీదుగా అందించు అప్పుడు నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను అనిచెప్పి మాయం అయ్యిందని చెబుతారు.
ఆ తరువాత కొంతకాలానికి మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యం అయ్యింది అని చెపుతుంటారు. దాంతో అమ్మవారే మంగయ్య చేతితో పూజలు అందుకునేందుకు అతని కూతురిలా వచ్చిందని ప్రజలు నమ్మకం. అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించిన మంగయ్య ఇల్లు కాలక్రమేనా శిధిలం అయిపోవడంతో బ్రిటిష్ అధికారుల కాలంలో 1900 సంవత్సరంలో మంగయ్య ఇల్లు ఉన్న ప్రదేశంలో ఓ పోలీస్టేషన్ ను నిర్మించారు. రాబర్ట్ హెన్స్ అనే బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమలను గురించి, ఆ పోలీస్టేషన్ గురించి ఓ శిలాశాషనంలో రాయించారంట.
కానీ ఆ పోలీస్టేషన్ కూడా శిధిలావస్థకు రావడంలో ఇప్పుడున్న 1 టౌన్ పోలీస్టేషన్ ను నిర్మించారు. ప్రస్తుతం బెజవాడ వన్ టౌన్ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువుగా భావించి మొదటి సారెను అమ్మవారికి అందిస్తారు. పోలీస్టేషన్ నుంచి వచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అలా బెజవాడ 1 టౌన్ పోలీస్టేషన్ అమ్మవారికి పుట్టినిల్లుగా, అక్కడి పోలీసులు అమ్మవారికి తోబుట్టువులుగా మారారు. ఇప్పటికే అదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుందని చెబుతుంటారు.