Mysterious Temple: ఈ గుడిలోకి భక్తులు అస్సలు వెళ్లలేరు.. కారణం తెలిస్తే షాకవుతారు!
భగవంతుడికి - భక్తుడికి మధ్య అనుసంధాన కర్తలుగా దేవాలయాలు వ్యవహరిస్తాయి.
దిశ,ఫీచర్స్: భగవంతుడికి - భక్తుడికి మధ్య అనుసంధాన కర్తలుగా దేవాలయాలు వ్యవహరిస్తాయి. అందుకే ప్రతి పండుగకు భక్తులు ఆలయాలకు వెళ్లి దేవుడ్ని దర్శించుకుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే గుడికి మాత్రం ఏ భక్తుడు కూడా వెళ్లడు. ఆ ఆలయం గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..
హిమాచల్ ప్రదేశ్ లోని చంబాలోని భర్మోర్ అనే చిన్నపట్టణంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ వందలు కాదు వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో కథ ఉంటుంది. అలాంటి ఒక దేవాలయం చంబా జిల్లాలోని భర్మౌర్‌లో ఉన్న యమధర్మరాజు ఆలయం. ఇక్కడ ఆయనకు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. అపమృత్యు దోషం తొలగించమని ప్రార్థిస్తారు. కానీ ఈ గుడిలోకి మాత్రం ఏ భక్తుడు కూడా వెళ్లడు. ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ యమధర్మ రాజు ఆలయాన్ని చంబా రాజు 6వ శతాబ్దలో పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం కేవలం యమ ధర్మరాజు కోసమే కట్టారని, అందుకే ఆయన తప్ప ఇంకెవరూ ఈ గుడిలోకి ఎవరు వెళ్ల లేరని అక్కడి స్థానికుల చెబుతున్నారు. ఎప్పుడూ యమధర్మరాజు పక్కనే ఉండే చిత్రగుప్తుడికి ఈ ఆలయంలో ఓ ప్రత్యేకగది ఉంది. మనుషుల పాపాల చిట్టాను చిత్రగుప్తుడు ఈ గదిలోనుంచే రాస్తాడని .. తప్పొప్పులన్నీ అక్కడ నిక్షిప్తమవుతాయని నమ్ముతుంటారు. ఈ ఆలయానికి బంగారం, వెండి, రాగి, ఇనుముతో చేసిన నాలుగు రకాలైన ద్వారాలు ఉన్నాయి. ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో వారి ఆత్మలన్నీ ఇనుప ద్వారం లోపలికి వెళ్తాయని, పుణ్యం చేసిన వారి ఆత్మలు బంగారం ద్వారం ద్వారా లోపలికి వెళ్తాయని విశ్వాసం. ఆలయం లోపలకు అడుగుపెట్టకుండా బయటి నుంచే నమస్కారం చేసుకుని వెళ్లిపోతారు.