Patneshwar Nath Temple : అలనాటి కాంతి పుంజం.. అదే ఈనాటి పంచవటి పట్నేశ్వర్ నాథ్ క్షేత్రం..
ఎన్నో ప్రసిద్ధి గాంచిన హిందూ దేవాలయాలకు నెలవు మన భారతదేశం. వేల సంఖ్యలో ఉన్న ఆలయాల్లో దేని ప్రాముఖ్యత దానికే.
దిశ, ఫీచర్స్ : ఎన్నో ప్రసిద్ధి గాంచిన హిందూ దేవాలయాలకు నెలవు మన భారతదేశం. వేల సంఖ్యలో ఉన్న ఆలయాల్లో దేని ప్రాముఖ్యత దానికే. అలాగే బీహార్‌లోని బరియార్‌పూర్ లోని పట్నేశ్వర్ పర్వతం పై ఉన్న బాబా పంచవటి పట్నేశ్వర్ నాథ్ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. శ్రావణ మాసంలో ఇక్కడ నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ఈ దేవాలయం 466 సంవత్సరాల నాటిదని చరిత్రకారులు భావిస్తున్నారు. పౌరాణిక కథనాల ప్రకారం పట్నేశ్వర్ నాథ్ ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే చాలు నయం చేయలేని వ్యాధులు కూడా నయమవుతాయని, మోక్షానికి ద్వారాలు తెరుచుకుంటాయని చెబుతుంటారు.
ఎవరైతే పంచవటి పట్నేశ్వర్ నాథున్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తారో, సేవిస్తారో వారు వారి సమస్యల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. కుష్ఠు వ్యాధి వంటి నయంకాని వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందుతారని నమ్మకం. పురాణాల ప్రకారం ఈ ఆలయం సుమారు 466 సంవత్సరాల పురాతనమైనది, ఈ ఆలయం కోసం ఖైరా రాష్ట్రానికి చెందిన రాజ గురు ప్రసాద్ బ్రాహ్మణులకు నాలుగు ఎకరాల 66 దశాంశ భూమిని విరాళంగా ఇచ్చాడని చెబుతారు.
ఈ ఆలయానికి తూర్పు దిశలో ఐదు కొండలు ఉన్నాయి. అలాగే పశ్చిమాన దౌలత్‌పూర్ గ్రామం పక్కన చిత్రకూట్ ఘాట్, వాయువ్య మూలలో పటౌనా గ్రామం, దీనిని గతంలో పంపాపూర్ అని పిలిచేవారు. ఉత్తరాన అంజన్ నది, దక్షిణాన ఖైర్మా గ్రామం ఉంది. దీనిని గతంలో ఖర్దుసన్ తీన్ కా అఖారా అని పిలిచేవారని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ ఆలయం భూమి నుండి 90 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయ సముదాయంలో శివుడు, పార్వతి ఆలయమే కాకుండా దుర్గ అమ్మవారు, శ్రీరాముడు, బజరంగబలి, కాల భైరవ ఆలయాలు ఉన్నాయి. చాలా కాలం క్రితం తవ్వకాల్లో దొరికిన అనేక చిన్న శివలింగాలు కూడా ఈ ఆలయ సముదాయంలో ఉంచారు. పట్నేశ్వరాలయం చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రకృతి చాలా సుందరంగా తీర్చిదిద్దింది.
ఆలయం చుట్టూ ఉన్న పర్వతాలు, అడవులు పర్యాటకులను, భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ ప్రశాంత వాతావరణంలో ఉవ్వెత్తున ఎగసిపడే నది ప్రజల్లో కొత్త చైతన్యాన్ని కలిగిస్తుంది.
470 ఏళ్ల క్రితం దట్టమైన అడవిలో కాంతి పుంజం..
సుమారు 470 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో చాలా దట్టమైన అడవి ఉండేదని అక్కడి ప్రజలు చెబుతారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు కలప సేకరించడానికి ఇక్కడికి వచ్చేవారట. అయితే ఒక గొర్రెల కాపరి కలపను తీస్తున్నప్పుడు, ఆకుల కుప్ప మధ్యలో కాంతి పుంజం కనిపించిందట. ఉత్సుకతతో ఆకులను తీసి చూడగా నల్లరాయి రూపంలో ఉన్న శివలింగం కనిపించిందని చెబుతారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్థులకు సమాచారం అందించి, ఎంత తవ్వినా శివలింగం స్థిరంగానే ఉందట. ఆ తరువాత శివుడు ఒక వ్యక్తికి కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించాలని చెప్పాడట. గుడి కట్టిన తర్వాత ఆ వ్యక్తి మిగిలిన డబ్బు అంతా మాయం చేశాడట. దీంతో అతని కుటుంబం మొత్తం నాశనమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణ సమయంలో ఉన్న అనేక శిల్పాలు నేటికి కనుగొనబడ్డాయి.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అలాగే భాద్రపద మాసంలో సుమారు లక్షన్నర మందితో జలాభిషేకం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఒక పెద్ద జాతర నిర్వహిస్తారట. అలాగే ప్రతి సంవత్సరం సాంప్రదాయ కుస్తీ పోటీని కూడా ఇక్కడ నిర్వహిస్తారట. బసంత్ పంచమి రోజున, శివుని తిలకోత్సవం కూడా ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారని చెబుతుంటారు. అలాగే శివరాత్రి రోజున, శివ కళ్యాణం కూడా ఘనంగా నిర్వహిస్తారట.