Sharannavaratri: మహాచండీదేవిగా దుర్గమ్మ.. నైవేద్యం, అలంకరణ వివరాలివీ
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మవారు నేడు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తున్నారు. భక్తులు కొండ కిందివరకూ అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో ఉన్నారు.
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో 5వ రోజైన నేడు కనకదుర్గమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండకింద వినాయకస్వామి ఆలయం వరకూ భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. నేడు అమ్మవారికి ఎర్రటి చీర, ఆభరణాలతో అలంకరించారు. అమ్మవారు సింహ భుజాలపై భీషణంగా కూర్చుని.. 8 చేతుల్లో వివిధ ఆయుధాలను ధరించి.. రాక్షస సంహారం చేసి లోకకల్యాణం చేసిన రూపమే శ్రీ మహాచండి.
నేడు ఆశ్వీయుజ శుద్ధ పంచమి పర్వదినం కావడంతో.. శ్రీ మహాచండి యాగం, పారాయణం చేస్తారు. అలాగే పులగం ను నైవేద్యంగా సమర్పించి.. భక్తులకు అందజేస్తారు. మహాచండి అమ్మవారిని పూజించిన వారికి దైహిక, మానసిక శక్తి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని నమ్ముతారు.
శ్రీశైలంలో స్కందమాత..
శ్రీశైలంలోనూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నేటి సాయంత్రం అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు శేషవాహనంపై కొలువుదీరి ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఆదిదంపతుల గ్రామోత్సవం జరగనుంది.