నవ రాత్రులు.. తొమ్మిది నైవేద్యాలు.. ఏ రోజు ఏ ప్రసాదం పెట్టాలంటే..?
దసరా హిందువులు జరుపుకునే పండగలలో ఒకటి. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండగ.
దిశ, వెబ్‌డెస్క్: దసరా హిందువులు జరుపుకునే పండగలలో ఒకటి. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండగ. అమావాస్య నుంచి నవమి వరకు ఆడపడుచులు బతుకమ్మలు కూడా ఆడతారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీయుజ శుద్ధ నవమి వరకు అంటే తొమ్మిది రోజులు జరుపుకునే పండగని దేవీ నవరాత్రులు అంటారు. పదవ రోజును విజయ దశమిగా జరుపుకుంటారు. శరదృతువు ఆరంభంలో ఈ పండగ రావడంతో శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నవరాత్రులు మొదలైన నాటి నుంచి విజయదశమి వరకు శక్తి స్వరూపినిని కొలవడం విశేషం. మొదటి మూడు రోజులు పార్వతిదేవిని, తరువాత మూడు రోజులు లక్ష్మీ దేవిని, చివరి మూడు రోజులలో సరస్వతి దేవికి పూజలు చేస్తారు. అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకారిస్తారు. అంతే కాదు ఈ నవరాత్రుల్లో దుర్గామాత ఎంతో ప్రీతి కరమైన తొమ్మిది రకాల నైవేద్యాలను నివేదిస్తారు.
అసలు అమ్మవారికి ఏ నైవేద్యాలు అంటే ఇష్టం, ఏ రోజు ఏ నైవేద్యం పెడితే అమ్మవారు కరుణిస్తుందో ఇప్పుడు చూద్దాం.
చిట్టి గారెలు : అమ్మవారికి మినుములతో చేసిన చిట్టిగారెలు అంటే ఎంతో ఇష్టం. నవరాత్రి ఉత్సవాలు మొదలైన నాటి నుంచి ఆ తొమ్మిది రోజులు దుర్గామాతా మహిషాసురుడితో యుద్ధం చేస్తుంది. ఆ సమయంలో అమ్మవారికి ఎలాంటి అలసట రాకుండా 'మాష చక్రములు' అని పేరు గాంచిన చిట్టిగారెల్ని నైవేద్యంగా పెడతారు.
కట్టె పొంగలి : రెండో రోజున అమ్మవారికి బియ్యం, పెసరపప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి ఎంతో రుచికరమైన కట్టెపొంగలిని తయారు చేసి పెడతారు. ఈ నైవేద్యాన్ని కూడా అమ్మవారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారని ప్రతీతి.
దద్దోజనం : నిత్యం కొలిచే భక్తులకు చల్లని దీవెనలు అందించమంటూ, శాంతి రూపాన్ని కోరుకుంటూ, అన్నపూర్ణాదేవికి పెరుగుతో చేసిన దద్దొజనాన్ని నైవేద్యంగా పెడతారు.
నువ్వులన్నం : ఉప్పు, కారం, నువ్వులు, కొబ్బరి వేసి నువ్వులన్నాన్ని కమ్మగా వండుతారు. తొమ్మిది రోజులు దుర్గామాతా రాక్షసులతో పోరాడి నీరసించకుండా ఉండేందుకు నువ్వుల్లో ఉండే విష్ణుశక్తి తోడవ్వాలని ఈ ప్రసాదాన్ని నివేదిస్తారు.
చిత్రాన్నం : నిమ్మకాయ కలిపిన పుల్లని పులిహోరను భక్తులే కాదు ఆ జగన్మాత కూడా ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు.
గూడాన్నం : పెసరపప్పు, బియ్యం, ఉడకబెట్టిన బెల్లం, సుగంధ ద్రవ్యాల పొడి, నెయ్యి, ఎండు ఫలాలను వేసి గూడానాన్ని తయారు చేస్తారు. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి భక్తులు సకల శుభాలూ అందించమని కోరతారు.
అప్పాలు : గోధుమ పిండి, బియ్యప్పిండి, బెల్లం, సుగంధ ద్రవ్యాల పొడి వేసి చేసిన అప్పాలను అమ్మవారికి నివేదిస్తారు. ఆ ప్రసాదం అమ్మవారి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఎంతగానో ఇష్టపడతాడు.
శాకాన్నం : సన్యవృద్ధిని కోరుకుంటూ తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాల పొడి, తొమ్మిది రకాల కూరగాయలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
కదంబం ప్రసాదం : పదకొండు రకాల, పప్పు, బియ్యంతో చేసిన కదంబాన్ని దశమిరోజున అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన ఈ తొమ్మిది రకాల ప్రసాదాలను అమ్మవారికి నివేదించి, ఆమె ఆశ్వీర్వాదాలను పొందండి.