బతుకమ్మ పండుగ - చరిత్ర కోణం

బతుకమ్మ పండుగపై కొత్త తెలంగాణ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ గారి సమగ్ర వివరణ

Update: 2024-10-08 15:10 GMT

దిశ, వెబ్ డెస్క్ : జానపదులు తమసంతు దక్కాలని అమ్మదేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మదేవతల ముందు కట్టిన ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టినపిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే, పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని ‘పెంటమ్మ లేదా పెంటయ్య’ అని పేరు పెట్టుకుంటారు. మరి కొందరు పుట్టినపిల్లల్ని ఎవరికైనా ఇచ్చి ‘బిచ్చంగా’ తిరిగియ్యమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు ‘భిక్షపతి,భిక్షమ్మ’లని పేరు పెట్టుకుంటారు. వాళ్ళే బుచ్చపతి, బుచ్చమ్మలుగా పిలువబడు తుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకనిపిల్ల బారెడనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమనే వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు.

సమ్మక్క మేడారంలో బతుకయ్య పేరున్న వాళ్ళు ఇపుడు కూడా వున్నారు.

తొలిపూతకు పూజచేస్తరు తెలంగాణల.

ఇంట్ల బీరపాదు, పొట్లపాదు, గుమ్మడిపాదు పూతపూస్తే తొలిపూలకు పసుపు, కుంకుమలద్ది పూజిస్తరు. ఇది ఆ చెట్టు ఫలించడానికి సిద్ధమైనదని తెలిపేదే కదా పువ్వు.

స్త్రీలు పుష్ఫించడం కూడా(ఫ్యూబర్టీ) విశేషంగా పండుగలెక్క చేసే ఆచారమే. అమ్మతనాన్ని ఆరాధించే ప్రక్రియే...ఈ బతుకమ్మ.

ఈ పూలపండుగ బతుకమ్మ ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దులబతుకమ్మతో ముగిసిపోతుంది.

బొడ్డెమ్మపండుగ నాడు ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా వలలో , బిడ్డాలెందారే.. వలలో’ అని పాడే పాట సంతానం గురించే కదా. నాటి రోజుల్లో నీళ్ళాడే(ప్రసవ)సమయాల్లో శిశుమరణాలు జాస్తిగా వుండేవి.

నీటిరేవులే ఆనాటి తల్లులకు ప్రసూతిస్థలాలు.

నీళ్ళల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమసంతు బతికినందుకు ప్రతీకగా నీటివారనపెరిగే తంగేడు, గునుగు పూలముద్దలను నిమజ్జనం చేసివుంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మపండుగగా మారివుంటుంది. ఇది తెలంగాణా ప్రాంతానికే చెందడం మనగొప్పసంస్కృతికి సాక్ష్యం.

(సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత గోపీనాథ్ మొహంతి ‘అమృత సంతానం’ నవలలో ఒక గిరిజనబాలిక నీటిప్రవాహంలోనే బిడ్డకు జన్మనివ్వడం, ఆ అమ్మాయి నదికి మొక్కడం వర్ణించబడ్డాయి.)

ఎవ్వరికన్న ఐదారుగురు కన్నా ఎక్కువమంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్ళు. మానవజాతి పిల్లలవల్లనే కదా ఇన్ని వేలయేండ్లుగా మనగలిగింది. అందుకే తల్లికంత గౌరవం. అమ్మతనంమీద భక్తి. ఆ భక్తే అమ్మదేవతలను కల్పించింది. పూజించింది.

అమ్మదేవతలపూజల్లో ఒక ఆరాధనారూపమే మన బతుకమ్మ.

బౌద్ధంలో ముందు చెడ్డదేవతగా, పిల్లల్ని ఎత్తుకపోయే రాక్షసిగా పిలువబడ్డ హారీతి బుద్ధునివల్ల మంచిదానిగా, పిల్లల్ని రక్షించే దేవతగా మారిపోయింది. ఆమెనే పిల్లలదేవతగా కొలుస్తారు. పుట్టిన తమ పిల్లలు బతుకాలని, రోగాలు, రొష్టులు లేకుండ వుండాలని హారీతిని ఆరాధించేవారు. ఈ దేవతను గురించి బౌద్ధజాతకకథల్లో చదువగలం. వివిధ చారిత్రకదశల్లో ఈ దేవత విగ్రహాలు వేర్వేరు రూపాల్లో అగుపిస్తున్నాయి. చాళుక్యులు తమను తాము హారీతిపుత్రులుగా శాసనాల్లో చెప్పుకున్నారు.2వ శతాబ్దంలో ఇక్ష్వాకుల కాలంనుండి హారీతి శిల్పాలు కనిపిస్తున్నాయి.12వ శతాబ్దందాకా శాసనాల్లో హారీతిపేరు ప్రస్తావించబడ్డది. పిల్లల్ని బతికించే దేవత హారీతినే బతుకమ్మగా భావించినారేమో.

కూష్మాండిని దేవతకు ప్రతీకగా గుమ్మడిపువ్వును పూజించే ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం. మనపూర్వీకులు ఇనుము-ఉక్కు తయారీకి తంగేడుచెక్కను వాడేవారని నేను విన్నాను. తోలుతయారీకి తంగేడు ఎంత అవసరమో అందరికి తెలుసు. గునుగుకు నీళ్ళను శుభ్రపరిచే గుణముంది. తమకు నిత్యజీవితాసరాలైన తంగేడు, గునుగుపూలతో మనపూర్వీకులు తమ అమ్మదేవత(కూష్మాండిని?)ని పూజించే రూపమే పరిణామంలో జాతరగా మారివుంటుంది. గునుగు, తంగేడుపువ్వులతో కొప్పురం రూపంలో పూలబతుకమ్మను పేర్చి, శిఖరం లేదా సిగమీద గుమ్మడి పువ్వుంచి, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు.

పూజపువ్వులను తొక్కుట్లవెయ్యని ఆచారమే బతుకమ్మలను నీళ్ళలో వదిలే సంప్రదాయమైంది.

దసరా పండుగ సందర్భంగా కొలిచే హిందూదేవత నవదుర్గారూపాల్లో కూష్మాండిని ఒకటి. ఎనిమిదవ రోజున కూష్మాండినిని అర్చిస్తారు. అదేరోజు బతుకమ్మలాడుతారు. కొన్ని ప్రాచీన ఆచారాలను మతాలు స్వంతం చేసుకున్న క్రమం చరిత్రలో కనిపిస్తుంది మనకు. ఈ పండుగకు కూడా కులాల మసిపూయడం అనాచారం. ఇది ఎక్కువ (పెద్దకులాల) వాళ్ళ పండుగ కాదు తక్కువ(చిన్నకులాల,జాతుల) వాళ్ళదే. గిరిజనులదే.

తొలి మొలకలను, తొలిపూతను కొలిచే ఆచారం గిరిజనులదే. పువ్వంటే రేపటి ఫలమని వాళ్ళకు తెలుసు. ఆడపిల్లలను, పువ్వుల్ని కొలిచే పండుగే మన బతుకమ్మ.

ఈ పండుగకు మతం లేదు. మతాచారాలు రుద్దబడ్డాయి. మనప్రాంతంలో కూష్మాండిని ఆరాధన జైనులవల్ల వచ్చింది. జైనమతానుయాయులైన కాకతీయులవల్ల ప్రోత్సహించబడ్డది. జైనంలో 22వ తీర్థంకరుని శాసనదేవత, యక్షిణి అంబిక(అంబ=అమ్మ) లేదా కూష్మాండిని (గుమ్మడితీగె, గుమ్మడిపువ్వు). ఈమె ప్రతిమాలక్షణంలో చేతుల్లో ఫలాలతో, ఇద్దరు పిల్లలతో,మామిడిచెట్టుకింద కూర్చొనివున్నట్టు వుంది. అంబిక కూడా ఒక అమ్మదేవతే.ఈ దేవతలకు ప్రతిమారూపాలు క్రీ.శ.5వ శతాబ్దం నుంచే కల్పించబడ్డాయి. అంతకు ముందున్నట్టు చారిత్రకాధారాలు లేవు.

బతుకమ్మల తయారీలో కూడా చాలా భేదాలు కనిపిస్తాయి. బతుకమ్మలు స్తూపాల ఆకారంలో వుంటాయి. లింగాల తయారీలో కూడా ఇటువంటి సంప్రదాయముందని చాలాచోట్ల చెప్పబడింది.

పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న ఉద్దేశిక స్తూపాలను పూలు, మట్టి, ఇసుక, పేడ, రాయి, ఇటుకలతో తయారుచేసుకునేవారు. బౌద్ధభిక్షుకులు నిరంతరం ప్రయాణిస్తుండడం వల్ల స్తూపారాధనకు తమకు దొరికిన వాటినే స్తూపాలుగా చేసుకుని బుద్దునికి ప్రతీకగా నమస్కరించేవారు. పూలు, ఇసుక, మట్టి, పేడ స్తూపాలను నీటిలో కలిపేసేవారు మర్యాదగా. వాళ్ళు తిరుగాడిన ప్రదేశాల్లోని ఎన్నో వాగులు, ప్రవాహాలు భిక్కేరులుగా పిలువబడుతున్నది ఒక్క తెలంగాణలోనే. అందువల్లనే తొలుత బౌద్ధులైన గిరిజనులు, వనజనులు ఈ ఆచారాన్ని కొనసాగించివుంటారు. దానికి వారి కోరికలు మన్నించిన అమ్మదేవతకు ప్రతీకగా తర్వాత చేసుకుని వుంటారు.

పిదప కాలాల్లో వచ్చిన మతపరిణామాలవల్ల ఈ దేవతలను తమ,తమ మతదేవతలుగా చేసుకున్నారు. ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా, జైనంలో ఆమ్రకూష్మాండినిగా, హిందూమతంలో అంబికగా పూజింపబడ్డారు. తెలంగాణాలో అతిప్రాచీనమైన అమ్మదేవతల ఆరాధనమే తల్లులరూపంలో ఏ దేవతవచ్చినా తమదేవతల్లో కలుపుకున్న సంప్రదాయమే బతుకమ్మజాతరగా నిలిచిపోయింది.

దసరాపండుగతో బతుకమ్మను కలుపడం, అమ్మదేవతలను కాకుండా పితృదేవతలను పూజించే ఆచారంగా మారడం ‘పెత్రామాస’(పితృ అమావాస్య)ను ఈ పండుగలో చేర్చడం తర్వాతి కాలాల్లో వచ్చిన పరిణామమే.

జనపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేలయేండ్ల పూర్వపువి. ఒక్కో జాతికి, ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మనకు, మన తెలంగాణాకే పరిమితమైంది.

ప్రపంచంలో మరెక్కడా లేని పూలపూజ మన సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మనమూలాలను ఎరుకపరిచే మంచిసంప్రదాయం. బతుకమ్మ అచ్చతెలుగు మాట.

దాన్ని ఎవరో అన్నట్టు ‘బృహదమ్మ’ (ఏ దేవతా లేదు) అని సంస్కృతీకరించి పౌరాణికం చెయ్యొద్దు.

కీ.శే. ఆవాల బుచ్చిరెడ్డిగారు రాసిన కథ:

వేములవాడ రాజరాజేశ్వరాలయం నిర్మాణం కొలతలకు, తమిళనాట బృహదీశ్వరాలయం కొలతలకు హస్తిమశకాంతర(ఏనుగుకు, దోమకు ఉన్నంత) భేదం ఉంది. వేములవాడ నుంచి ఏ చోళరాజో ఎత్తుకునిపోయి అంత పెద్దలింగాన్ని అక్కడ పెట్టుకున్నారని చెప్పిన ఒక పెద్దాయన కథను మరిచిపోవాలె. అది అసంగతం. అనుచితం. అంతకాకున్నా ఏ పురాణంలోను లేని బృహదీశ్వరుని భార్య బృహదమ్మ(ఒక విరుద్ధసమాసం) అని చెప్పి, ఆమె తెలుగువాండ్లు పలుకలేక బతుకమ్మ అన్నారనడం తగని మాట.

- శ్రీరామోజు హరగోపాల్

కొత్త తెలంగాణ చరిత్రకారుడు 


Similar News