శంఖంతో ఇలా చేస్తే ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయట..
హిందూమతంలో శంఖానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
దిశ, ఫీచర్స్ : హిందూమతంలో శంఖానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆలయాల్లో, ఇంట్లో ఏవైనా పూజలు నిర్వహించినప్పుడు శంఖం ధ్వనితో ప్రారంభిస్తారు. అంతేకాదు చాలా మంది వారి పూజ గదిలో శంఖాన్ని పెట్టి పూజిస్తారు. అయితే పూజ గదిలో ఎన్ని శంఖాలు పెట్టాలి, పూజలో ఏ శంఖం వాడితే శ్రేయస్కరం అన్న విషయాలు చాలా మందికి తెలిసి ఉండదు. ఈ విషయంలో పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
శంఖు చక్రాలు ఎన్ని ఉండాలి ?
శాస్త్రాల ప్రకారం ఇంటి పూజా మందిరంలో ఒక శంఖం మాత్రమే ఉంచాలి. మరొక శంఖాన్ని పూజ సమయంలో వాడేందుకు ఉంచాలి. పూజలో వాడిన శంఖాన్ని పూజ గదిలో పెట్టి పూజించకూడదట. ఎందుకంటే శంఖం ఊదేటప్పుడు నోటిలో పెడుతుంటాం. దాంతో అది పవిత్రతను కోల్పోతుందని అందుకే పూజ గదిలో పెట్టకూడదని చెబుతుంటారు. అందుకే ఇంట్లో రెండు శంఖాలు పెట్టుకోవాలి.
వాస్తు దోషాలను నివారించే మార్గాలు
రాత్రిపూట పూజ శంఖాన్ని నీటితో నింపి ఉంచి, ఉదయాన్నే ఇంటిలో ఈ నీటిని చల్లాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఈ శంఖంతో ఇంట్లో పూజ చేయండి..
శాస్త్రం ప్రకారం పూజకు దక్షిణావర్తి శంఖాన్ని మాత్రమే ఉపయోగించాలి. దక్షిణావర్తి శంఖం లక్ష్మీ దేవి స్వరూపం అని నమ్ముతారు. ఈ శంఖాన్ని పూజలో ఉపయోగించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ప్రసాదించే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. అందుకే ఈ శంఖాన్ని పూజలో పెడితే మంచి ఫలితాలు వస్తాయట.
శంఖాన్ని ఎరుపు రంగు గుడ్డతో కప్పి ఉంచాలి..
పూజ కోసం పూజగదిలో పెట్టిన శంఖం బయటివారికి కనిపించకుండా భద్రపరచాలి. అందుకే శంఖాన్ని ఎప్పుడూ శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రంతో కప్పి ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతారు. అంతే కాదు అలా చేస్తే ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు ఉంటాయని నమ్ముతారు.