పంచామృతం, చరణామృతం మధ్య తేడా ఏంటో తెలుసా.. వీటి ప్రాముఖ్యతను తెలుసుకోండి మరి..
హిందూ మతంలో పూజలకు, వ్రతాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందో చరణామృతం, పంచామృతాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.
దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో పూజలకు, వ్రతాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందో చరణామృతం, పంచామృతాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆలయాల్లో ఇంట్లో పూజలు, వ్రతాలు నిర్వహించినప్పుడు చరణామృతం, పంచామృతాలను భక్తులు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. అలాగే ఆలయాన్ని సందర్శించే భక్తులకు పూజారులు తరచూ పంచామృతం, చరణామృతాన్ని ప్రసాదంగా ఇస్తారు. అయితే చాలామందికి చరణామృతం, పంచామృతం మధ్య తేడా ఏంటో తెలియదు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పంచామృతం...
ఐదు వస్తువులతో కలగలసిన పదార్థాన్ని పంచామృతం అంటారు. దేవాలయంలో, ఇంట్లో జరిగే పూజల్లో, వ్రతాల్లో, దేవుని ప్రతిష్ట సమయంలో పంచామృతాన్ని సిద్దం చేస్తారు. దీన్ని ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గంగా జలం, పంచదారలను కలిపి తయారు చేస్తారు. భగవంతుని అభిషేకానికి, నైవేద్యానికి ఈ పంచామృతం సిద్ధిస్తుంది. ఇది భగవంతుని పవిత్రం చేస్తుంది. ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం, శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు పంచామృతాన్ని తయారు చేసి దేవునికి అభిషేకం చేస్తారు. ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు.
చరణామృతం అంటే ఏమిటి..
చరణామృతం అంటే భగవంతుని పాదాలను తాకిన తులసి నీటిని అంటారు. ఈ అమృతాన్ని ఎలా సిద్దం చేస్తారంటే ముందుగా శాలిగ్రామ స్వామివారికి గంగా జలంతో అభిషేకం చేసి అందులో తులసి దళాన్ని కలుపుతారు. స్వామివారి పాదాలను తాగిన ఆ అమృతాన్ని భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు. అయితే ఈ చరణామృతం తీసుకోవడానికి, సేవించడానికి కొన్ని నియమాలు ఉన్నాయని పురాణ గ్రంథాలు, పండితులు చెబుతున్నారు. ఆ నియమాల ప్రకారమే చరణామృతాన్ని తీసుకోవాలి. ఆ నిమయం ఏంటంటే చరణామృతాన్ని ఎప్పుడూ కుడిచేతితో మాత్రమే తీసుకోవాలని చెబుతారు. అలాగే ఆ చరణామృతాన్ని ఎల్లప్పుడూ రాగి పాత్రలో తయారు చేస్తారు. దీని ద్వారా అనేక అనారోగ్య సమస్యతు తొలగిపోతాయని పండితులు చెబుతున్నాయి. దేవాలయాలలో చరణామృతాన్ని రాగి పాత్రలో ఉంచడానికి బహుశా ఇదే కారణం కావచ్చు.
ప్రసాదంలో ఎందుకు వాడతారు?
పంచామృతం పవిత్రమైనది దీన్ని దేవుడి విగ్రహాలకు అభిషేకించి ప్రసాదంగా ఇవ్వడానికి ఉపయోగిస్తారు. పంచామృతాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా భగవంతుడు ప్రసన్నుడై భక్తులకు ఆయన అనుగ్రహం లభిస్తుంది. చరణామృతం హిందూ మతంలో చాలా పవిత్రంగా పరిగణిస్తారు. చరణామృతంలో భగవంతుని మహిమ ఇమిడిపోతుందని నమ్ముతారు. దీన్ని సేవించడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. అందుచేత ప్రసాదంలో పంచామృతం, చరణామృతం వాడతారు.