మహాలక్ష్మిగా దుర్గమ్మ.. మధ్యరాత్రి నుంచి సరస్వతీదేవిగా దర్శనం

Update: 2024-10-08 05:34 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి దేవీ శరన్నవరాత్రుల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో ఆరవరోజైన నేడు.. కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిస్తున్నారు. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి.. హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టిరూపమైన అమృతస్వరూపిణిగా శ్రీదుర్గమ్మ ఈరోజు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం వలన భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అమ్మల్ని గన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. రాత్రి 10 గంటల వరకూ మహాలక్ష్మి అలంకరణలో, మధ్యరాత్రి నుంచి సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు. తెలంగాణలోని బాసలో దసరా నవరాత్రుల్లో భాగంగా నేడు శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి.. కాత్యాయనీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. 


Similar News