వసంత పంచమి విశిష్టత, పూజ విధానం
హిందువులు ప్రతి ఏటా మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే పంచమిని 'వసంత పంచమి'గా జరుపుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్: హిందువులు ప్రతి ఏటా మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే పంచమిని 'వసంత పంచమి'గా జరుపుకుంటారు. శీతకాలానికి, వేసవి కాలానికి సంధికాలమైన వసంత ఋతువు ఆరంభాన్ని సూచిస్తుండటంతో దీనిని వసంత పంచమిగా పిలుస్తారు. వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని పూజించి, పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈరోజున సరస్వతీ దేవిని పూజించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని హిందువులు నమ్ముతారు. ఇక ఈ ఏడాది వసంత పంచమి తిథి ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 9:14 ప్రారంభమై.. మరుసటి రోజు ఉదయం 6:52 గంటల వరకు ఉంటుంది.
వసంత పంచమి విశిష్టత
పురాణాల ప్రకారం.. త్రిమూర్తులలో ఒక్కరైన బ్రహ్మ దేవుని నోటి నుంచి మాఘ మాసం శుక్ల పక్ష పంచమి నాడు సరస్వతి మాత ఆవిర్భవించింది. ఈరోజు సరస్వతి మాత దర్శనమిచ్చి, ఈ లోకానికి ఒక శబ్దాన్ని ఇచ్చిందని చెబుతారు. అందుకే వసంత పంచమి రోజున ఇంట్లో తప్పనిసరిగా సరస్వతీ దేవిని పూజించాలని పండితులు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు భవిష్యత్తులో మంచి పురోగతిని సాధిస్తారని నమ్ముతారు.
వసంత పంచమి పూజా విధానం
వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని పూజిస్తారు హిందువులు. ముందుగా ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రపరచుకుని అలంకరించుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో దేవుడి విగ్రహాల వద్ద ఓ పీటను ఏర్పాటు చేయాలి. పీటకు పసుపు రాసి బియ్యం పిండితో స్వస్తిక్ గుర్తు, అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఆ పీటపై తెల్లని వస్త్రాన్ని ఉంచి దాని మీద సరస్వతీ దేవి ఫొటోను ఉంచాలి. ఆపై చిత్రపటానికి కుంకుమ, గంధం బొట్లు అలంకరించాలి. అనంతరం అమ్మవారి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది వత్తులను విడివిడిగా వేసుకొని దీపం వెలిగించాలి. పూజ చేస్తున్న సమయంలో 'ఓం ఐం సరస్వత్యై నమ:'అనే మంత్రాన్ని 21 సార్లు మనసులో చదువుకుంటూ ఉండాలి. పూజలో పుస్తకాలు, ఏదైనా సంగీత వాయిద్యాలు కూడా ఉంచాలి. అనంతరం సరస్వతీ దేవికి ఇష్టమైన బూందీ లడ్డూ, బూందీ పాయసంను ప్రసాదంగా సమర్పించాలి. ఈసారి వచ్చే వసంత పంచమి పండుగ సమయంలో అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ పర్వదినాన ఉత్తరాభాద్ర నక్షత్రం వేళ శివ యోగం, సిద్ధి యోగం ఏర్పడనున్నాయి. అంతేకాదు మకరంలో సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది.
వసంత పంచమి రోజు చేయకూడని పనులు
వసంత పంచమి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తువులు ధరించకూడదు. ఎవరి నుంచైతే జ్ఞానం, విద్యాబుద్ధులను పొందారో వారిని అవమానించకూడదు. అలాగే పొరపాటున కూడా మాంసం తినకూడదు. చెట్లను, మొక్కలను నరకకూడదు. ఇలా చేస్తే సరస్వతీ దేవి ఆగ్రహిస్తుందని చెబుతారు.